Wednesday, January 14, 2026
E-PAPER
Homeకరీంనగర్అనుమతులు లేకుండానే సాగుతున్న అక్రమ మట్టి దందా

అనుమతులు లేకుండానే సాగుతున్న అక్రమ మట్టి దందా

- Advertisement -

-ప్లాస్టిక్ కవర్లతో కప్పి రాత్రింబవళ్లు తరలింపు
-సెలవు రోజుల్లోనూ యథేచ్ఛగా అక్రమ రవాణా
నవతెలంగాణ-రాయికల్: మండలంలోని చెర్లకొండాపూర్, వస్తాపూర్ గ్రామాల శివారు ప్రాంతాల్లో అక్రమ మట్టి రవాణా అడ్డూఅదుపు లేకుండా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే గతంలో ఆయా గ్రామాల శివారుల్లో డంపు చేసిన మట్టిని టిప్పర్లలో నింపి, మట్టి బయటకు కనిపించకుండా ప్లాస్టిక్ కవర్లతో పూర్తిగా కప్పి రాత్రి చీకట్లో తరలిస్తున్నారు. ఇది అధికారులను మోసం చేయడమే కాకుండా చట్టాన్ని బహిరంగంగా కాలరాసే చర్యగా గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.రాత్రింబవళ్లు తిరుగుతున్న భారీ టిప్పర్ల కారణంగా గ్రామీణ రహదారులు పూర్తిగా ఛిద్రమవుతున్నాయి. నిద్ర వేళల్లో భరించలేని శబ్ద కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం గ్రామీణ ప్రాంత ప్రజలను వెంటాడుతోంది. సెలవు రోజుల్లోనూ నిర్భయంగా అక్రమ రవాణా జరగడం అధికారుల పర్యవేక్షణ పూర్తిగా శూన్యమైందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.అక్రమ మట్టి దందా వెనుక అధికారుల నిర్లక్ష్యమా? లేక లోపాయికారి లావాదేవీలున్నాయా? అన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని అక్రమ మట్టి దందాను అడ్డుకుని,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -