Monday, September 22, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపట్టు తప్పితే అంతే..

పట్టు తప్పితే అంతే..

- Advertisement -

వాగు దాటాలంటే తీగల వంతెనే ఆధారం
తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న స్థానికులు
చిన్న వాగు ప్రవాహ ఉధృతితో విద్యార్థుల ఇక్కట్లు
బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్‌


నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
అది కేబుల్‌ వంతెన కాదు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీగల వంతెన అంతకన్నా లేదు.. తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామస్తులే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న తీగల వంతెనె ద్వారా రైతులు, విద్యార్థులు వాగు దాటుతున్నారు.. పట్టు తప్పితే అంతే..పెను ప్రమాదం తప్పదు. కేసరి సముద్రం నుంచి వచ్చే చిన్న వాగు దాటడానికి పుల్జాల, కార్వంగ గ్రామాల రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పులిజాల నుంచి విద్యార్థులు కార్వంగ వెళ్లడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తీగల వంతెనే ఆధారం. తీగల మీద నుంచి వాగు దాటుతుంటే ఏమాత్రం పట్టుదప్పినా నదిలోకి పడిపోతారు. అత్యంత ప్రమాదకరమైన ఈ దారితో బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నాగర్‌కర్నూల్‌ మండలం పుల్జాల తెలకపల్లి మండలం కార్వంగ గ్రామాల మధ్య కేసరి సముద్రం నుంచి చిన్న వాగు పారుతుంది. వర్షాల సమయంలో పొంగి పొర్లుతుంది. పుల్జాల నుంచి ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు సుమారు 50 మంది ఈ దారివెంటనే పాఠశాలకు వెళ్తుంటారు. దానిపై కార్వంగ, పుల్జాల రైతులు, పుల్జాల విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి తీగల వంతెనను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. కింద తీగలతో అల్లిన జాలిపైన చేతికి ఒక వైరు మాత్రమే ఆధారం. జాలిపై నడుస్తూ వైర్లు పట్టుకొని వాగు దాటుతారు. వంతెనపై నడుస్తున్న సమయంలో అధిక బరువుతో వంతెన ఊగుతుంది. అధిక వర్షం.. వరదల ఉదృతికి వంతెన పడిపోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వంతెన నిర్మాణం చేయిస్తాం..
పుల్జాల నుంచి కార్వంగ రావడానికి విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వాగు వంతెన ఉధృతంగా ప్రవహిస్తున్నంత కాలం రాకపోకలు నిలిచిపోతాయి. అందుకే గ్రామస్తుల కృషితో జాలి వంతెన ఏర్పాటు చేశాం. అది కూడా అధిక వర్షాలకు కూలిపోయే ప్రమాదం ఉంది. వంతెన నిర్మాణం చేయాలని ఎమ్మెల్యేను అడిగాం. ఆయన సాలుకూలంగా స్పందించారు. ఏడాదిలోపు వంతెన నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు.
కార్వంగ మాజీ సర్పంచ్‌ అమరేంద్ర రెడ్డి

అధికారులకు విజ్ఞప్తి చేశారు..
రోజూ 50 మంది విద్యార్థులకు పైగా పుల్జాల నుంచి కార్వంగకు వస్తుంటారు. ఇరు గ్రామాల రైతులు కూడా వందలాది మంది వచ్చి పోతుంటారు. రెండు గ్రామాల మధ్య కేసరి సముద్రం నుంచి వచ్చే చిన్నవాగు ఆటంకంగా మారింది. ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, రైతులు ప్రభుత్వాన్ని అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా ఎలాంటి స్పందనా లేదు.
మురళీధర్‌ రెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కార్వంగ, తెలకపల్లి మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -