సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు
పసిడి విజయానంతరం నిఖత్ జరీన్
గ్రేటర్ నోయిడా
రెండు సార్లు ప్రపంచ చాంపియన్, ఆసియా గేమ్స్ పతక విజేత నిఖత్ జరీన్ హైదారాబాద్‌లో బాక్సింగ్ అకాడమీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ప్రొఫెషనల్ బాక్సింగ్ సాధనకు కనీసం మౌలిక సదుపాయాలు లేనటువంటి నిజామాబాద్ వంటి గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగిన నిఖత్ జరీన్.. తెలంగాణ నుంచి ప్రపంచ స్థాయి బాక్సర్లను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో బాక్సింగ్ అకాడమీ నెలకొల్పాలని ఎదురుచూస్తోంది. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ అనంతరం మీడియాతో మాట్లాడిన నిఖత్ జరీన్ ఈ విషయాన్ని వెల్లడించింది.
సీఎంని కలిసి మాట్లాడుతా
హైదరాబాద్‌లో ప్రపంచ శ్రేణి బాక్సింగ్ అకాడమీ స్థాపించాలని అనుకుంటున్నాను. అకాడమీ నిర్మాణం కోసం స్థలం కేటాయించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే సీఎం రేవంత్‌ను కలిసి అకాడమీ ఏర్పాటు, స్థలం కేటాయింపు అంశంపై మాట్లాడతాను. రాష్ట్ర ప్రభుత్వం అండతో అకాడమీ ఏర్పాటు చేస్తానని ఆశిస్తున్నాను.
మళ్లీ రేసులోకి వచ్చాను
ఫైనల్లో విజయం ఎంతో సంతోషానిచ్చింది. అంతర్జాతీయ వేదికపై నేను మళ్లీ పసిడి విజేతను. భవిష్యత్‌లోనూ ఇదే జోరు కొనసాగించి, భారత్‌కు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానని అనుకుంటున్నాను. ఆసియా గేమ్స్ విజయం తర్వాత ఇంటర్నేషనల్ లెవల్‌లో ఇదే నాకు తొలి పసిడి ప్రదర్శన. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్‌కు భారత్ వేదిక కావటంతో పుంజుకునేందుకు ఇదే సరైన వేదిక అనిపించింది. ఆ దిశగా కష్టపడ్డాను. ఈ విజయంతో గొప్ప సంతోషంగా ఉంది.
ఇది ఆరంభమే
వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్ విజయం ఆరంభమే. సీనియర్ నేషనల్స్, ఆసియా చాంపియన్‌షిప్స్ కోసం సన్నద్ధం మొదలుపెడతాను. వరుస పతకాలతో అంచనాలు భారీగా పెరుగుతాయి. లివర్‌పూల్‌లో మెడల్స్ తర్వాత మీనాక్షి, జాస్మిన్ సైతం ఇది చవిచూశారు. నిలకడగా రాణిస్తే అంచనాలను ఎక్కువగా ఉంటాయి. ఒలింపిక్స్ విభాగంలో పసిడి సాధించటం సాధారణ విషయం కాదు. ఈసారి అభిమానుల అంచనాలను అందుకున్నందుకు ఆనందంగా ఉంది అని నిఖత్ జరీన్ తెలిపింది.



