Sunday, September 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రపంచదేశాల అభ్యర్థనలు బేఖాతర్‌

ప్రపంచదేశాల అభ్యర్థనలు బేఖాతర్‌

- Advertisement -

గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ దాడులు
38 మంది మృతి

గాజా స్ట్రిప్‌ : గాజాలో ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ పాటించాలని, యుద్ధాన్ని ఆపాలని అంతర్జాతీయ సమాజం ఎంతగా ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఇజ్రాయిల్‌ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా శనివారం ఇజ్రాయిల్‌ జరిపిన దాడులు, కాల్పుల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య అధికారులు తెలిపారు. మధ్య, ఉత్తర గాజాలో తెల్లవారుజామునే దాడులు మొదలు పెట్టడంతో ఇండ్లల్లో నిద్రిస్తున్న వారు అలాగే విగతజీవులుగా మారిపోయారు. నుసైరాట్‌ శరణార్థి శిబిరంలోని ఓ ఇంటిలో తలదాచుకుంటున్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోయారు. నగర శివారులోని తుఫాలో ఓ ఇంటిని ఇజ్రాయిల్‌ దళాలు కూల్చివేశాయి. ఈ ఘటనలో 11మంది చనిపోగా వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే. షాతీ శరణార్థి శిబిరంలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలో నలుగురు మరణించారు. దక్షిణ, మధ్య గాజాలో ఆశ్రయం పొందుతున్న ఆరుగురు పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ దళాలు కాల్పులు జరపగా వారు చనిపోయారు. గాజాలో హమాస్‌ను అంత మొందిస్తామని ఐరాస సర్వసభ్య సమావేశంలో సహచర ప్రపంచ నేతలకు ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ చెప్పిన కొద్ది గంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం.

గాజా నగరంలోని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు నామ మాత్రంగా పనిచేస్తున్నాయి. కొన్ని ఇజ్రాయిల్‌ దాడుల్లో ధ్వంస మయ్యాయి. మందులు, వైద్య పరికరాలు, ఇంధన కొరత వాటిని వేధిస్తోంది. ఇజ్రాయిల్‌ ముమ్మర దాడుల కారణంగా వైద్య సేవలు నిలిపివేయాల్సి వస్తోందని ‘డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ అనే సహాయ సంస్థ తెలిపింది. ఇదిలావుండగా ఉత్తర ప్రాంతంలో ఆహార పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ నెల 12వ తేదీ నుంచి సరఫరాలను ఇజ్రాయిల్‌ అడ్డుకుంటోంది. దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతంలోకి సరఫరాలను అనుమతిం చాలంటూ ఐరాస చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కొన్ని దేశాలు ఇటీవలే పాలస్తీనాను గుర్తించి ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచాయి.

ఆర్థిక సాయాన్ని స్వాగతించిన పాలస్తీనా అథారిటీ
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పాలస్తీనా అథారిటీ (పీఏ)ని ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ సేవలు కొనసాగడానికి సౌదీ అరేబియా, జర్మనీ, స్పెయిన్‌ దేశాలు 170మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని హామీ ఇవ్వగా పీఏ స్వాగతించింది. ఐరాస సర్వసభ్య సమావేశానికి హాజరైన ఈ దేశాల నేతలు ఆర్థిక సాయంపై హామీ ఇచ్చారు. పీఏకు రావాల్సిన పన్ను ఆదాయాన్ని ఇజ్రాయిల్‌ తన వద్దే అట్టే పెట్టుకోవడంతో అథారిటీ పీకల్లోతు కష్టాల్లో పడింది. రమల్లా నుంచి పీఏ తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 2007లో గాజాను హమాస్‌ తన ఆధీనంలోకి తెచ్చుకోవడంతో అక్కడ పీఏకు ఎలాంటి నాయకత్వ పాత్ర లేకుండా పోయింది. తనకు నెలకు 400 మిలియన్‌ డాలర్ల చొప్పున ఆరు నెలల పాటు అందించాలని పీఏ కోరుతోంది. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పీఏను గాజా యుద్ధం మరింత ఇబ్బంది పెడుతోంది. వెస్ట్‌బ్యాంక్‌లో అది అందిస్తున్న సేవలు ఇటీవలి కాలంలో బాగా క్షీణించాయి. అథారిటీ బడ్జెట్‌లో 68 శాతం పన్ను రాబడి బదిలీలను ఇజ్రాయిల్‌ నిలిపివేసిందని, ఇక ఎలా పని చేయగలమని పాలస్తీనా ప్రధాని ప్రతినిధి అబూ అల్‌-రాబ్‌ ప్రశ్నించారు. నిధుల కోత కారణంగా వెస్ట్‌బ్యాంక్‌లోని పాఠశాలలు వారానికి మూడు రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -