Saturday, December 20, 2025
E-PAPER
Homeబీజినెస్డాంకీ రూట్‌లో అక్రమ బంగారం

డాంకీ రూట్‌లో అక్రమ బంగారం

- Advertisement -

నగదు, వెండిని సీజ్‌ చేసిన ఈడీ
న్యూఢిల్లీ :
డాంకీ రూట్‌లో కోట్లాది రూపాయల నగదు, బంగారం, వెండి అక్రమ రవాణ జరుగుతుందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గుర్తించింది. ఈ కేసులో భారీగా పసిడి, వెండి, నగదు ఇతర ఆస్తులను అటాచ్‌ చేసింది. అమెరికాలోకి అక్రమ వలసలకు సంబంధించిన ‘డాంకీ రూట్‌’ కేసులో మనీలాండరింగ్‌ దర్యాప్తునకు సంబంధించి పంజాబ్‌, హర్యానా, ఢిల్లీలోని 13 ప్రదేశాలలో ఈడీ సోదాలు జరిపింది. ఇందులో రూ.4.68 కోట్ల నగదును, రూ.8.07 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను, సుమారు రూ.6.42 కోట్ల విలువైన వెండి కడ్డీలను స్వాధీనం చేసుకుంది. ఇడి అధికారుల సమాచారం మేరకు.. నగదుతో పాటు 5.9 కిలోల బంగారం, 313 కిలోల వెండి కడ్డీలను, రూ.2.7 లక్షల విలువైన బంగారు నాణేలను, అనేక డిజిటల్‌ పరికరాలు, పత్రాలను జప్తు చేశారు. వివిధ ప్రాంతాల నుండి థర్డ్‌ పార్టీలకు చెందిన 50కి పైగా అసలు పాస్‌పోర్ట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్‌ 15న వ్యవసాయ భూమి, నివాస, వాణిజ్య ప్రాంతాలు, బ్యాంక్‌ ఖాతాలతో సహా రూ.5.41 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్‌ చేసింది.
అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకు గాను అమెరికా ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో 330 మంది భారతీయ పౌరులను బహిష్కరించి.. భారత్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పంజాబ్‌, హర్యానా పోలీసులు నమోదు చేసిన పలు కేసుల్లో ప్రాథమిక సమాచార మేరకు మనీలాండరింగ్‌ను గుర్తించారు. అమెరికాలోకి చట్టబద్ధమైన ప్రవేశం కల్పిస్తామని పలువురు ఏజెంట్లు వాగ్దానం చేస్తూ ప్రజలను మోసగించారని, భారీ మొత్తాలను వసూలు చేశారని ఇడి విచారణలో గుర్తించింది. ఈ సిండికేట్‌లో ట్రావెల్‌ ఏజెంట్లు, మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణా ఏజెంట్లు, హవాలా వ్యాపారులు ఇతర రవాణా ఏర్పాట్లు చేసే వారు పెద్ద నెట్‌వర్క్‌గా ఉన్నారని తేలింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -