అందం, అభినయంతోపాటు అద్భుతమైన వ్యక్తిత్వంతో నేషనల్ క్రష్‌గా ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేసిన నాయిక రష్మిక మందన్నా చిత్ర పరిశ్రమలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేశారు. ఈ 9 ఏళ్ల కెరీర్‌లో నాలుగు భాషల్లో మొత్తం 25 సినిమాల్లో నటించారు. మోడలింగ్‌లో రాణించిన రష్మిక 2016లో ‘కిరాక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా కన్నడనాట ఘన విజయం సాధించింది. ఆ తరువాత నటించిన ‘అంజని పుత్ర’ కన్నడ సినిమా కూడా విశేష ప్రేక్షకాదరణ పొందింది. 2018లో కామెడీ డ్రామా ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని, తెలుగునాట ఆమెకు మరిన్ని అవకాశాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ విజయాన్ని కైవసం చేసుకుని, రష్మికను టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేర్చింది. అంతేకాదు బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్ అవార్డును సొంతం చేసుకుంది. ‘గీత గోవిందం’ తరువాత విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘కామ్రేడ్’ చిత్రాలు సైతం భారీ కలెక్షన్లతో అద్భుత విజయాల్ని సాధించాయి.
ఈ సినిమాల్లో రష్మిక నటన, డాన్స్‌తోపాటు కామెడీతో సైతం మెప్పించగలదని నిరూపించుకుంది. ఈ విజయ పరంపరని కొనసాగిస్తూ ‘పుష్ప’ సినిమా ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. అంతేకాదు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికల జాబితాలోనూ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ‘పుష్ప’కి సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప 2’లోనూ తనదైన నటనతో రష్మిక అందర్నీ మెస్మరైజ్ చేశారు. దీంతో ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అక్కడ నటించిన ‘యానిమల్’, ‘చావా’ చిత్రాలూ అద్భుత విజయాన్ని సాధించాయి. అలాగే తెలుగులో నటించిన ‘సీతారామం’ సైతం విశేష ప్రేక్షకాదరణతో అద్భుత విజయాన్ని సాధించింది. ఇక రీసెంట్‌గా రిలీజైన ‘థామా’ బాలీవుడ్ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది. 9 ఏళ్ల కెరీర్‌లో అపజయం ఎరుగని కథానాయికగా బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన రష్మిక నిశ్చితార్థం ఇటీవల తన ప్రేమికుడు హీరో విజయ్ దేవరకొండతో జరిగింది. ఆమె నటించిన కొత్త చిత్రం ‘గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ఆమె నటనకు బోల్డెన్ని అవార్డులు రావడం ఖాయమనే దీమాని మేకర్స్ వ్యక్తం చేయటం విశేషం.
9 ఏళ్ళలో, 4 భాషల్లో ..దిగ్విజయంగా 25 చిత్రాలు
- Advertisement -
- Advertisement -



