Saturday, June 28, 2025
E-PAPER
Homeఆటలువికెట్ల వేట మెరుగవ్వాలె!

వికెట్ల వేట మెరుగవ్వాలె!

- Advertisement -

తుది జట్టులోకి కుల్‌దీప్‌ యాదవ్‌ పేసర్లు ప్రసిద్‌, శార్దుల్‌ను తప్పించాలి
అప్పుడే రెండో టెస్టులో గట్టి పోటీకి చాన్స్‌

టెస్టు క్రికెట్‌ అత్యంత కఠిన, ఆసక్తికర ఫార్మాట్‌. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో బౌలర్ల ప్రదర్శన ఎలాగున్నా.. బ్యాటర్లు మెరిస్తే గెలుపు సాధ్యమే. కానీ ఐదు రోజుల ఆటలో విజయం కోసం 20 వికెట్లు పడగొట్టాల్సిందే. బ్యాటర్లు ఎన్ని సెంచరీలు చేసినా, జట్టు ఎంత భారీ స్కోరు సాధించినా.. బౌలర్లు 20 వికెట్లు తీయకపోతే ఆ మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. ఇంగ్లాండ్‌తో లీడ్స్‌ టెస్టులో భారత బ్యాటర్ల మెరుపులతో గిల్‌సేన ఫేవరేట్‌గా నిలిచినా.. బౌలర్లు విజయాన్ని వదిలేశారు!. ఐదు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టు జులై 2 నుంచి మొదలవుతుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో వికెట్ల వేట మెరగయ్యేందుకు భారత్‌ ఇప్పుటి నుంచే కసరత్తు చేయాలి.
శ్రీనివాస్‌ దాస్‌ మంతటి
టెండూల్కర్‌-అండర్సన్‌ ట్రోఫీ తొలి టెస్టులో భారత బౌలర్లు కీలక సవాళ్లు ఎదుర్కొన్నారు. 371 పరుగుల టార్గెట్‌ను కాపాడటంలో బుమ్రా అండ్‌ కో విఫలమైంది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లను కట్టడి చేసే వ్యూహ రచన, ప్రణాళికల అమలులో దారుణంగా తడబడ్డారు. ఐదు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్‌ జులై 2 నుంచి ఆరంభం అవుతుంది. తొలి టెస్టులో విజయా వశాలను జారవిడిచిన బౌలర్లు.. రెండో టెస్టులో గొప్పగా మెరుగుపడాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం, 20 వికెట్లు పడగొట్టగల బౌలింగ్‌ దళాన్ని ఎంచుకోవటం అత్యంత కీలకం. తుది జట్టు కూర్పు, ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌కు దీటైన ప్రతి వ్యూహం రచించటం భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తక్షణ కర్తవ్యం.
బిగుతుగా స్పిన్‌ ఉచ్చు
తొలి టెస్టులో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను బెంచ్‌కు పరిమితం చేయటం విమర్శలకు తావిచ్చింది. గతంలో ఇంగ్లాండ్‌ పిచ్‌లపై ఒక్క స్పిన్నర్‌తో ఆడటం సబబే. కానీ స్టోక్స్‌-మెక్‌కలమ్‌ బజ్‌బాల్‌ తరంలో అక్కడి పిచ్‌లు ఫ్లాట్‌గా మారాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా పిచ్‌లు తయారు చేస్తున్నారు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్ల దూకుడు కట్టడి చేసేందుకు భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. రెండో టెస్టు వేదిక ఎడ్జ్‌బాస్టన్‌ సైతం బ్యాటింగ్‌కు అనుకూలం. పిచ్‌ నుంచి టర్న్‌, బౌన్స్‌ లభిస్తాయని తెలుస్తోంది. కుల్‌దీప్‌ యాదవ్‌ చేరికతో భారత టెయిలెండర్‌ పెరిగినా.. వికెట్ల వేట గణనీయంగా మెరుగవుతుంది. ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ బ్యాటర్లు బెన్‌ డకెట్‌, హ్యారీ బ్రూక్‌, జో రూట్‌లను కట్టడి చేయటంలో కుల్‌దీప్‌ క్రీయాశీల పాత్ర పోషించగలడు. పిచ్‌ నుంచి స్పిన్‌కు సహకారం లభించిన సమయంలో రెండు ఎండ్‌ల నుంచి జడేజా, కుల్‌దీప్‌ మాయ చేయగలిగితే ఇంగ్లాండ్‌ బ్యాటర్లకు ముకుతాడు వేయవచ్చు.
ఆ పేసర్లపై వేటు పడాలి!
లీడ్స్‌లో శార్దుల్‌ ఠాకూర్‌, ప్రసిద్‌ కృష్ణ తేలిపోయారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ప్రసిద్‌ కృష్ణ తన ఎత్తును సద్వినియోగం చేసుకుని పిచ్‌ నుంచి అదనపు బౌన్స్‌, పేస్‌ రాబడతాడని అంచనా వేసినా.. అదేమీ జరుగలేదు. వికెట్ల వేటలో, పరుగుల నియంత్రణలో ఈ ఇద్దరు వంద శాతం విఫలమయ్యారు. ఈ ఇద్దరిలో ఒకరిని, లేదంటే ఇద్దరిని పక్కనపెట్టడం మంచిది. బంతితో, బ్యాట్‌తో మెరుగైన ప్రదర్శన చేయగల నితీశ్‌ కుమార్‌ రెడ్డిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. ప్రసిద్‌ కృష్ణను పక్కనపెట్టి.. అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఎంచుకోవాలి. అర్ష్‌దీప్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేస్‌తో ఇంగ్లాండ్‌ కుడి చేతి బ్యాటర్లకు చెక్‌ పెట్టడంతో పాటు బౌలింగ్‌కు వైవిధ్యం తీసుకురావచ్చు.
బుమ్రా ఓవర్లను తెలివిగా..
పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా టెండూల్కర్‌-అండర్సన్‌ ట్రోఫీలో మూడు మ్యాచులు ఆడతాడు. బుమ్రా పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని జట్టు అతడిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. రెండో టెస్టులో బుమ్రా ఆడేది లేనిది ఇంకా తెలియదు. ఒకవేళ బుమ్రా బరిలోకి దిగితే.. అతడి ఓవర్లను ఎంతో వ్యూహాత్మకంగా ప్రయోగించాలి. జో రూట్‌ను బుమ్రా టెస్టుల్లో పది సార్లు అవుట్‌ చేశాడు. రూట్‌ క్రీజులో ఉన్నప్పుడు ప్రయోగించటం, కొత్త బంతితో దాడి చేయించటం, ఇతర బ్యాటర్లపై ప్రణాళికలకు అనుగుణంగా అతడికి బంతి అందించాలి. బుమ్రాకు సుదీర్ఘ స్పెల్స్‌ ఇవ్వకుండా.. వరుసగా 2-3 ఓవర్లలోనే భాగస్వామ్యాలను విడగొట్టేలా ప్రణాళికలు ఉండాలి. అందుకు అనుగుణంగా ఫీల్డింగ్‌ మొహరింపులు, బ్యాటర్లపై మానసిక పైచేయి సాధించే మైండ్‌గేమ్‌తో సిద్ధంగా ఉండాలి. బుమ్రాకు విశ్రాంతి లభిస్తే.. నిలకడగా సుదీర్ఘ స్పెల్స్‌ బ్యాటర్లపై ఒత్తిడి పెంచగల యువ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ను తుది జట్టులోకి ఎంచుకుంటే భారత్‌కు ఉపయుక్తంగా ఉంటుంది.
బంతి పాతబడితే.. ఎలా?
తొలి టెస్టు గణాంకాలు ఆసక్తికర అంశాలను వెల్లడిస్తున్నాయి. ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో డ్యూక్‌ బాల్స్‌ వాడతారు. కొత్త బంతితో భారత బౌలర్లు రాణిస్తున్నా.. డ్యూక్‌ బాల్స్‌ పాత బడిన తర్వాత తేలిపోతున్నారు. నిలకడగా పరుగులు సమర్పించుకుంటున్నారు. పాత బంతితో పిచ్‌పై లెంగ్త్‌ను నిలకడగా సాధించేందుకు సిరాజ్‌, ప్రసిద్‌ ఇబ్బంది పడ్డారు. పేసర్లు గుడ్‌ లెంగ్త్‌ (6-8 మీటర్లు)తో మంచి బౌన్స్‌, సీమ్‌ను రాబట్టేందుకు ప్రయత్నించాలి. ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ వ్యూహం ‘దూకుడు’గా ఆడటం. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌ తరఫున రాణించిన బ్యాటర్లు ఎక్కువగా షార్ట్‌ బాల్స్‌పై బౌండరీలు సాధించారు. ఎడ్జ్‌బాస్టన్‌లో పేసర్లు ఫుల్‌ లెంగ్త్‌తో బంతులు సంధించాలి. కొత్త బంతితో స్వింగ్‌తో ఇబ్బంది పెట్టడంతో పాటు ఫుల్‌ లెంగ్త్‌ బాల్స్‌తో బ్యాటర్లను ఇరకా టంలో పడేయాలి. లీడ్స్‌ అనుభవాలతో ఎడ్జ్‌బాస్టన్‌లో మెరుగైన వ్యూహంతో సిద్ధంగా లేకుంటే.. శుభ్‌మన్‌ గిల్‌ మరోసారి భారీ మూల్యం చెల్లించేందుకు సిద్ధంపడాల్సిందే!.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -