ఆగస్టు ఒకటినుంచి భారత ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరవై ఐదుశాతం అదనపు దిగుమతి సుంకం విధించాడు. పెనాల్టీని కూడా విధిస్తామని హెచ్చరిస్తున్నాడు. తన జోక్యం వల్ల కాల్పుల విరమణ జరిగిందని గతంలో పదేపదే చెప్పిన ట్రంప్, ఇప్పుడు రష్యా నుండి భారతదేశం ముడి చమురు దిగుమతి చేసుకోనని తనకు చెప్పినట్లు ప్రకటిస్తున్నాడు. దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా అధ్యక్షుడు అగౌరపరుస్తుంటే, దేశభక్తి తమ పేటెంట్‌లాగా ప్రకటించుకునే కేంద్ర పాలకులు వారి అనుచర మీడియా, సోషల్‌మీడియా బృందాలు మౌన జపం చేస్తున్నాయి. గత ఆరు సంవత్సరాల క్రితం అమెరికాలోని హౌస్టన్ లోని ఎన్‌ఆర్‌జి స్టేడియంలో యాభై వేల మంది ప్రవాస భారతీయుల సమక్షంలో ‘మై ఫ్రెండ్ డొనాల్డ్’ అని గంభీరంగా ప్రకటించుకున్న మోడీ ఇప్పుడు నోరు విప్పడంలేదు. మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని కలిగించే సుంకాల పెంపు గురించి ప్రధాని, నిత్యం ఆయన జపంలో తరించే మీడియా స్పందించడంలేదు.
అమెరికా అధ్యక్షుడుగా రెండవసారి బాధ్యతలు చేపట్టినప్పటినుండి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. విద్యార్థుల వీసాతో మొదలుపెట్టి, దేశాల మధ్య యుద్ధాలను, కాల్పులను ఆపడం వరకు అన్నీ తానే చేసేస్తున్నాని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. సోషలిస్టు వ్యవస్థకు ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ప్రపంచంలో తాన ఆధిపత్యానికి ఎదురులేదని అమెరికా భావించింది. అయితే ఏ దేశమైనా తమ ప్రయోజనాలకు ప్రాధాన్యాత ఇస్తుంది. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా అనేక దేశాలు వివిధ కూటములుగా ఏర్పడి అమెరికాతో జోక్యం లేకుండానే వాణిజ్య ఒప్పందాలు చేసుకుటున్నాయి. ఈ పరిణామాలను అమెరికాలోని పాలకులు, కార్పొరేట్ శక్తులు సహించలేకపోతున్నారు. ‘అన్నింటా అమెరికాయే ముందు’ అనే కాలాన్ని తెస్తానని ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ వైఖరిని చైనాతో పాటు అమెరికా పొరుగున వున్న కెనడా, అనేక చిన్న దేశాలు కూడా ప్రశ్నిస్తున్నాయి, ప్రతిఘటిస్తున్నాయి. మన దేశ పాలకులు మాత్రం దేశ ప్రతిష్టను, ఆర్థిక వ్యవస్థను కష్టాలకడలిలోకి నెడుతున్నారు.
డొంక తిరుగుడు వాదనలు
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై సుమారు నాలుగు నెలలుగా మన దేశ పాలకులు, అధికారులు అమెరికాతో చర్చలు జరిపారు. మోడీతో ట్రంప్‌కు వున్న స్నేహ బంధంతో సానుకూల వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని జులై 29 వరకు వివిధ రూపాల్లో ప్రచారం చేసుకున్నారు. ట్రంప్ కూడా ఇదే భావం కలిగించారు. అయితే జులై 30న ఇరవై ఐదు శాతం సుంకాన్ని పెంచుతూ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కొన్ని దశాబ్ధాలుగా ప్రపంచంలోని నిపుణులను చేరదీసి, శాస్త్ర పరిజ్ఞానం ద్వారా తక్కువ ఖర్చుతో సరుకులు ఉత్పత్తి చేసి, ప్రపంచమంతా అమ్ముకుని మదించిన అమెరికా కంపెనీల ముందు వందల సంవత్సరాల వలస పీడన నుండి విముక్తి పొందిన దేశాల కంపెనీల సరుకులు తట్టుకోగలవా? అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ దేశీయ కంపెనీలను కాపాడుకు నేందుకు అనేక చట్టాలను రూపొందిం చుకుని సుంకాల వ్యత్యాసం పాటిస్తున్నాయి. ప్రపంచీకరణ దొంగజపంతో ఈ దేశాల్లోకి దర్జాగా జొరబడిన అగ్రరాజ్యాల కంపెనీలు ఇప్పుడు పన్నుల సమా నత్వం గురించి మాట్లాడుతున్నాయి. మన దేశంలోకి విదేశాల నుంచి వచ్చే సరుకులపై సగటున పదిహేడు శాతం దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం విధిస్తోంది. అమెరికా లోకి దిగుమతి అయ్యే విదేశీ సరుకులపై ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టే వరకు సగటున 3.3 శాతమే దిగుమతి సుంకాన్ని విధించేది. మా మీద మీరు ఎంత పన్ను వేస్తే మేము అంతే పన్ను వేస్తాం అని ట్రంప్ అంటున్నాడు. వినడానికి ఈ వాదన ఇంపుగా వున్నా దీని అసలు ఉద్ధేశ్యం మన వ్యవసాయరంగాన్ని కబలించడం.
గత రెండు నెలలుగా అమెరికా మన దేశంతో ఐదు విడతలుగా ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరిపింది. ఈ చర్చల్లో భారత్‌లోని వ్యవసాయ, డెయిరీ రంగాలలోకి తమ కంపెనీలకు తలుపులు తెరవాలని అమెరికా డిమాండ్ చేయడం కీలకమైన అంశం. మన పాలకులకు కూడా రైతుల వ్యవసాయాన్ని కాపాడాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టే గతంలో మూడు వ్యవసాయ నల్లచట్టాలు తెచ్చారు. దేశీయ కార్పొరేట్లకు అప్పగించాలను కుంటున్న వ్యవసా యాన్ని అమెరికా కోరుకోవడంతో పాలకులు సందిగ్ధంలో పడ్డారు. కోట్లాది మంది జీవనోపాధితో ముడిపడిన ఈ రంగాల్లోకి అమెరికా కంపెనీలకు నేరుగా అనుమతి ఇస్తే రాజ్యాధికారానికి వచ్చే ముప్పు బీజేపీ నేతలను కలవరపెడుతున్నట్లు ఉంది.
సుంకాల పెంపు ప్రభావం
భారతదేశ వస్త్ర ఎగుమతుల్లో 28 శాతం అమెరికాకు వెలుతున్నాయి. అమెరికా సుంకాల పెంపువల్ల ఈ ఎగుమతులు తగ్గిపోతాయి. ఫలితంగా పత్తి ధరలు తగ్గిపోతాయి. ఇప్పటికే పత్తి రైతులు గిట్టుబాటు ధరల కోసం రోడ్డు ఎక్కుతున్నారు. ఈ సుం కాల పెంపువల్ల పత్తి సాగుపై తీవ్ర ప్రభావం పడుతుంది. భారతదేశ ఫార్మా ఎగుమతుల్లో నలభై శాతం వాటా అమెరికాదే. 2025 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికాకు రూ.85వేల కోట్ల విలువైన మందుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఈ పన్నుల పెంపువల్ల మందల పరిశ్రమలు సంక్షోభంలో పడిపోతాయి, కార్మికులు ఉపాధి కోల్పోతారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఈ మందుల కంపెనీలు చాలా కీలకం. ఇప్పుడు ఈ పరిశ్రమలు తీవ్ర పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. భారతదేశంలో తయారవుతున్న వాహన విడిభాగాల్లో 29.1 శాతం 2024లో రూ.19వేల కోట్ల విలువైన వాహన విడిభాగాలు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు రూ.54వేల కోట్ల విలువైన స్టీల్, స్టీల్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ప్రస్తుత సుంకాల పెంపుదల వల్ల వీటి ఎగుమతి ఖర్చులు బాగా పెరుగుతాయి. దీంతో మన దేశంలోని వాహన విడిభాగాలు, స్టీల్, అల్యూమినియం కంపెనీలు మూత పడడం, వేతనాల కోత, పనిగంటల పెంపులాంటి కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడే అవకాశాలు వున్నాయి. దేశంలో తయారవుతున్న సోలార్ ప్లేట్స్‌లో అత్యధిక భాగం 99 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ పేరుతో వేలాది ఎకరాలను సోలార్ కంపెనీలకు అప్పగిస్తున్న ప్రభుత్వాలు అమెరికా పన్నుల పెంపు వల్ల ఈ కం పెనీలకు ఆర్డర్లు తగ్గితే, లీజుకు భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటో ఆలోచించాలి. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి జరిగిన ఐటీ (సాఫ్ట్‌వేర్) సర్వీసుల ఎగుమతుల్లో 54 శాతం వాటా అమెరికాదే. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి దిగ్గజ పెద్ద కంపెనీలతో పాటు వేలాది చిన్న కంపెనీలు అమెరికాకు సాఫ్ట్‌వేర్ సేవలను అందిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో వేతనాల కుదింపు, ఉద్యోగుల తొలగింపు కొనసాగుతుంది. అమెరికా ఐటి కంపెనీల్లో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ట్రంప్ బెదరి స్తున్నాడు. ఈ సుంకాల పెంపు ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా వుండబోతుంది. వీటన్నిటి వల్ల దేశ స్థూల ఉత్పత్తి తగ్గిపోతుంది. గతంలో వేసిన అంచనాలకు భిన్నంగా ఈ సంవత్సరం 6.2 శాతం మాత్రమే అభివృద్ధి వుంటుందని నిపుణులు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగం మరింత పెరుగుతుంది. ప్రజల కొనుగోలు తగ్గిపోతుంది.
మరికొన్ని రంగాలపై
మన దేశ ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రస్తుతం అమెరికా 15 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. ఇది సగటున ముప్పయి శాతానికి పెరుగుతుంది. భారత వస్త్రాలపై పన్నెండు శాతం నుంచి 37 శాతానికి, డెయిరీ ఉత్పత్తులపై 188 శాతం, పండ్లు, కూరగాయలపై 132 శాతం పెరుగుతాయి. కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలపై 53 శాతం, తణధాన్యాలపై 193 శాతం, నూనె విత్తనాలు, నూనెలపై 164 శాతం, మద్యం, పొగాకుపై 150 శాతం, ఖనిజాలు, లోహాలపై 187 శాతం, రసాయనాలపై 56 శాతం సుంకాలను అమెరికా ఇప్పటికే విధిస్తోంది.
ఆయిల్‌పై పెత్తనం కోసం
ఇరాన్‌తో చమురు, పెట్రోరసాయన ఉత్పత్తుల లావాదేవీల్లో మనదేశం పాల్గొన్నదనే ఆరోపణలతో ఆరు ప్రముఖ భార తీయ కంపెనీలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించగా అందులో మన దేశానివి ఆరు ఉన్నాయి. ఇరాన్ చమురు వ్యాపారాన్ని అడ్డుకునేందుకు ‘మ్యాక్సిమమ్ ప్రెజర్ క్యాంపెయిన్’ను అమెరికా చేపట్టింది. ఇరాన్- భారత్ మధ్య చారిత్రక వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. 2019 వరకు ఇరాన్ నుంచి భారత్ భారీగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునేది. అయితే ఆ ఏడాది ఇరాన్ పై అమెరికా వాణిజ్య ఆంక్షలు విధించింది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి చౌకగా దొరికే ఇరాన్ నుండి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించుకున్నాము. ఇప్పుడు రష్యా నుండి చమురు దిగుమతులు చేసుకోవద్దని ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఇందుకు మన దేశ పాలకులు అంగీకరించినట్లు ఆయన తన ట్విట్ లో పెట్టినా మన పాలకుల నుండి తీవ్ర స్పందనలేదు.
వి.రాంభూపాల్