Wednesday, October 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆన్‌లైన్‌లో పర్మిట్ల మార్ఫింగ్‌తోనే సండ్ర కలప అక్రమ రవాణా

ఆన్‌లైన్‌లో పర్మిట్ల మార్ఫింగ్‌తోనే సండ్ర కలప అక్రమ రవాణా

- Advertisement -

– నిందితులు ఏ స్థాయి వారైనా చర్యలు తీసుకుంటాం : ఫారెస్ట్‌ వరంగల్‌ జిల్లా భద్రాద్రి జోన్‌ సీసీఎఫ్‌ డి.భీమా నాయక్‌
నవతెలంగాణ-గాంధీ చౌక్‌

కలప రవాణా పర్మిట్లను ఆన్‌లైన్‌లో మార్ఫింగ్‌ చేసి సండ్ర కలపను రవాణా చేశారని అటవీశాఖ వరంగల్‌ జిల్లా భద్రాద్రి జోన్‌ సీసీఎఫ్‌ డి.భీమా నాయక్‌ తెలిపారు. అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన సండ్ర కలప అంశంపై మంగళవారం అటవీ శాఖ జిల్లా డీఎఫ్‌ఓ విక్రమ్‌ మాన్‌ సింగ్‌తో కలిసి విచారణ చేపట్టారు. తొలుత ఆయన వెలుగుమట్లలోని అటవీ శాఖ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విచారణలో ఏ స్థాయి వారైనా దోషులుగా తేలినా ఉపేక్షించేది లేదని తెలిపారు. కలప అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌ పోస్టులను పెంచి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. చెక్‌ పోస్టు పరిధిలో వివిధ మార్గాలు ఉండటం వల్ల రవాణా జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీన్ని అరికట్టేందుకు పలు రకాల చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. చెక్‌ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నామని, దీనివల్ల అక్రమ రవాణా తగ్గిందని తెలిపారు. పర్మిట్లు మార్ఫింగ్‌ చేయడం వల్లనే ఇటీవల చోటుచేసుకున్న సంఘటన జరిగిందన్నారు.

జిల్లాలో మూడు రోజుల పాటు విచారణ
అక్రమార్కులు సండ్ర కలపను రవాణా చేస్తూ పట్టుబడిన నేపథ్యంలో అధికారులు జిల్లాలో మూడు రోజుల పాటు విచారణ చేపట్టనున్నట్టు తెలిసింది. ఈ విచారణకు హైదరాబాద్‌ విజిలెన్స్‌ అధికారులు కూడా హాజరవుతున్నట్టు సమాచారం. విచారణలో అధికారులు సండ్ర కలపను ఇంకా ఎక్కడైనా సాగు చేశారా? వంటి విషయాలతో పాటు పట్టుబడిన కలప రవాణాలో స్థానికంగా ఎవరి సహకారం ఉంది? ఇందులో అధికారుల హస్తం ఉందా? వంటి అంశాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -