జలమండలి ప్రత్యేక తనిఖీలు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
అసలే ఎండాకాలం.. తాగునీటికి తిప్పలు ఏర్పడనున్నాయి. కానీ ఎంతో విలువైన నీటిని బాధ్యతగా వినియోగించాల్సిన నగరవాసులు తాగునీటిని వృథా చేస్తున్నారు. కొందరు అక్రమ నల్లా కనెక్షన్లను తీసుకున్నారు. మరి కొందరు మీటర్ లేకుండానే నీటిని వినియోగిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా నల్లాకే మోటార్ పెట్టి తోడేస్తున్నారు. ఇంకొందరు తాగు నీళ్లను కార్లు, బైక్‌లను శుద్ధి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. మరికొందరు రోడ్లపై, మోరీల్లో వదిలేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో నగరంలో నీటి సరఫరా జరుగుతోంది. దాదాపు 14.44లక్షల నల్లా కనెక్షన్ల ద్వారా ప్రతిరోజూ 583ఎంజీడీల నీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలించి, శుద్ధి చేసిన నీటిని జలమండలి ఇంటింటికీ అందజేస్తోంది. ప్రతి కిలో లీటర్ నీటిని తరలించి, శుద్ధీ చేయడానికి రూ.47 ఖర్చు చేస్తోంది. కానీ, తాగు నీటి వృథా, అక్రమ వినియోగం వల్ల జలమండలి నష్టాలకు కారణమవుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జలమండలి అధికారులు ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నారు.
పెరిగిన పరిధి..
గతంలో పోల్చితే జలమండలి మరింత విస్తరించింది. ప్రస్తుతం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులతో 1450.2 నుంచి 2.053.2చ.కిమీతో ఓఆర్‌ఆర్ వెలుపల వరకు విస్తరించారు. ఇప్పటికే 14.44లక్షల నల్లా కనెక్షన్లలో 10లక్షల కనెక్షన్లకు ఉచిత నీరు అందిస్తున్నారు. పరిధి పెరగడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా అక్రమ కనెక్షన్లు, మోటార్లతో నీరు దోపిడీ చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు తమ నల్లాలకు మోటార్ల బిగించుకోవడం జలమండలి అధికారుల దృష్టికి వచ్చింది. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాల కోసం వినియోగిస్తున్నా వారి సమాచారం ఇవ్వాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. నీటి చోరీకి పాల్పడుతున్న వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.
లో- ప్రెజర్‌తో ఫిర్యాదులపై ఆరా..
నీటిని కొందరు అక్రమంగా వినియోగించడంతోపాటు నల్లాకు నేరుగా మోటార్లు పెట్టి నీటిని లాగేయడంతో కొన్ని ప్రాంతాల్లో మిగతా వినియోగదారులకు లో-ప్రెజర్‌తో నీటి సరఫరా జరుగుతోంది. విషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ అధికారులు క్రమంగా తనిఖీలను చేపట్టారు. బుధవారం ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-6, ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని ఎస్‌ఆర్టీ కాలనీలో నల్లాకు మోటార్లు బిగిస్తున్నారని స్థానికులు జలమండలి విజిలెన్సు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు నీటి సరఫరా సమయంలో పలు ప్రాంతాల్లో పర్యటించి పైపులైన్‌కు అక్రమంగా బిగించిన 7 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.
రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేల జరిమానా
ఎవరైనా వినియోగదారులు తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు మోటార్లు సీజ్ చేస్తామని జలమండలి ఎండీ తెలిపారు. ఇక రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామన్నారు. వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించొద్దని కోరారు. ఎక్కడైనా తక్కువ ప్రెజర్‌తో నీరు సరఫరా అయినా, లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా దగ్గర్లోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలి. లేదా జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తామని జలమండలి అధికారులు స్పష్టం చేశారు.



