Tuesday, January 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి''దోపిడీ దొంగల ముఠా''దశకు సామ్రాజ్యవాదం

”దోపిడీ దొంగల ముఠా”దశకు సామ్రాజ్యవాదం

- Advertisement -

సోవియట్‌ యూనియన్‌ పతనమైనప్పుడు బూర్జువా ఉదారవాద రచయితలు ప్రజాస్వామ్యం విశ్వవ్యాప్తంగా విజయం సాధించిందని, సుస్థిరతతో కూడిన ఒక కొత్త యుగం మొదలైందని ప్రకటించారు. సోషలిస్టు వ్యవస్థ అనేది అవాంఛనీయం, అభివృద్ధి నిరోధకం అని వారు పరిగణించారు. అప్పటికే పెట్టుబడిదారీ వ్యవస్థ వలస దేశాలకు స్వాతంత్య్రం కల్పించిందని, సార్వత్రిక ఓటు హక్కు కల్పించిందని, సంక్షేమ చర్యలను చేపట్టిందని, ఇక ఇప్పుడు సోషలిస్టు వ్యవస్థ నుండి ఏ విధంగానూ సవాలు లేనందున పెట్టుబడిదారీ వ్యవస్థ మానవాళికి శాంతి, ఆర్థిక భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ అందించగలుగుతుందని వారంతా విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక వామపక్ష రచయితలు చాలామంది ఇందుకు భిన్నంగా స్పందించారు. సోషలిస్టు వ్యవస్థ నుండి ఎదురైన సవాలు కారణంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉనికి కొనసాగడమే ప్రశ్నార్థకమైన కాలంలో అది తన ఉనికిని కాపాడుకోవడం కోసం వలసలకు స్వాతంత్య్రం ఇవ్వడం, సంక్షేమ చర్యలు చేపట్టడం వంటి రాయితీలను ఇవ్వక తప్పలేదని వారు భావించారు. ఇప్పుడు సోషలిస్టు వ్యవస్థ నుండి అటువంటి సవాలు లేని పరిస్థితి వచ్చినప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ తన అసలు స్వభావాన్ని ప్రదర్శించడానికి ఎటువంటి ఆటంకాలూ ఉండవని, అందుచేత అది తన కొల్లగొట్టే స్వభావంతో ముందుకొచ్చి గతంలో ఇచ్చిన రాయితీలన్నింటినీ వెనక్కి తీసుకుంటుందని వారు అంచనా వేశారు. వారి అంచనాలు సరైనవని ఇప్పుడు పూర్తిగా రుజువైంది. సామ్రాజ్యవాదం చాలా బరితెగించి ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరును బట్టి మనం అది ”దోపిడీ దొంగల ముఠా దశ” కు చేరిందని చెప్పవచ్చు.

నికొలస్‌ మదురో వెనిజులా దేశ అధ్యక్షుడిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యాడు. ఒక సైనిక చర్య ద్వారా అతడిని, అతడి భార్యను వారి గృహం నుండి అమెరికాకు ఎత్తుకుపోయారు. వారికి సంకెళ్లు వేసి నిర్బంధించారు. ఎటువంటి ఆధారాలూ లేని కల్పిత ఆరోపణలను వారిపై మోపారు. వారికి లొంగి వ్యవహరించే ఒక కీలుబొమ్మ ప్రభుత్వం అక్కడ ఏర్పడేవరకూ వెనిజులాను అమెరికా ఆధీనంలో ఉండే ఒక వలసదేశం మాదిరిగా చేసి పెత్తనం చేయబూనుకున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలా ఎవరికీ నమ్మశక్యం కాని రీతిలో, ఇంత పొగరుమోతు తనంతో అమెరికా వ్యవహరించడం సామ్రాజ్యవాదపు ”దోపిడీ దొంగల ముఠా దశ ”ప్రత్యేక లక్షణాన్ని తెలియజేస్తోంది.

ఈ దోపిడీ దొంగల ముఠా ఇలా అడ్డగోలుగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను బలవంతంగా పదవి నుండి తొలగించి తప్పుడు ఆరోపణలు మోపి అతడిని ఉరి తీశారు. లిబియా నేత గడాఫీని క్రూరంగా చంపివేశారు. సిరియాను ఆక్రమించారు. పాలస్తీనా జాతినే మొత్తంగా నిర్మూలించడానికి పూను కున్నారు. వెలుపలి నుండి వచ్చి తమ దేశాన్ని ఆక్రమించుకోవడానికి, తమను తమ నివాసాల నుండి వెళ్లగొట్టడానికి పాలస్తీనియన్లు అంగీకరించకపోవడమే వారు చేసిన నేరం! గాజా ప్రాంతాన్ని తాను నియమించిన ‘వైస్రాయి’ పాలిస్తాడని, ఆ ప్రాంతాన్ని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి వినియోగిస్తారని ట్రంప్‌ ప్రకటించాడు. ఈ చర్యలన్నీ సామ్రాజ్యవాదపు ‘దోపిడీ దొంగల ముఠా’ దశ రూపాన్ని తెలియజేస్తున్నాయి.

ఐతే, బూర్జువా ఉదారవాదులు ఈ చర్యలన్నీ ‘అదుపు తప్పిన ఆంబోతు’ వంటి స్వభావం ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ కారణంగానే జరుగుతున్నాయని అంటున్నారు. తద్వారా వారు సామ్రాజ్యవాదపు దుర్మార్గాలకు వ్యక్తిగతం గా ట్రంప్‌ను బాధ్యుడిగా చిత్రిస్తున్నారు. కాని పైన పేర్కొన్న ఉదంతాలలో అత్యధికం ట్రంప్‌ అధికారంలోకి రాకముందే జరిగినవి. తక్కిన అమెరికన్‌ అధ్యక్షులు ట్రంప్‌ మాదిరిగా కాకుండా తమ దుశ్చర్యలను సౌమ్యమైన పదజాలం ముసుగులో సమర్ధించు కోడానికి ప్రయత్నించారు. ట్రంప్‌ అందుకు భిన్నంగా సూటిగా సామ్రాజ్యవాదపు దోపిడీ నైజాన్ని తన మాటల్లో వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు. పైన ప్రస్తావించిన ఉదంతాల్లో అన్ని సందర్భాలలోనూ, గాజాలోని మానవ హననంతో సహా, తక్కిన సామ్రాజ్యవాద దేశాలు అమెరికాను పూర్తిగా సమర్ధించాయి. కానీ మరోపక్క వారంతా తమ ‘ఉదార స్వభావాన్ని’ గురించి ప్రచారం చేసుకుంటూనే వుంటారు! ఇప్పుడు నికొలస్‌ మదురోను ఎత్తుకు పోవడాన్ని మూడవ ప్రపంచ దేశాల్లో అత్యధిక దేశాలు ఖండించాయి.

ట్రంప్‌ దయకోసం పాకులాడుతున్న కొన్ని ప్రభుత్వాలు (అందులో మోడీ ప్రభుత్వం కూడా ఒకటి) మాత్రం ఖండించలేదు. కాని అమెరికాను బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి సామ్రాజ్యవాద దేశాలు బాహాటంగాగాని, లోపాయికారీగా కాని సమర్ధించాయి. నికొలస్‌ మదురో ఒక నియంత అని, అతడిని తొలగించడం గురించి అంతగా బాధ పడిపోనవసరం లేదని ట్రంప్‌ యూరోపియన్‌ మిత్ర రాజ్యాలనుండి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదన పూర్తిగా అర్ధరహితమన్నది అందరికీ తెలుస్తూనేవుంది. ప్రస్తుత అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం ఏదైనా దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పడానికి మరో దేశం సైనిక జోక్యం చేసుకోవడం అనేది నిషేధం. తమ దేశంలో ఎటువంటి పాలన ఉండాలి అన్నది పూర్తిగా ఆ దేశపు ప్రజానీకం నిర్ణయంగా ఉండాలి. అందుచేత మదురో నియంతా కాదా అన్నది ఇక్కడ పూర్తిగా అప్రస్తుతం.

అంతేకాదు, మదురోను నిర్బంధించిన తర్వాత.. అతడికి ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి అయిన మరియా కొరినా మచాడో దేశాధికారం చేపట్టడానికి వెనిజులా ప్రజల్లో మెజారిటీ మద్దతులేదని ట్రంప్‌ బహిరంగంగానే ఒప్పుకున్నాడు. రెండు ప్రధాన రాజకీయ కూటములున్న దేశంలో ఒక కూటమికి తగినంత ప్రజా మద్దతు లేనప్పుడు రెండవ కూటమికి ఎక్కువ మద్దతు ఉందని అనుకోవాలి. అటువంటి పరిస్థితిలో… మచాడోకు తగినంత మద్దతు లేదని ఒప్పుకున్నాక దానర్ధం మదురోకు మెజారిటీ మద్దతు ఉందనే కదా? అందుచేత మదురో ప్రజామద్దతు కోల్పోయాడన్న సామ్రాజ్యవాదుల వాదనలు బొత్తిగా అర్ధం లేనివి. ఒకవేళ మదురోకు, మచాడోకు ఇద్దరికీ మెజారిటీ మద్దతు లేదని అనుకుంటే, అప్పుడు ఇంకెవరికి మద్దతు ఉందో ట్రంప్‌ చెప్పాలి మరి. మదురోను తొలగించడం వెనుక అసలు కారణం ఏమిటో ట్రంప్‌ స్వయంగా జనవరి 3న పత్రికాగోష్టిలో తనదైన శైలిలో వెల్లడించాడు.

”అక్కడి భూమినుండి బ్రహ్మాండమైన స్థాయిలో సంపదను మేం వెలికితీయ బోతున్నాం”. దానిద్వారా సంపాదించే ధనం వెనిజులా ప్రజలకు మాత్రమే కాక అమెరికన్‌ చమురు కంపెనీలకు చెందనుందని, అంతేగాక, ఇంతవరకూ ‘అమెరికాకు కలిగించిన నష్టానికి పరిహారంగా’ అమెరికా ప్రభుత్వానికీ చెందనుందని ట్రంప్‌ ప్రకటించాడు. వెనిజులా తన దేశంలోని చమురు బావులను జాతీయం చేయడమే అది అమెరికాకు కలిగించిన నష్టం. ప్రపంచంలోని ఏ ఇతర దేశంలో కన్నా వెనిజులాలో ఎక్కువ చమురు నిల్వలున్నాయి. ప్రపంచ నిల్వల్లో పదిహేడు శాతం ఒక్క వెనిజులాలోనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని వెలికితీసి కొల్లగొట్టడమే తన అసలు లక్ష్యం అని ట్రంప్‌ బాహా టంగానే ఒప్పుకున్నాడు. అందుకోసమే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించాడు. ఇది పచ్చి దోపిడీ దొంగల మూక నైజం కాదా ? ‘మీ దగ్గర చమురు ఉంది. దాన్ని మేం కొల్లగొడతాం.

ఒకవేళ మీ దేశాధ్యక్షుడు అడ్డు పడితే అతడిని ఎత్తుకుపోతాం. మీ దేశాన్ని ఒక వలసగా మార్చి మేమే పెత్తనం చెలాయిస్తాం. లేదా ఒక తొత్తు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసి మా చెప్పుచేతల్లో ఉంచుకుంటాం’ – ఇదే కదా ట్రంప్‌ బాహాటంగానే చెప్తున్నది? మనకు ఒక విషయం స్పష్టం కావాలి. ఇతర దేశాల వనరులను, భూమి, సహజవనరులతో సహా కొల్లగొట్టడం అనే పనిని సామ్రాజ్యవాదం ఎప్పుడూ చేస్తూనే వుంది. వాస్తవానికి అది సామ్రాజ్యవాదానికి ఉన్న ప్రధాన లక్షణం. వలస విధానం ముగిసిన తర్వాత కాలంలో ఈ కొల్లగొట్టే పనిని కొనసాగించడానికి వీలుగా సామ్రాజ్యవాదులు అనేక దేశాల్లోని ప్రభుత్వాలు తమకు అడ్డం పడినప్పుడు వాటికి కూలదోసి ఆ స్థానంలో తమకు లొంగివుండే ప్రభుత్వాలను నెలకొల్పుతూ వచ్చారు. గ్వాటెమాలాలో ఆర్బెంజ్‌ ప్రభుత్వాన్ని సిఐఎ ప్రోద్బలంతో కుట్రపూరితంగా కూలదోశారు. ఇరాన్‌లో మొస్సాదె ప్రభుత్వాన్ని, కాంగోలో లుముంబా ప్రభుత్వాన్ని, చిలీలో అలెండీ ప్రభుత్వాన్ని కూలదోశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఈ మధ్య కాలంలో తూర్పు యూరప్‌ దేశాల్లోను, పూర్వ సోవియట్‌ రిపబ్లిక్‌ల్లోను ‘వర్ణ’ విప్లవాల పేరుతో ఇదే జరిగింది. పశ్చిమాసియా మీద అమెరికా ఇదే తీరున వ్యవహరించింది. ఐతే గతంలో చేసిన దుర్మార్గాలకు, ఇప్పుడు వెనిజులా మీద సాగించిన దానికి తేడా ఉంది. గతంలో అన్ని సందర్భాల్లోనూ ఆ దేశాల్లోని ఏదో ఒక రాజకీయ గ్రూపుకు మద్దతుగా తాను వ్యవహరిస్తున్నట్టు అమెరికా చెప్పుకుని తన దుశ్చర్యను సమర్ధించు కునేది. కాని ఇప్పుడు వెనిజులా విషయంలో అంతర్గతంగా ఎటువంటి ఘర్షణా లేకపోయినప్పటికీ, ఏ ముసుగూ లేకుండానే నగం గా ఏకపక్షంగా సైనిక జోక్యం చేసుకుంది. కొన్ని దేశాల్లో ఎటువంటి ఖనిజ సంపదా పెద్దగా లేకపోయినా, అక్కడ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలు ఉన్నట్లయితే వాటిని కూడా ట్రంప్‌ ప్రభుత్వం తన లక్ష్యం చేసుకుంది.

క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలు తన తర్వాత లక్ష్యం అని ట్రంప్‌ ప్రకటించి దుర్మార్గ పూరితమైన ‘మన్రో సిద్ధాంతాన్ని’ పునరుద్ధరించడమే తన పని అని తెలిపాడు. ఐతే ట్రంప్‌ లక్ష్యం కేవలం లాటిన్‌ అమెరికాకో, కరేబియన్‌ దేశాలకో పరిమితమై లేదు. ప్రపంచంలోని ఏ దేశమూ ఇప్పుడు అమెరికన్‌ జోక్యానికి అతీతం కాదు! గతంలో అమెరికా క్యూబా మీద క్షిపణులతో దాడికి సిద్ధపడినప్పుడు క్యూబాకు రక్షణగా సోవియట్‌ యూనియన్‌ నిలబడింది. అమెరికాతో అణుయుద్ధం జరిగే ప్రమాదం పొంచివున్నా వెనక్కి తగ్గలేదు. ఈజిప్టులో నాజర్‌ ప్రభుత్వం సూయజ్‌ కాలువను జాతీయం చేసినప్పుడు ఇంగ్లాండ్‌, ఫ్రెంచి సైన్యాలు ఈజిప్టును ఆక్రమించు కోవడానికి సిద్ధపడ్డాయి. అప్పుడు ఈజిప్టుకు అండగా సోవియట్‌ యూనియన్‌ నిలబడింది. ఈ రెండు సందర్భాల్లోనూ సామ్రాజ్యవాదులు వెనకడుగు వేయక తప్పలేదు. ఇప్పుడు సోవియట్‌ యూనియన్‌ లేకపోవడం అనేది అమెరికన్‌ సామ్రాజ్యవాదం నుండి ముప్పునెదు ర్కొంటున్న అన్ని దేశాలకూ పెద్దలోటుగా కనిపిస్తోంది.

సామ్రాజ్యవాదపు ఈ ‘దోపిడీదొంగల ముఠా దశ’ అనేది ఎంతోకాలం కొనసాగదు. ప్రపంచ ప్రజలు, ముఖ్యంగా చాలాకాలంపాటు సామ్రాజ్యవాదుల పెత్తనం కింద నలిగిపోయి స్వాతంత్య్రం సాధించుకున్న దేశాల ప్రజలు మళ్లీ మరోసారి ఆ సామ్రాజ్యవాదపు ఆధిపత్యం కింద బతకడానికి ఎంతమాత్రమూ అంగీకరించరు. వాస్తవానికి గతంలో అరబ్‌ దేశాల్లో అమెరికా జోక్యం చేసుకున్న సందర్భాల్లో కూడా ఆ దేశాల ప్రజలు అమెరికా పెత్తనాన్ని, జోక్యాన్ని తిరస్కరించారు. మదురోను తప్పించాక, ఆ స్థానంలోకి వచ్చిన ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగజ్‌ అమెరికా పెత్తనానికి లోబడి నడుచుకుంటుందని ట్రంప్‌ అనుకున్నాడు. కానీ ఆమె అమెరికా చర్యను ఖండించడమే గాక మదురోను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. దాంతో ట్రంప్‌.. మదురోకు పట్టిన గతికన్నా ఘోరమైన గతి ఆమెకు పట్టిస్తాం అని బెదిరిస్తున్నాడు. కానీ వెనిజులా దేశం యావత్తూ ఇప్పుడు మదురోకు అండగా నిలిచింది. సోవియట్‌ యూనియన్‌ ఉనికిలో లేదు గనుక తన ఆధిపత్యానికి ఇక ఎదురు లేదని అనుకుంటున్న అమెరికా కల కలగానే మిగిలిపోక తప్పదు.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -