– టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్
– తప్పుడు మాటలు మాట్లాడితే బుద్ధిచెప్తాం
– కేంద్రం నిబంధనల ప్రకారమే అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు టెండర్ : మంత్రి సీతక్క
నవతెలంగాణ-ములుగు
త్యాగం, సేవ అనేవి కాంగ్రెస్ పార్టీ లక్షణాలని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే కాక ప్రపంచంలో అత్యంత చారిత్రాత్మకమైన పార్టీ అని అన్నారు. పార్టీ శాశ్వతమని, ప్రభుత్వాలు వస్తూ పోతాయని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కార్యకర్తల కృషి, కష్టం కీలకమని గుర్తుచేశారు. గత పాలనలో రాష్ట్రం అప్పులు భారీగా పెరిగినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పదవుల కోసం కాకుండా సేవ కోసం కాంగ్రెస్ పని చేస్తుందన్నారు.
వాళ్లే ఆ ఆరోపణలు చేస్తున్నారు : మంత్రి సీతక్క
అవినీతి సీతక్క అంటూ తప్పుడు మాటలు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదవులు పొందడం కంటే పార్టీ కోసం పని చేయడం ముఖ్యమని స్పష్టం చేశారు. అలాంటి నాయకులకే ఉన్నత పదవులు వస్తాయని, అందుకు ఉదాహరణగా మహేశ్‌కుమార్‌గౌడ్ ఎదుగుదలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేండ్లలో తెలంగాణను తమ సొంత ఆస్తిగా భావించిన నాయకులు ఇప్పుడు అసత్య ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే కోర్టుకు వెళ్లి పరువు నష్టం దావాలు వేస్తామన్నారు. ఇప్పటికే కొంతమందిపై సైబర్ క్రైమ్ కేసులు కూడా నమోదు చేసినట్టు వెల్లడించారు. అంగన్వాడీ సిబ్బందికి ఫోన్ల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. కేంద్రం సూచించిన నిబంధనల ప్రకారం పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించామని చెప్పారు. మొదట రూ.14,000 కోట్ వచ్చినప్పటికీ దాన్ని రద్దు చేసి, చివరకు రూ.11,650 లకు కొనుగోలు చేశామని వివరించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలు చెబుతున్నాయన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలకు అసహనం పెరుగుతోందని విమర్శించారు. మేడారం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులపై వచ్చిన విమర్శలను సీతక్క కొట్టిపారేశారు. మేడారం గద్దెల వద్ద జరిగిన ప్రమాదాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు. పనుల్లో లోపం ఉంటే సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తప్పుడు ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కొని పార్టీ ప్రతిష్టను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుంజసూర్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్ పాల్గొన్నారు.
ఆధారాలు లేకుండా మాట్లాడితే పరువు నష్టం దావాలు వేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



