– నాతో ఆడుకోవాలని చూస్తే వారికే నష్టం
– ఎవడో సైకో, శాడిస్ట్ ఏదో సోషల్ మీడియాలో పెడుతున్నాడు : ఎంపీ ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు
నవతెలంగాణ- మేడ్చల్
”తుఫాను వచ్చే ముందు సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. మౌనంగా ఉండే వాన్ని బలహీనుడిని అని అనుకోవద్దు.. నాతో ఆడుకోవాలని చూస్తే నష్టం ఎవరికో మీకు తెలుస్తుంది” అంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ మున్సిపాల్టీ పరిధి పూడూరు గ్రామంలోని తన నివాసంలో శనివారం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను స్ట్రీట్ ఫైట్ చేయను.. స్ట్రెయిట్ ఫైట్ మాత్రమే చేస్తానని తెలిపారు. తాను బేజాప్తా కాదు, బాజప్తా బీజేపీ కోసం యుద్ధం చేయడానికే వచ్చానని, కుట్రదారులతో కాదు, ధీరులతో పోరాటం చేస్తానని అన్నారు. మిమ్మల్ని గెలిపించలేనంత నిస్సహాయుణ్ణి కాదని కార్యకర్తలతో అన్నారు. పిచ్చి వేషాలు వేస్తే నష్టం ఎవరికో మీకు తెలుస్తుందని, తన జోలికి రావద్దని హితవు పలికారు. సోషల్ మీడియాలో ”ఎవడో సైకో, శాడిస్ట్ ఏదో పెడుతున్నాడు.. వాడు ఎవడు? ఏ పార్టీ వాడు? ఎవరి అండతో పెడుతున్నాడు?” అని అన్నారు. సోషల్ మీడియాను నమ్ముకొని అబద్ధాల పునాదుల మీద.. కుట్రలు కుతంత్రాల మీద కొంతమంది బతుకుతున్నారని విమర్శించారు. నకిలీ ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ”బీ కేర్‌పుల్..” అంటూ హెచ్చరించారు. కడుపులో కత్తులు పెట్టుకొని కోట్లాడే స్వభావం తనది కాదన్నారు.
ఈటలపై కుట్రలు మానాలి..: గౌతంరెడ్డి
ఈటల నివాసంలో సమావేశమైన కార్యకర్తల్లో బీజేపీ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గౌతంరెడ్డి, రామచందర్‌రావు తదితరులు పాల్గొని.. ఈటలపై జరుగుతున్న కుట్రలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ”హుజురాబాద్‌లోనే ఎందుకు విభేదాలు వస్తున్నాయి? ఈటలని దూరం చేయాలనే కుట్ర ఎవరిది? పార్టీని నమ్మి పని చేసిన కార్యకర్తల మనసు విరగకూడదు” అని అన్నారు.
నేను స్ట్రెయిట్ ఫైట్ చేస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES