అడ్డగోలు భూ కేటాయింపులను రద్దు చేయాలి : మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అక్రమ మైనింగ్ సాగిస్తున్నని బీఆర్ ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న రాజేంద్ర నగర్ మానస హిల్స్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి పొంగులేటి సంస్థ ‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్’ కొండలను పిండి చేస్తున్నదని తెలిపారు. ఆ సంస్థ అక్రమంగా రూ.కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ అల్లుడి అనుయాయులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండానే 17 ఎకరాల ప్రభుత్వ భూమి కట్టబెట్టడం పట్ల ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లను కూల్చే హైడ్రాకు మంత్రులు, వాళ్ల బంధువులు చేస్తున్న అక్రమ క్వారీలు, భూకబ్జాలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ నిలిపేసి, దోచుకున్న సంపదను పెనాల్టీతో సహా రికవరీ చేయడంతోపాటు అడ్డగోలు భూ కేటాయింపులను రద్దు చేయాలని హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే దందా చేస్తుంటే రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, హెచ్‌ఎండీఏ అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రశ్నించారు. రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ యధేచ్చగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని అడిగారు. సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం, మంత్రికి ఒక న్యాయమా?అని సూటిగా ప్రశ్నించారు. ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం, మంత్రి కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా?అని అడిగారు. విద్యుత్ మంత్రి భట్టి విక్రమార్క, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, గనుల శాఖ మంత్రి వివేక్ సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నదని ప్రశ్నించారు. ఆయా శాఖల్లోని విజిలెన్స్ విభాగాలు పని చేయడం లేదా? లేక సహచర మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశ్యపూర్వకంగానే సహకరిస్తున్నాయా?అని అడిగారు. ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయని ప్రశ్నించారు.
అధికారుల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎందరి చేతులు తడుస్తున్నాయని అడిగారు. ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు, కాంక్రీటు తరలించడం చట్టవిరుద్ధమనే విషయం తెలియదా?అని ప్రశ్నించారు. ఒకవైపు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతున్నారని తెలిపారు. మరోవైపు అదే ముఖ్యమంత్రి తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని విమర్శించారు. ప్రభుత్వానికి రూ.కోట్ల నష్టం జరుగుతున్నదనీ, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని తాము డిమాండ్ చేసినా స్పందించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా?అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే భూ బకాసురులుగా మారి భక్షిస్తుంటే ఇక రక్షించే వారెవరని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ క్వారీని వెంటనే మూసివేయించాలనీ, ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీతో సహా రికవరీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.



