Monday, November 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకష్టపడి పండిస్తే చెత్తాచెదారమా..?

కష్టపడి పండిస్తే చెత్తాచెదారమా..?

- Advertisement -

ప్రాథేయపడినా వినిపించుకోవడం లేదు
సీసీఐ చిక్కులు.. పత్తి రైతు తిప్పలు
రైతుల కష్టాలు వర్ణనాతీతం
తేమశాతం చూడకుండానే తిరస్కరణ
గత్యంతరం లేని స్థితిలో ప్రయివేటుగా రైతుల విక్రయాలు
రాష్ట్రంలోని 380 జిన్నింగ్‌ మిల్లుల్లో ఏదో ఒక రకంగా ఇబ్బందులు


నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
”రెండు బండ్ల పత్తి తీసుకుని తల్లాడ జిన్నింగ్‌ మిల్లుకు వెళ్లాను. మిల్లు వ్యక్తి వచ్చి శాంపిల్‌ పరిశీలించాడు. పిడికెడు దూది పట్టుకొని చెత్తాచెదారం ఉంది.. నాణ్యత సరిగా లేదని వెళ్లిపోయాడు. ప్రాధేయపడి మళ్లీ తీసుకొచ్చినా తేమ శాతం చూడకుండా తిరస్కరించాడు. వర్షం వల్ల పంట దెబ్బతిందని వేడుకున్నా వినిపించుకోలేదు. గొడవ చేస్తానేమోనని పోలీసులను తీసుకొచ్చాడు. పోలీసులను, జిన్నింగ్‌ మిల్లు సిబ్బందిని వేడుకున్నా కనికరించలేదు. తీసుకుపోయిన పంటను వెనక్కు తెచ్చాను. క్వింటాల్‌కు రూ.200 చొప్పున తొక్కుడు కూలి, పత్తి రవాణా వాహనానికి చెల్లించాను. ఇంటికొచ్చాక తొక్కిన పత్తిని ఖాళీ చేసి ఆరబోశాను. ”
-బాణోత్‌ లక్మా, పుఠానీతండా, రఘునాథపాలెం మండలం

ఈ ఏడాది పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఎక్కడ చూసినా ఇవే తిప్పలు. పంట ఏరే సమయంలో ఎడతెరపి లేని వర్షాలతో నాణ్యత దెబ్బతింది. ఇదే అదనుగా సీసీఐ కొనుగోళ్లలో రకరకాల కొర్రీలు పెడుతోంది. తేమ శాతం చూడకుండానే వర్షాలకు దెబ్బతిన్న పత్తి నాసిరకంగా ఉందని కొనుగోలు చేయటం లేదు. పత్తి నల్లగా ఉంది.. తేమ శాతం నిబంధనలకు విరుద్ధంగా ఉందని తిరస్కరిస్తున్నారు. ఒక్కో బస్తాకు పది చోట్ల పొడిచి తేమ శాతం అధికంగా ఉందనిపిస్తున్నారు. ఎంత మంచి క్వాలిటీ అయినా ఏదో ఒక రకంగా సీసీఐ తిరకాసు పెడుతుండటంతో చేసేది లేక రైతులు అక్కడే జిన్నింగ్‌ మిల్లు యజమానులకు అరకొర ధరలకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని 122 సీసీఐ కొనుగోలు కేంద్రాలు, 380 జిన్నింగ్‌ మిల్లుల్లో ఏదో ఒకరకంగా కొర్రీల తంతు కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో 9 జిన్నింగ్‌ మిల్లుల్లో ఆరింట విక్రయాలు సాగుతున్నాయి. వీటిలో రోజుకు పావు శాతం పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుండగా.. ముప్పావంతు పంటను ప్రయివేటుగా విక్రయించుకోవాల్సిన పరిస్థితి.

ఈ నామ్‌ ఇక్కట్లూ తప్పట్లే..!
రాష్ట్రంలోని పలుమార్కెట్లలో జాతీయ అగ్రీ మార్కెట్‌ విధానం (ఈ నామ్‌) అమల్లో ఉన్నా రైతులకు ఇక్కట్లు తప్పట్లేదు. ఈ నామ్‌ విధానంలో కొర్రీలకు తావులేకున్నా ఖరీదుదారులు మాత్రం ఏదో ఒకరకంగా పేచీ పెడుతున్నారు. సీసీఐ కేంద్రాల తీరును పసిగట్టిన వ్యాపారులు కాంటాల సమయంలో పంట నాణ్యత సరిగా లేదని కొర్రీలు పెడుతున్నారు. సీక్రెట్‌ బిడ్డింగ్‌లో ఎంత ధర రాబోతుందో కేవలం రెండు గంటల ముందే రైతుకు తెలుస్తుండటాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. ఖమ్మం పత్తి యార్డులో ఉన్న ఖరీదుదారులు కమీషన్‌ పద్ధతిలో గుజరాత్‌, తమిళనాడు, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలకు పంటను ఎగుమతి చేసే సమయంలో సొమ్ము చేసుకుంటున్న తీరు రైతులనే కాదు కమీషన్‌దారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

నాణ్యతను బట్టే నిర్ణయం
పత్తి నాణ్యతను వర్గీకరించి సీసీఐ ధరలను నిర్ణయించింది. మీడియం స్టాప్‌ కాటన్‌ రూ.7,710, లాంగ్‌ స్టాప్‌ కాటన్‌ రూ.8,110 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. ఈ మేరకు నాణ్యత ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తుంది. ఏ రైతు సరుకు అయితే తిరస్కరణకు గురైందో.. దాని క్వాలిటీ గురించి తెలియకుండా మాట్లాడలేం కదా..! తేమ శాతం, నాణ్యత ఆధారంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. నిబంధనల మేరకు క్వాలిటీ, తేమ శాతం ఉన్నా రిజెక్ట్‌ చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
-పిన్‌రెడ్డి శ్రీనివాసరెడ్డి, అదనపు కలెక్టర్‌, ఖమ్మం

అధిక తేమ పేరుతో కొర్రీలు
తేమ శాతం 12లోపు ఉండాలనేది సీసీఐ నిబంధన. కానీ 11.4 శాతం తేమ వచ్చినా సీసీఐ అధికారులు తిరస్కరిస్తున్నారు. ఒకచోట సరిగా వస్తే మరో మూలకు చూడటం.. అక్కడ కూడా బాగుంటే.. మరో చోట ఇలా పలుచోట్ల పరిశీలించి 12శాతానికి పైగా తేమ ఉందని చెప్పి రిజెక్ట్‌ చేయటం సాధారణం అయిందని రైతులు వాపోతున్నారు. ఒకవేళ తేమ శాతం నిబంధన మేరకు ఉంటే నాణ్యత పేరుతో తిరికాసు పెడుతున్నారు. చెత్తాచెదారం, నల్లగా ఉందని తిరస్కరిస్తున్నారు. ఆరబెట్టుకరమ్మని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఆరబెట్టి తెచ్చినా మళ్లీ ఏదో ఒక కారణం చూపి తిరస్కరిస్తుండటంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకు క్వింటాల్‌ రూ.6వేల నుంచి 6,500 చొప్పున అమ్ముకుంటున్నారు. ఇష్టారాజ్యంగా జిన్నింగ్‌ మిల్లు సిబ్బంది తిరస్కరిస్తుండటంతో రైతులు వారితో వాదనకు దిగుతున్నారు. అధికారులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -