భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అతి పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు ఖుదీరాం బోస్. ఆయన జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘ఖుదీరాం బోస్’. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన రాకేష్ జాగర్లమూడి తన అనుభవాలను, సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ చిత్ర నిర్మాత మా నాన్నే (విజరు జాగర్లమూడి). ఆయన ద్వారానే నాకు ఈ అవకాశం దొరికింది. ఈ పాత్ర కోసం దాదాపు 90 రోజుల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాను. మయూఖ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఉత్తేజ్ దగ్గర నటనలో మెరుగులు దిద్దుకున్నాను. ఉత్తేజ్ భార్య పద్మ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. దాంతో పాటు చారిత్రక పుస్తకాలు చదివి, ఆ కాలం నాటి బాడీ లాంగ్వేజ్ కోసం ఫిజికల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను.
‘వందేమాతరం’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన యువ వీరుడు ఖుదీరాం. అలాగే స్వామి వివేకానంద శిష్యురాలైన సిస్టర్ నివేదితతో ఆయనకున్న అనుబంధం, ఆమె తయారు చేసిన మొట్టమొదటి భారతీయ జెండాను ఆయన ప్రజల మధ్యకు తీసుకెళ్లడం వంటి విషయాలు తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యమేసింది.
ఈ సినిమాలో నాకు అత్యంత భావోద్వేగపూరితమైన సీన్ ఉరికంబం ఎక్కే సన్నివేశం. 18 ఏళ్ల వయసులో మరణం కళ్లముందు కనిపిస్తున్నా, దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ సీన్ చేస్తున్నప్పుడు కలిగిన భావం నాలో చాలా రోజుల వరకు ఉండిపోయింది. ఆ తర్వాత నాలో భయం పోయి, సత్యం కోసం నిలబడాలనే ధైర్యం పెరిగింది.
రజనీకాంత్ ట్రైలర్ చూసి నన్ను ఆశీర్వదించడం నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. పార్లమెంట్‌లో ఎంపీల కోసం స్క్రీనింగ్ వేసినప్పుడు చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో సినిమా అయి పోయాక 5 నిమిషాల పాటు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ‘ఇది కదా నిజమైన ఇండియన్ స్టోరీ’ అని వారు మెచ్చుకుంటుంటే చాలా గర్వంగా అనిపించింది.
ఆ పాత్ర.. చేయటం నా అదృష్టం
- Advertisement -
- Advertisement -



