Wednesday, February 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్నికల హామీలు అమలు చేయండి

ఎన్నికల హామీలు అమలు చేయండి

- Advertisement -

ప్రజాభవన్‌ వద్ద తెలంగాణ జాగృతి ఆందోళన
పలువురి అరెస్టు-ఉద్రిక్తత : పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ల సొమ్మును పెంచాలనీ, మహిళల ఖాతాల్లో నెలకు రూ.2,500 జమ చేయాలనీ, విద్యార్థినులకు స్కూటీలు, తులం బంగారం ఇవ్వాలని కోరారు. మంగళవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో బేగంపేటలోని ప్రజాభవన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో పోలీసులు హైరానా పడ్డారు. అప్పటికప్పుడు రోడ్డుపై బైఠాయించిన మహిళలు, విద్యార్థులకు అరెస్టులు చేసి, వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా రోడ్డుపై బైటాయించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అరెస్టులు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం తప్పు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. అనంతరం ప్రజావాణి నోడల్‌ ఆఫీసర్‌ దివ్యకు వినతిపత్రం అందజేసేందుకు పోలీసులు ఆమెను అనుమతించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజావాణిలో రోజూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారనీ, కానీ ఆయన అక్కడ లేరన్నారు. కేవలం ఒక్కరోజు వచ్చి హడావిడి చేసి వెళ్లిపోయారని విమర్శించారు. సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ చొరవ తీసుకుని మహిళలకు రూ.2,500, తులం బంగారం ఇవ్వాలనీ, పింఛన్‌లు పెంచాలని డిమాండ్‌ చేశారు.

ఈ నెల 26న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దానికోసం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే సచివాలయం, అసెంబ్లీని ముట్టడించి, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మధ్య పొత్తుకు ఈ ఎన్నికల్లో సహకారమే తొలిమెట్టని చెప్పారు. నారాయణ్‌పేట్‌లో తమ పార్టీ అభ్యర్థులకు వైస్‌ చైర్మెన్‌ పదవి రావల్సి ఉండగా, కాంగ్రెస్‌ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు రైతులకు బోనస్‌ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారనీ, వారేం గొప్ప పనులు చేయలేదనీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రమే వారు అమలు చేస్తున్నారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -