పార్లమెంటు ఉభయసభల్లో తీర్మాన నోటీసు
ప్రవేశపెట్టిన ప్రతిపక్ష సభ్యులు
193 మంది ఎంపీల సంతకాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయతను కోల్పోయినందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షం పార్లమెంటు ఉభయ సభలలో అభిశంసన నోటీసు ఇచ్చింది. శుక్రవారం తీర్మానం నోటీసును పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రవేశపెట్టారు. తీర్మానం నోటీసుపై 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్‌సభ, 63 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఈ తీర్మానానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఇచ్చిన నోటీసు లోక్‌సభ సెక్రెటేరియట్‌కు అందిందని, నోటీసు పరిశీలన ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘ఇండియా’ బ్లాక్‌కి దూరంగా ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సైతం తీర్మానం నోటీసుపై సంతకాలు చేసింది. పలువురు ఇండిపెండెంట్ ఎంపీలు కూడా ఇందులో ఉన్నారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ ను తొలగించడానికి నోటీసు ఇవ్వడం భారత పార్లమెంటు చరిత్రలో ఇదే మొదటిసారి.
10 పేజీల నోటీసు
10 పేజీల నోటీసులో జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షం అనేక ఆరోపణలు లేవనెత్తింది. ఆయన తన అధికారాలను పక్షపాతంగా, వివక్షతతో దుర్వినియోగం చేయడం, సర్ ప్రక్రియతో అనేక రాష్ట్రాల్లో అప్రజాస్వామిక రీతిలో విస్తృతంగా ఓట్లను రిగ్గింగ్ చేయడం, బీజేపీకి రాజకీయ లాభాలు సంపాదించడం, ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నాయకులను అవమానించడం, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారని, అనుచిత ప్రవర్తన రుజువైందని, ఎన్నికల అవకతవకలపై విచారణను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని, సామూహికంగా ఓటుహక్కును రద్దు చేశారని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. కొన్ని పార్టీలకు అనుకూలంగా పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారని కూడా నోటీసులో ఆరోపించాయి. తమ ఆరోపణలకు బలంచేకూర్చే పలు సుప్రీంకోర్టు తీర్పులను సైతం నోటీసులో ప్రస్తావించాయి. సర్ ప్రక్రియలో కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా సీఈసీ వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి.
అభిశంసన ఇలా
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి అనుసరించిన పద్ధతిలోనే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఇందుకు లోక్‌సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది సంతకాలు అవసరం. హాజరైన సభ్యులలో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంటే తదుపరి చర్యలు తీసుకుంటారు. రెండు సభలు నోటీసును అంగీకరిస్తే, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మెన్ సంయుక్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఈ ఆరోపణలను పరిశీలిస్తుంది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రముఖ న్యాయ నిపుణుడు ఉండాలి.
నిందితుడు కమిటీ ముందు తన వైఖరిని వివరించవచ్చు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవచ్చు. ఆరోపణలు నిజమని తేలితే తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. ఉభయ సభల్లోనూ హాజరైన ఎంపీల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ లభిస్తే తీర్మానం నెగ్గుతుంది. అయితే, రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న వారు మోడీ ప్రభుత్వానికి బానిసలుగా మారుతున్నారనే వాస్తవాన్ని ప్రతిపక్షం ఒక పెద్ద సమస్యగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. అంతకుముందు, ప్రతిపక్షం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రతిపాదించిన విషయం విదితమే.



