Friday, February 13, 2026
E-PAPER
Homeజాతీయంపార్లమెంట్‌పై సమ్మె ప్రభావం

పార్లమెంట్‌పై సమ్మె ప్రభావం

- Advertisement -

లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళన
లోక్‌సభ చర్చలో భారత్‌బంద్‌ ప్రాముఖ్యతను వివరించిన ప్రతిపక్ష సభ్యులు
చరిత్రలో అతిపెద్ద కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా మోడీ సర్కార్‌ : సీపీఐ(ఎం) ఎంపీ కె. రాధాకృష్ణన్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న కార్మికుల ఆగ్రహం.. పార్లమెంటులో కూడా ప్రతిధ్వనించింది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్‌ మాండవీయ లోక్‌సభలో ప్రవేశపెట్టిన పారిశ్రామిక నియమావళి సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్ష సభ్యులందరూ కార్మికులను అఖిల భారత సమ్మెకు దారితీసిన పరిస్థితులను ప్రస్తావించారు. కార్మికులను సమ్మె చేయొద్దని బ్రిటీష్‌ పాలకులు బలవంతం చేశారని గుర్తు చేశారు. ఇపుడు దేశంలోని కార్మికవర్గం పోరాటాలతో సాధించుకున్న హక్కులను తొలగించడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీపీఐ(ఎం) లోక్‌సభాపక్ష నేత కె. రాధాకృష్ణన్‌ ఉటంకించారు.

”ప్రస్తుత కార్మిక అనుకూల చట్టాలన్నింటినీ తారుమారు చేయడంతో కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తీసుకువచ్చింది. ఈ చర్యతో.. మోడీ ప్రభుత్వం చరిత్రలో అతిపెద్ద కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా మారింది. దేశంలోని రైతులు, కార్మికులందరూ బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడి తమ హక్కులను సాధించుకున్నారు. రైతులు, కార్మికులు ‘సూర్యుడు అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని’ మోకాళ్లపైకి తీసుకురాగలిగారు. అలాంటి వారసత్వం ఉన్న వారు తప్పకుండా మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించగలరు. మోడీ సర్కార్‌ తప్పులను కూడా సరిదిద్దగలరు” అని కె. రాధాకృష్ణన్‌ అన్నారు. సార్వత్రిక సమ్మెతో కార్మికులు, రైతులు లేవనెత్తిన డిమాండ్లు ఈ దేశంలోని ప్రతి పౌరుడి హక్కులకు సంబంధించినవని సీపీఐ(ఎం) రాజ్యసభాపక్షనేత జాన్‌బ్రిట్టాస్‌ గుర్తు చేశారు.

సమ్మెలో ఉన్న కోట్లాది మంది కార్మికులు, రైతులకు సంబంధించి సభ జీరో అవర్‌లో సమ్మె ముఖ్యమైన డిమాండ్లను లేవనెత్తారు. ”సమ్మెలో బీఎంఎస్‌ మినహా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. బీఎంఎస్‌ కూడా కార్మిక కోడ్‌లకు వ్యతిరేకం గా నిరసన తెలుపుతోంది. అందువల్ల బీఎంఎస్‌తో సంబంధం ఉన్న ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసింది” అని ఆయన విమర్శించారు. లోక్‌సభలో మాట్లాడుతూ… సుప్రీ యాసూలే, రాణి శ్రీకుమార్‌, అరవింద్‌ సావంత్‌, కోడికున్నిల్‌ సురేశ్‌, ఈటి ముహమ్మద్‌ బషీర్‌ వంటి సభ్యులు కూడా అఖిల భారత సమ్మె ప్రాముఖ్యతను వివరించారు.

ట్రేడ్‌ డీల్‌పై రాహుల్‌ తీవ్ర విమర్శలు
అమెరికా-భారత్‌ ట్రేడ్‌ డీల్‌ గురించి రాహుల్‌గాంధీ బుధవారం లోక్‌సభలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందంతో దేశ ప్రయోజనాలను పూర్తిగా అమెరికాకు తాకట్టు పెట్టారని, దేశాన్ని అమ్మేశారని ఆయన ఆరోపించారు. ఈ ట్రేడ్‌ డీల్‌ను రాహుల్‌ గాంధీ ‘పూర్తి లొంగుబాటు’గా అభివర్ణించారు. దేశ ఇంధన భద్రతను అమెరికాకు అప్పగించారని, రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డారని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ ప్రసంగంపై బీజేపీ ఎంపీలు విమర్శించారు. అయితే రాహుల్‌గాంధీ బుధవారం చేసిన ప్రసంగం నుంచి కొన్ని వ్యాఖ్యలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఏమిటీ సబ్‌స్టాంటివ్‌ మోషన్‌?
సబ్‌స్టాంటివ్‌ మోషన్‌ అనేది పార్లమెంటు సభ్యుడు ఒక నిర్దిష్ట అంశంపై తన స్వంత అభిప్రాయాన్ని లేదా సిఫారసును సభ ఆమోదం కోసం సమర్పించడానికి ఉపయోగించే విధానం. సబ్‌స్టాంటివ్‌ మోషన్‌కు వివరణాత్మక చర్చ అవసరం. ఆపై ఓటుతో మెజారిటీ నిర్ణయం అవసరం ఉంటుంది. స్పీకర్‌ ఆమోదం పొందితే ఈ మోషన్‌ను సభలో ప్రవేశపెట్టవచ్చు. స్పీకర్‌ దానిని ఆమోదిస్తే, ఈ మోషన్‌పై చర్చ, ఓటింగ్‌ నిర్వహించవచ్చు. కొన్ని సందర్భాల్లో నోటీసులోని ఆరోపణలను నిపుణుల కమిటీ పరిశీలనకు వదిలివేస్తారు. అయితే మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

చిచ్చు రేపిన నవరణే పుస్తకం
ఆర్మీ మాజీ చీఫ్‌ ఎంఎం నరవణే పుస్తకంలోని వివాదాస్పద అంశాలను సభలో చదివి వినిపించాలనే రాహుల్‌ గాంధీ ప్రయత్నాన్ని బీజేపీ.. స్పీకర్‌ జోక్యంతో అడ్డుకుంది. ఆ తరువాత జరిగిన నిరసనల సందర్భంగా స్పీకర్‌ ఓం బిర్లా కాంగ్రెస్‌ మహిళా ఎంపీలు ప్రధానిపై దాడికి ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నించారని ఆరోపించారు. స్పీకర్‌ విశ్వసనీయత కోల్పోయారని పేర్కొంటూ ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. దీని తరువాత, ఇప్పుడు రాహుల్‌ను అనర్హులుగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ డిమాండ్‌ చేస్తుండటం గమనార్హం.

ఇండియా-అమెరికా డీల్‌పై ప్రతిపక్షాలు ఆందోళన
ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. గురువారం పార్లమెంట్‌ ఆవరణంలోనూ, అలాగే లోక్‌ సభలోనూ ఆందోళన కొనసాగింది. తొలుత పార్లమెంట్‌ మకరద్వార్‌ వద్ద ”ట్రాప్‌ డీల్‌” అని రాసి ఉన్న భారీ బ్యానర్‌ తో ‘నరేందర్‌ సరెండర్‌’ ప్లకార్డులతో ”యూఎస్‌ డీల్‌ హై అత్యాచారి, దేశ్‌ కో బెచ్నా బంద్‌ కరో” అంటూ నినాదాలు హోరెత్తించారు. మోడీ సర్కార్‌ దేశ ప్రయోజనాలను వదులుకుంటోందని ఎంపీలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌, డీఎంకే పక్ష నేత టిఆర్‌ బాలు, సీపీఐ(ఎం) పక్షనేత జాన్‌ బ్రిట్టాస్‌, ఎస్పీ ఎంపీలు ధర్మేంద్ర యాదవ్‌, జయాబచ్చన్‌, సీపీఐఎంఎల్‌ ఎంపీ సుదామ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల సస్పెండ్‌కు గురైన ఎంపీలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీతో సహా వివిధ పార్టీల ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు.

ఇండస్ట్రియల్ రిలేషన్స్‌ కోడ్‌ బిల్లు ఆమోదం
లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు చేబూని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. వాణిజ్య ఒప్పందం వెనక్కి తీసుకోవాలని, లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని నినాదాలు హోరెత్తించారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఏడు నిమిషాల్లోనే సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ఇండిస్టీయల్‌ రిలేషన్స్‌ కోడ్‌ (సవరణ) బిల్లును చర్చకు అనుమతించారు. కొద్దిసేపు సభ జరిగిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైన తరువాత బిల్లును చర్చించి, మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు.

రాహుల్‌పై పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు తీర్మానం
దేశానికి నష్టం చేసే ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రహస్యంగా చేసుకున్న మోడీ సర్కార్‌ను ప్రశ్నించినందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని బీజేపీ టార్గెట్‌ చేసుకుంటున్నది. ఆయన పార్లమెంట్‌ సభ్యతాన్ని రద్దు చేయాలని తీర్మానాన్ని అధికార బీజేపీ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ‘సబ్‌స్టాంటివ్‌ మోషన్‌’ దాఖలు చేశారు.

రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, జీవితాంతం ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ విదేశాల్లోని దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలపడానికి తరచుగా విదేశాలకు వెళుతున్నారని నిషికాంత్‌ దూబే ఆరోపించారు. ‘జార్జ్‌ సోరోస్‌ వంటి శక్తుల సహాయంతో రాహుల్‌ గాంధీ దేశాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో వివరిస్తూ నేను లోక్‌సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాను. ఈ విషయాన్ని చర్చించాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయన జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నా’ అని దూబే అన్నారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -