– మానవతా సాయానికి దూరం
– నిధుల కోరతపై యూఎన్ హెచ్చరిక
న్యూయార్క్ : నిధులలో కోత కారణంగా కోటి మందికి పైగా శరణార్థులు మానవతా సహాయాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదమున్నదని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) హెచ్చరించింది. నిధుల కొరతకు సంబంధించి ఇది ఒక నివేదికను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది నిర్దేశించిన నిధుల లక్ష్యం 10.6 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో 23 శాతమే అందిందని వివరించింది. నిధుల కోత ఫలితంగా ఈ ఏడాది చివరి నాటికి మొత్తం బడ్జెట్ 3.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంటుందనీ, అది 122 మిలియన్ల మంది శరణార్థులు, ప్రజల అవసరాలను తీర్చటానికి మాత్రమే సరిపోతుందని ఆ నివేదిక పేర్కొన్నది. నిధులను పొందే విషయంలో తాము క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నామని యూఎన్‌హెచ్‌సీఆర్ ఎక్స్‌టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డొమినిక్ హైడే తెలిపారు. 11.6 మిలియన్ల మంది శరణార్థులు, ప్రజలు యూఎన్‌హెచ్‌సీఆర్ కల్పించే మానవతా సాయాన్ని కోల్పోతారేమోన్న భయాందోళనలో తామున్నామని వివరించారు. అయితే ఏయే దేశాలు తాము అందించే నిధులలో కోత విధించాయన్న వివరాలను మాత్రం నివేదిక పేర్కొనలేదు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎన్‌హెచ్‌సీఆర్‌కు అందించే నిధుల్లో కోత విధించారు. గతేడాది ఈ ఏజెన్సీకి అందిన నిధుల్లో 40 శాతం, అంటే రెండు బిలియన్ డాలర్లకు పైగా యూఎస్ నుంచే సమకూరింది. అయితే ఈ సారి మాత్రం ఆ నిధులలో యూఎస్ కోతను విధించింది. ఈ నేపథ్యంలో యూఎన్‌హెచ్‌సీఆర్ నివేదిక రావటం గమనార్హం. సూడాన్, మయన్మార్, అఫ్ఘనిస్తాన్ వంటి అనేక దేశాల్లో దాదాపు 1.4 బిలియన్ డాలర్ల విలువైన సహాయ కార్యక్రమాలను నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని యూఎన్‌హెచ్‌సీఆర్ వివరించింది.
కోటి మంది శరణార్థులపై ప్రభావం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES