బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త రవీందర్ రావు
నవతెలంగాణ – ఉప్పునుంతల
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడటం తెలంగాణ సమాజానికే అవమానమని మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు కొత్త రవీందర్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సీట్ విచారణకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా ఆదివారం మండలం కేంద్రంలో పోచమ్మ చౌరస్తాలో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని హెచ్చరించారు.
పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కడే భుజాన వేసుకొని రాష్ట్ర సాధన కోసం పోరాడిన నాయకుడిని ఈరోజు సీట్ విచారణ పేరిట అవమానించడం కాంగ్రెస్ కే నష్టమని అన్నారు.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లోనే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని, రాబోయే మున్సిపల్, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను ఓటు రూపంలో భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కట్ట గోపాల్ రెడ్డి, లతీపూర్ సర్పంచి మున్యా నాయక్, ఉపసర్పంచులు మొల్గర రమేష్, లతీపూర్ సైదులు, మరిపల్లి కొండలు, సీనియర్ నాయకులు కొట్టే శీను, ఉప్పునుంతల గ్రామ అధ్యక్షుడు శీను, ఎండీ కాజా, సుధాకర్, చిన్నా జంగయ్య, బింగి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.



