- రాత్రిళ్ళు మోత మోగుతున్న ట్రాక్టర్లు
- నవతెలంగాణ – ఉప్పునుంతల
- ఆదివారం ఉదయం విపరీతమైన మంచుతో రోడ్డు కూడా కనిపించని స్థాయిలో చుట్టుముట్టింది ఇదే అదునుగా భావించిన ఇసుక మాఫియా రెచ్చిపోయి రోడ్లపై ఓవర్ స్పీడ్ గా అక్రమ ఇసుక తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్లపై పొలాల్లోకి వెళ్లే రైతులు మండిపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనుల లబ్ధిదారులకు చౌక ధరలకు ఇసుక సరఫరా చేయాలనే ఉద్దేశంతో మన ఇసుక మన వాహనాన్ని ప్రారంభించారు కానీ అది కాస్త కొందరి అధికారుల స్వార్థానికి బలైపోతుంది. పక్క మండలమైన వంగూర్ నుండి వారం క్రితం నుండి ఆన్లైన్ విధానాన్ని మొదలెట్టారు కానీ ఉప్పునుంతల మండలం నుండి మాత్రం ఆఫ్లైన్ విధానాన్ని కొనసాగిస్తున్నారు.
అది కూడా ఎలాంటి అనుమతులు లేకుండా సంబంధిత అధికారుల అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగుతుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మొల్గర గ్రామానికి చెందిన 10 ట్రాక్టర్లు,కంసానిపల్లి గ్రామానికి చెందిన 10 ట్రాక్టర్లు మొత్తం 20 ట్రాక్టర్ల మేర మొల్గర దుందుభి నుండి రాత్రిళ్ళు అక్రమ ఇసుక తరలించడానికి ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం.అందులో భాగంగానే ఆదివారం మంచును కూడా లెక్క చెయ్యకుండా రోడ్లపై ట్రాక్టర్లు పరుగులు పెడుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.



