Wednesday, October 15, 2025
E-PAPER
Homeజాతీయం41 ఏండ్ల నాటి కేసులో…

41 ఏండ్ల నాటి కేసులో…

- Advertisement -

గుజరాత్‌ మాజీ ఐపీఎస్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌
నాడు అమిత్‌ షాపై ముడుపుల ఆరోపణలు చేసిన అధికారి

అహ్మదాబాద్‌ : 1984 లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసులో గుజరాత్‌ మాజీ ఐపీఎస్‌ అధికారి కులదీప్‌ శర్మపై తాజాగా నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈయన బీజేపీపై.. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలపై తరచూ విమర్శలు చేస్తుంటారు. 41 ఏండ్ల క్రితం కులదీప్‌ శర్మ ఓ కాంగ్రెస్‌ నాయకుడిపై దాడి చేశాడని ఆరోపిస్తూ నమోదు చేసిన కేసు అది. ఇప్పుడు ఆ కేసును తిరగదోడి శర్మపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారంట్‌ జారీ చేశారు. కులదీప్‌ శర్మ గుజరాత్‌ డీఐజీగా పనిచేశారు. గుజరాత్‌ హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై కులదీప్‌ లోగడ ‘ముడుపుల’ ఆరోపణలు చేశారు.

2005లో రూ.1,600 కోట్ల బ్యాంక్‌ కుంభకోణానికి పాల్పడిన కేతన్‌ పరేఖ్‌ను కేసు నుంచి బయటపడేసేందుకు అమిత్‌షా రూ.2.5 కోట్ల లంచం తీసుకున్నారని కులదీప్‌ ఆరోపించారు. అది గుజరాత్‌కు చెందిన సహకార బ్యాంక్‌. దాని డైరెక్టర్లలో అమిత్‌ ఒకరు. ఆ సమయంలో కులదీప్‌ సీఐడీ విభాగంలో అదనపు డీజీపీగా పని చేస్తున్నారు. అమిత్‌పై ముడుపుల ఆరోపణలు చేయడంతో ఆయనను పోలీసు శాఖ నుంచి బదిలీ చేసి ప్రాధాన్యత లేని గొర్రెలు-ఉన్ని అభివృద్ధి శాఖకు పంపారు. ఆ శాఖకు మేనేజింగ్‌ డైరెక్టరుగా పనిచేసిన తొలి ఐపీఎస్‌ అధికారి కులదీప్‌ శర్మే. ఆయనకు ముందు ఆ పదవిలో పనిచేసిన 31 మందీ ఐఏఎస్‌ అధికారులే.

కులదీప్‌ శర్మ సోదరుడు ప్రదీప్‌ శర్మ ఐఏఎస్‌ అధికారి. ఆయన 1981లో గుజరాత్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసులో చేరారు. 2010లో అవినీతి ఆరోపణలపై అరెస్టయి సస్పెండ్‌ అయిన ప్రదీప్‌ 2015లో పదవీ విరమణ చేశారు. 2001లో కచ్‌లో భూకంపం సంభవించినప్పుడు ఆయన అక్కడ కలెక్టరుగా పనిచేశారు. అనేక పునరావాస కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టి అప్పటి ముఖ్యమంత్రి మోడీ మెప్పు పొందారు. అయితే కచ్‌లో ఓ యువ మహిళా ఆర్కిటెక్ట్‌పై మోడీ ఆదేశాల మేరకు రహస్యంగా నిఘా పెట్టారంటూ ప్రదీప్‌ చేసిన ఆరోపణ సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో మోడీపై సీబీఐ విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు.

ఆ మహిళా ఆర్కిటెక్ట్‌ని మోడీకి పరిచయం చేసింది తానేనని కూడా ఆయన చెప్పారు. ప్రదీప్‌ తన సర్వీసు కాలంలో పదిహేను క్రిమినల్‌ కేసులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ప్రయివేటు కంపెనీకి కేటాయించడంలో ప్రదీప్‌ పలు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణపై నమోదైన కేసులో ఈ ఏడాది ప్రారంభంలో కచ్‌లోని ఓ కోర్టు ఆయనకు ఐదేండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇప్పుడు వేధింపుల కేసులో కచ్‌లోని ఓ సెషన్స్‌ కోర్టు కులదీప్‌ శర్మకు, రిటైర్డ్‌ డీఎస్పీ గిరీష్‌ వసవాడకు నాన్‌ బెయిలబుల్‌ వారంట్లు జారీ చేసింది. ప్రదీప్‌ శర్మ అరెస్టు కావడం, మోడీ ప్రధాని కావడం వంటి పరిణామాల తర్వాత కులదీప్‌ శర్మ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో నాలుగు దశాబ్దాల నాటి కేసును దుమ్ము దులిపి ఆయనపై చర్యలకు ఉపక్రమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -