నవతెలంగాణ ఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఇప్పటివరకు కులగణన జరగలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారని గుర్తుచేశారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేసిందని తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు, నేతలకు సీఎం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో కులగణన సర్వే ప్రక్రియను 2024లో మేం ప్రారంభించాం. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల, రాజకీయ సర్వే సమగ్రంగా జరిగింది. ఇది 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తమైంది. ప్రధాని మోడీకి బీసీలపై నిజమైన ప్రేమ లేదు. కొన్ని విషయాల్లో మోడీ సర్కార్ దిగివచ్చేలా రాహుల్‌గాంధీ పోరాటం చేశారు. ఆయన పోరాడినందువల్లే మూడు రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కులగణన చేసేందుకు కూడా దిగి వచ్చింది’’ అని అన్నారు.
అంతకుముందు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు రాష్ట్రం అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్టు వివరించారు. కాంగ్రెస్ ఒత్తిడితో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్రం దిగి వచ్చిందని అన్నారు.