నవరాత్రులు ఉత్సవాలు జరిపాక గణనాయకునికి జనం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. గణానికి నాయకుడుగా పేరొందిన అతనికి మట్టితో ఒక రూపాన్నిచ్చి, పూజలు చేసి, ఆదుకొమ్మని, సకల సౌభాగ్యాలను అందివ్వమని, ఇడుముల తొలగించి, కుడుములు భుజించమని ప్రార్థించి, వేడుకుని, ప్రతిమను నీటిలో కలిపేస్తాము. ప్రజలకు కష్టాలు, కడగండ్లు, బాధలు, కన్నీళ్లు, దుఃఖాలు ఉన్నంతకాలం ఈ వేడుకోవడాలు కొనసాగుతూనే ఉంటాయి. వాటన్నింటినీ తీర్చేవాడున్నాడనే ఒక భరోసాయే విశ్వాసము. ఈ విశ్వాసములే పెరిగి పెరిగి మూఢ విశ్వాసాలుగా పరిణామం చెందుతాయి. అది వేరే విషయం. ఒక సమూహాన్ని ప్రాకృతికపరమైన సామాజికపరమైన ప్రమాదాల నుండి, ఇబ్బందుల నుండి రక్షిస్తూ, నాయకత్వం వహించే సమర్థుడు గణనాయకునిగా రూపాంతరం చెందాడనేది చారిత్రక పరిణామాన్ని గమనిస్తే అర్థమవుతుంది. వాస్తవిక సామాజిక పరిణామాలలోంచే పురాణాలు, ఇతిహాసాలు పురుడుపోసుకుంటాయి. వాటికి కొన్ని కల్పనలను, ఊహలను, ఆధ్యాత్మికతను జోడించి ప్రచారమవుతాయి. మన నాయకుడైతే, మనిషి శరీరానికి ఏనుగుతల అతికించడాన్ని ప్లాస్టిక్ సర్జరీ నైపుణ్యంగా పోల్చి, ఆనాడే మనకా విజ్ఞానం ఉందని పురాణకథకు సైన్సును ఆపాదించారు. ఇక సైన్సు, టెక్నాలజీ చదువుల కన్నా, జ్యోతిష్యం, వాస్తు, తాంత్రికవిద్యలను చదవాలని ప్రయత్నం మొదలేసారు. దీన్నే మూఢత్వం అంటారు. అందుకనే శాస్త్ర విజ్ఞాన పరిశోధనలలో మనం వెనుకబడి ఉన్నాం. సనాతనం పేరుతో వెనకకు మళ్ళుతున్నాం.
అదలా ఉంచితే భక్తి శ్రద్ధలతో జరగాల్సిన ఉత్సవాలు, వాటికి భిన్నమైన రీతిలోకి భక్తిని తీసుకుని వచ్చారు. మతతత్వాన్ని రెచ్చగొట్టే విపరీత కార్యక్రమాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నిమజ్జన ఊరేగింపులలో మద్యం పొంగి పొర్లుతోంది. మత్తునిండిన మనుషుల డీజే నృత్యపు గెంతులతో భక్తిరసం వెర్రెక్కిపారుతోంది.
అనేకానేక పోలీసు విభాగాల నిఘాలతో నేరాలను, అసాంఘీక శక్తులను కట్టడి చేయాల్సిన అవసరం ఏర్పడుతోందంటే, ఇది ఎలా పరిణామం చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇక పర్యావరణాన్ని కాపాడుకునే మట్టి వినాయకులనే పెట్టాలని విజ్ఞప్తులు చేసినా వినే పరిస్థితులు లేవు. పర్యావరణం, సామాజికావరణం కాలుష్యమయ్యే ఏ చర్యలనయినా మనం నియంత్రించుకోవలసిందే! ప్రజలు ఈ విషయాలపట్ల అప్రమత్తంగా ఉండాలి. భక్తితో వేడుకున్న జనం, మృత్తిక రూపాన్ని నిమజ్జనం చేసిన తీరుగానే, ప్రజల బాధలను, ఇక్కట్లను తొలగించని నాయకులనూ, ఐక్యతను, శాంతిని, సౌభ్రాతృత్వాన్ని భగపరచే పాలకులను నిమజ్జనం చేయటమూ అవసరమే! నిమజ్జనమంటే ఇక్కడ తొలగించడమనే అర్థం. సమాజగతిలో మనకెన్నో మంచి సంప్రదాయాలుఒనగూరి ఉంటాయి. వాటితోపాటే చెడూ చేరుతుంది. మంచిని, ప్రయోజనకరమైనవి గ్రహించుకుని, చెడును తొలగించుకోవాలి. ఇపుడు జరుగుతున్నది దీనికి విరుద్ధమైనది. చెడును గ్రహించి, మంచిని వదిలేస్తున్నాం.
నిజంగా ఇపుడు వొదిలించుకోవాల్సింది ఏమిటీ అంటే.. ముఖ్యంగా విద్వేషాన్ని నిమజ్జనం చేసి వొదిలించుకోవాలి. లేకుంటే ఇది మనుషుల్ని అమానవీయంగా తయారుచేస్తుంది. విభజిస్తుంది. ఉన్మత్తులుగా మారుస్తుంది. అందుకే తీసేయాలి. అనేక జాఢ్యాలు మనల్ని పట్టిపీడిస్తున్నాయి. నేడు పెచ్చరిల్లుతున్న కులమత విభేదాలను, వివక్షతలను వదిలేయాలి. అజ్ఞానము, అంధ విశ్వాసాలు మన అభివృద్ధికి పెద్ద ఆటంకాలు. వాటిని వొదిలించుకోవాలి. శాస్త్ర విజ్ఞానాలవైపు అడుగులుపడాలి. నేటి యువతను పెడదారి పట్టిస్తున్న ప్రమాదకరమైన డ్రగ్స్ అలవాటును నిమజ్జనం చేయాలి. ఆ మత్తు మాఫియాను లేకుండా చేయాలి. తన బాగు కోసం ఇతరులను మోసం చేయడానికి, దోపిడీ చేయటానికి కూడా వెనుకాడనితనాన్ని నిమజ్జనం చేయాలి. దుష్టత్వాలను, దురాలోచనలను, చెడువర్తనలను, కుటిలత్వాలను, మరెన్నింటినో మనం వొదిలించుకోవాల్సి ఉంది. ఈ రోజున గణపతి ప్రతిమను నిమజ్జనం చేస్తున్న సందర్భంలో, నీటిలో ముంచి వొదిలివేస్తున్న వేళ, ఇంకా ఏవేవి ఎలా వొదిలించుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలి. పండుగలు, ఉత్సవాలు, జాతరలు, అనాదిగా ప్రజలు జరుపుకునే సమూహపు సందళ్ళు. వాటి నెవరూ తప్పుపట్టరు. కానీ వాటిలోకి సాంస్కృతిక కాలుష్యాలు చేరకుండా జాగ్రత్తపడాలి.
నిమజ్జనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES