10 రాష్ట్రాలో సంస్థ విస్తరణ కార్యక్రమం : 39వ నిర్మాణాత్మక సమావేశంలో సీఎండీ ఎన్.బలరామ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెట్ (ఎస్‌సీసీఎల్)లో పని సంస్కృతి పెంపుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో గుర్తింపు కార్మిక సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌తో జరిగిన 39వ నిర్మాణాత్మక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు తమకు కేటాయించిన షిఫ్ట్‌ల్లో 8 గంటల పూర్తి సమయాన్ని కంపెనీ కోసం పనిచేసేందుకు యాజమాన్యం తీసుకుంటున్న చర్యలకు సహకారం అందించాలని కోరారు. బొగ్గు రంగంలో పోటీని తట్టుకునేందుకు ధరలను తగ్గించామనీ, ఈ నేపథ్యంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అభాప్రాయపడ్డారు. అప్పుడే సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు, ఉపాధి కల్పనకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. విధులకు గైర్హాజరు అవుతున్న కార్మికులకు అవగాహన కల్పించాలని, తద్వారా క్రమశిక్షణను పెంచడం సాధ్యమవుతుందన్నారు. సింగరేణి సంస్థ రానున్న రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహించేలా విస్తరణ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నట్టు బలరామ్ తెలిపారు. బొగ్గు రంగానికే పరిమితమైన సంస్థను 5 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి చేసేలా తీర్చిదిద్దేందుకు వీలుగా సింగరేణి గ్రీన్ ఎనర్జీ, కీలక ఖనిజ అన్వేషణ, మైనింగ్ కోసం సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ కంపెనీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
రూ.300 కోట్లతో క్వార్టర్ల నిర్మాణం
సింగరేణి ఉద్యోగులకు దేశంలోనే ఏ కంపెనీలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని సీఎండీ బలరామ్ తెలిపారు. ఉద్యోగులకు విశాలమైన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.300 కోట్లకు పైగా వెచ్చించి గోదావరిఖని, శ్రీరాంపూర్, మణుగూరు, కొత్తగూడెం, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో వెయ్యి క్వార్టర్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి గోదావరిఖనిలో వచ్చే రెండు నెలల్లో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కోసం చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ఉద్యోగుల పిల్లలకు జాతీయ స్థాయి విద్యా బోధనను అందించేందుకు ఇప్పటికే రామగుండం-2 ఏరియాలో సీబీఎస్‌ఈ స్కూల్‌ను ప్రారంభించామనీ, ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సంస్థను అంతర్జాతీయ కంపెనీగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. కొత్తగూడెం భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, డైరెక్టర్లు గౌతమ్ పొట్రు, ఎల్వీ సూర్యనారాయణ కె.వెంకటేశ్వర్లు, ఎం.తిరుమల రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సింగరేణిలో పని సంస్కృతిని మెరుగు పర్చండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



