నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: ఖమ్మం మధిర పట్టణంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు శాంతియుత ర్యాలీ నిర్వహించాలని పార్టీ డివిజన్ కమిటీ నిర్ణయించి, పోలీస్ శాఖ నుండి అనుమతి పొంది జన సమీకరణకు సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, వై విక్రమ్, పొన్నం వెంకటేశ్వరరావు తదితర నాయకుల ఇండ్ల వద్దకు తెల్లవారుజామున నుండి పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చారు.
ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకునే హక్కులను తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న, అక్రమ అరెస్టులను నిర్బంధాలను తప్పుడు కేసులను ప్రశ్నించేందుకు నిర్వహిస్తున్న ఈ ర్యాలీని, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఎమర్జెన్సీ కాలాన్ని తలపించేలా సీపీఐ(ఎం) పార్టీ నాయకులను, కార్యకర్తలను అర్థరాత్రి నుండి ప్రతి ఇంటికి వెళ్లి అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించడం ఎంత అనైతికం. దీనిని ప్రజాస్వామ్య వాదులు ముక్తకంఠంతో ఖండించాలని జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖకు విజ్ఞాపన చేసినప్పటికీ పోలీస్ శాఖ వైఖరి అధికార పార్టీకి ఊడిగం చేయడం తప్ప చట్టాన్ని అమలుపరిచే స్థితిలో లేదని అన్నారు. ఎన్ని అరెస్టులు జరిగిన ఈరోజు మధిరలో నిరసన ర్యాలీ జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పోలీస్ శాఖ వైఖరి ప్రజల ముందు ఎండగడతామని అన్నారు.



