Thursday, May 22, 2025
Homeప్రధాన వార్తలుమనుషుల్ని చంపడాన్ని మెచ్చుకుంటే మానవత్వం భ్రష్టు పడుతుంది

మనుషుల్ని చంపడాన్ని మెచ్చుకుంటే మానవత్వం భ్రష్టు పడుతుంది

- Advertisement -

– 16 నెలల్లో జరిగిన ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి
– ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే రద్దు చేయాలి ొ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి : ప్రొ. జి.హరగోపాల్‌

నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
మనుషుల్ని చంపడాన్ని మెచ్చుకుంటే మానవత్వం భ్రష్టు పడుతుందని, చట్టబద్ధ పాలన ఉనికి లేకుండా పోతుందని, రాజ్యాంగం అపహాస్యమవుతుందని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్‌, ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌.నారాయణ రావుతో కలిసి ఆయన మాట్లాడారు. మే 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, జంగ్‌ పత్రిక ఎడిటర్‌ నవీన్‌తో పాటు 27 మంది చనిపోయిన ఘటనపై, గడిచిన 16 నెలల్లో జరిగిన ఎన్‌కౌంటర్లపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం ఎన్‌కౌంటర్లలో 528 మందిని కేంద్ర బలగాలు పొట్టన పెట్టుకున్నాయని, ఇందులో దాదాపు 400 మంది ఆదివాసీలేనని, 150 మంది మహిళలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను మట్టుబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో దండ కార్యాణాన్ని ఖాళీ చేయించి ఆ ప్రాంతాన్ని బహుళజాతి సంస్థలకు బదిలీ చేయాలనే కుట్రలో భాగమే ఈ ఆపరేషన్‌ కగార్‌ అని విమర్శించారు. ప్రయివేటు పెట్టుబడిదారుల లాభాల కోసం ప్రభుత్వాలు పని చేస్తున్నాయని, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాయని, అడవులను హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగం సాక్షిగా అధికారంలోకి వచ్చిన పాలకులు రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్నారు. జీవించే హక్కు సంక్షోభంలో పడుతున్నదని, దేశంలో బలగాల రాజసం చలామణి అవుతూ అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నారని తెలిపారు. కేంద్రం తన బలగాలను రాష్ట్రంలో మోహరించి ఫెడరల్‌ విధానాన్ని ధ్వంసం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని సమాజమంతా డిమాండ్‌ చేస్తుంటే పట్టించుకోకుండా కాల్పుల మోతను మరింత పెంచారన్నారు. అమెరికా అధ్యక్షుడి జోక్యంతో పాకిస్థాన్‌పై కాల్పుల విరమణ పాటించి, యుద్ధాన్ని నిలువరించిన భారత పాలకులు.. దేశంలో ఉద్యమకారులతో చర్చలు జరపడానికి అదే ఔదార్యాన్ని ప్రదర్శించలేకపోవడం అత్యంత విషాదకరమన్నారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే రద్దు చేయాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. పోలీస్‌, సీఆర్పీఎఫ్‌ క్యాంపులను ఎత్తేయాలని, ఆదివాసీ మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు జక్కా బాలయ్య, కిషన్‌ నాయక్‌, ఆజాద్‌, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -