అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు గిరిజన సంఘం ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 70 ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులపై అటవీ అధికారులు అక్రమంగా అరెస్టులు చేశారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో బాధిత రైతులతో కలిసి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్నానాయక్, ఆర్ శ్రీరాం నాయక్, వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం బాల్యానాయక్ ఫిర్యాదు చేశారు. గిరిజనుల భూములను అటవీ శాఖ అధికారులు బలవంతంగా లాక్కొని మొక్కలు నాటారనీ, అడ్డుకున్న గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి వేదిస్తున్నారని తెలిపారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం, కిష్టాపూర్ తండా శివారులోని సర్వే నెం:34/8 లో 12 ఎకరాల పోడు భూములను గత 70ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ భూములపై 30 ఏండ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేసిందని తెలిపారు. సాగుచేస్తూ జీవిస్తున్న గిరిజన రైతులు గత ఏడాది బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన సమయంలో వీరి భూముల్లో అటవీ శాఖ అధికారులు బలవంతంగా మొక్కలు నాటారని పేర్కొన్నారు. తమ భూముల్లో మొక్కలు నాటడాన్ని అడ్డుకున్న 12 మంది గిరిజనులపై అక్రమంగా కేసులు నమోదు చేశారని తెలిపారు. తీవ్రమైన నేరాలు చేసిన వారిపై పెట్టే పీడీ కేసులను గిరిజనులపై పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ చట్టం సెక్షన్ 447, 427 ఐపీసీ 329(3), 324 (4) బీఎన్‌ఎస్ ఆఫ్ పీడీపీపీ లాంటివి పెట్టి తీవ్ర వేధింపులకు గురించేస్తున్నారని తెలిపారు. గిరిజనులు సాగుచేస్తున్న భూముల్లో వ్యవసాయ బోర్లు, బావులు, విధ్యుత్ కనెక్షన్లు, సహకార బ్యాంకుల ద్వారా పంట ఋణాలు పొందుతున్నారని గుర్తుచేశారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం వీరికి హక్కుపత్రాలివ్వాలని విజ్ఞప్తి చేసినా ఇవ్వకుండా అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని తెలిపారు. పోడు భూములపై గిరిజనులకు ఉన్న రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న అటవీ శాఖ అధికారులపై చట్టబద్ద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసేందుకు అదేశాలివ్వాలని గిరిజన సంఘం నేతలతో పాటు బాధిత గిరిజనులు ముడావత్ మంగమ్మ, బొజ్జమ్మ, హునీ బాయి, మోతి బాయి, గోపాల్, భోజ్యా, లాలు, రమేష్ కోరారు.
పోడు గిరిజనులపై అక్రమ కేసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES