Thursday, January 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసామ్రాజ్యవాద దురాక్రమణలను తిప్పి కొట్టాలి

సామ్రాజ్యవాద దురాక్రమణలను తిప్పి కొట్టాలి

- Advertisement -

– ప్రపంచ పోలీసుగా అమెరికా పెత్తనం
– ఉపాధి హామీ చట్టాన్ని మూలనపడేసేలా కేంద్రం కుట్ర
– రాష్ట్రంలో విమర్శలు ప్రతి విమర్శలతో సరి
– ప్రజాసమస్యలు, సంక్షేమ పథకాలపై అధికార, ప్రధాన ప్రతిపక్షాలకు పట్టింపు లేదు : విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి


ప్రపంచ న్యాయవ్యవస్థను తానే నడుపుతున్నట్టుగా, ప్రపంచ పోలీసుగా అమెరికా పెత్తనం సాగిస్తోందని, సామ్రాజ్యవాద దురాక్రమణలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. వెనిజులా అధ్యక్షులు మదురో దంపతులను అరెస్టు చేసి.. ఐక్యరాజ్యసమితి అనుమతి లేకుండా అమెరికా న్యాయస్థానంలో విచారణ చేపట్టడాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు. అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించి వెనిజులా అధ్యక్షులు మదురో దంపతులను కిడ్నాప్‌ చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. వెనిజులాలో చమురు నిక్షేపాలు పెద్దఎత్తున ఉన్నాయని, వాటిని కొల్లగొట్టుకునేందుకు ఆ దేశంపై అమెరికా అనేక ఏండ్లుగా ఒత్తిడి తీసుకొస్తోందని తెలిపారు. ఆ ఒత్తిళ్లకు భయపడని వెనిజులాను ఇబ్బంది పెట్టి.. ఇప్పుడు అధ్యక్షున్ని అరెస్టు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూబా, మెక్సికో, కొలంబియాకు కూడా ఇదే గతి పడుతుందని ట్రంప్‌ బెదిరించారని అన్నారు. వెనిజులా అధ్యక్షుని అరెస్టు విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని కోరారు. భారతదేశ ప్రధానికి సైతం ట్రంప్‌ హెచ్చరిక చేశారన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపాలని, తనకు సంతోషం కలిగించే విధంగా మోడీ వ్యవహరించాలని ట్రంప్‌ హెచ్చరించినా మౌనంగా ఉండటమేంటని ప్రశ్నించారు. అమెరికాకు ఏజెంట్‌గా వ్యవహరించాలని ట్రంప్‌ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అతనికి సహకరించే విధంగా ప్రధాని మోడీ మౌనంగా సానుకూలంగా ఉండే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా దేశ ప్రధాని మోడీ స్పందించి వెనిజులాపై దాడిని ఖండించాలని కోరారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మూలనపడేసే విధంగా వీబీ జీ రామ్‌ జీ చట్టం తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 90శాతం నిధులు కేంద్రం భరిస్తే.. 10శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల వాటాధనంగా ఉండేదని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో ఆ 10 శాతం కూడా పెట్టలేని పరిస్థితి ఉందని, అలాంటి పరిస్థితుల్లో కేంద్రం 60 శాతం.. రాష్ట్రాలు 40శాతం భరించాలని చట్టం తేవడం వల్ల ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

విమర్శలు ప్రతి విమర్శలతో సరి
రాష్ట్రంలో ప్రాజెక్టులు, ఎత్తిపోతలు, నీటి వాటాలపై చర్చల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో దూషణలు చేసుకుంటున్నారని జాన్‌వెస్లీ అన్నారు. హైదరాబాద్‌ నగరంలో పరిశ్రమలన్నింటినీ రింగ్‌ రోడ్డు అవతలకి పంపిస్తామని, పరిశ్రమలకు తక్కువ ధరలకే భూములు కేటాయిస్తామని ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని అన్నారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుందన్నారు. పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతలికి తరలించిన తర్వాత ఇక్కడ ఉన్న భూములపై వారికి హక్కులు అనడం సరికాదన్నారు. ఆ స్థలాలను ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న 30 లక్షల మందికి, పాఠశాలలకు క్రీడా మైదానాలకు కేటాయించాలని కోరారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తి చేశామని కేసీఆర్‌.. ఆయన హయాంలో ఏ పనీ కాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేసుకుంటున్నారని తెలిపారు. వాస్తవానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో రెండు ప్రభుత్వాలు కలిసి ఇప్పటివరకు రూ.32 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. వెంటనే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. జీఎస్టీలో కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు. రెండు లక్షల కోట్లు కేంద్రానికి పోతే.. రూ.55 వేల కోట్లు కూడా తిరిగి రావడం లేదని, వాటి మీద పోరాడకుండా.. కేంద్రంతో కొట్లాడకుండా విమర్శలతో కాలయాపన చేస్తున్నారని అన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో అప్పులు చేసి దోచుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు బలమైన ప్రజా పోరాటాలు చేయాలన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ అధినేత అసెంబ్లీకి రాకపోవడం సరికాదన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ వేదికను ఉపయోగించాలన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి బూతులు తిట్టుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, ప్రభావతి, బండ శ్రీశైలం, కందాల ప్రమీల, లక్ష్మినారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -