15 శాతం తగ్గిన నేరాలు
సంధ్య థియేటర్ ఘటనలో 100పేజీల చార్జీషీట్
డ్రగ్స్, డ్రంకెన్ డ్రైవ్‌పై ఉక్కుపాదం
నార్కొటిక్ బృందాలను మరింత బలోపేతం చేస్తాం : హైదరాబాద్ సీపీ విసి.సజ్జనార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
నేర నియంత్రణలో అత్యాధునిక టెక్నాలజీతో మెరుగైన ఫలితాలు సాధించామని, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 15శాతం నేరాలు తగ్గాయని హైదరాబాద్ సీపీ విసి.సజ్జనార్ తెలిపారు. గతేడాదితో పోల్చితే మహిళలు, చిన్నారులపై మాత్రం నేరాలు పెరిగాయన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో శనివారం విలేకరుల సమావేశంలో 2025 వార్షిక నేర నివేదికను సీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు, నకిలీ వస్తువులు, విత్తనాల నియంత్రణపై డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
రానున్న రోజుల్లో నార్కొటిక్ టీమ్స్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్‌వన్ స్థాయిలో ఉన్నారని, గతంతో పోలిస్తే నగరంలో లా అండ్ ఆర్డర్ బాగుందని, క్రైమ్‌రేట్ అదుపులో ఉందని తెలిపారు. నగర పోలీసులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఏ ఆపద వచ్చినా డయల్ 100కు ఫోన్ చేయాలని కోరారు. అత్యాశకుపోయి నగరవాసులు సైబర్ నేరాలలో చిక్కుకుంటున్నారని, వాటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. నగర వ్యాప్తంగా 5లక్షల 20 వేల సీసీ కెమెరాలను వినియోగిస్తున్నామన్నారు.
మహిళలపట్ల పెరిగిన నేరాలు
ఈ ఏడాది మహిళలపై (జరిగిన దాడులు, లైంగిక వేధింపులతోపాటు ఇతర నేరాలు) 6 శాతం నేరాలు పెరిగాయని సీపీ తెలిపారు. గతేడాది 2,482 వరకు కేసులు నమోదైతే, ఈ ఏడాది 2,625 కేసులు నమోదయ్యాయన్నారు. చిన్నారులపై సైతం (నేరాలు) దాడులు పెరిగాయన్నారు. ఈ క్రమంలో 7శాతం పోక్సో కేసులు అధికమయ్యాయన్నారు. చిన్నారులపై దాడులు, ఇతర నేరాలకు పాల్పడిన వారిపై 2024లో 449కేసులు నమోదైతే, ఈ ఏడాది 568కేసులు నమోదయ్యాయన్నారు. గతేడాది మహిళలపై లైంగికదాడి కేసులు 484 నమోదైతే ఈ ఏడాది 405 నమోదయ్యాయన్నారు.
వీటితోపాటు 7 శాతం దోపిడీలు పెరిగాయని తెలిపారు. కిడ్నాప్ కేసులు 2024లో 324 నమోదైతే, 2025లో 166కేసులు నమోదయ్యాయన్నారు. ప్రాపర్టీ వివాదాల కేసులు 61శాతం పెరిగాయన్నారు. నేరస్థులకు శిక్షలు పడిన కేసుల సంఖ్య 68శాతం పెరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు సంఖ్య 3,058 నుంచి 2,678 తగ్గాయన్నారు. సైబర్ క్రైమ్ నేరాలు గతేడాదితో పోలిస్తే 8శాతం తగ్గాయన్నారు. హత్య కేసులు తగ్గాయన్నారు. డ్రగ్స్ కేసులు పెరిగాయన్నారు. డ్రగ్స్, గేమింగ్ య్యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ కేసులకు సంబంధించి గతేడాదితో పోలిస్తే కేసులు పెరిగాయని, ఈ వ్యవహారంలో ఈ ఏడాది 368 కేసులు నమోదుకాగా, 2,690 మంది నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్త
న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సీపీ సూచించారు. మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. నగర వాసులు సాధ్యమైనంత మేరకు ప్రజారావాణను ఉపయోగించాలని కోరారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చార్జిషీట్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చార్జిషీట్ దాఖలు చేసినట్టు నగర సీపీ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని తెలిపారు. ఇందులో సీనీ హీరో అల్లు అర్జున్‌తోపాటు 23 మందిపై అభియోగాలు మోపుతూ దాదాపు 100పేజీల చార్జీషీట్‌ను నాంపల్లి కోర్టులో నివేదిక సమర్పించామన్నారు. అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారన్నారు. ఈ ఘటనలో మహిళ రేవతి(35)ప్రాణం కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.



