Thursday, December 11, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఎముకలు కొరికే చలిలో..

ఎముకలు కొరికే చలిలో..

- Advertisement -

మూడు రోజులుగా నడిరోడ్డుపై మహిళా కార్మికులు…
యాజమాన్యం మొండి వైఖరితో ఆందోళన
వేతనాలు పెంచాలంటూ డిమాండ్‌
నాచారం షాహి గార్మెంట్‌ పరిశ్రమ వద్ద ఘటన
తొంగి చూడని ప్రజా ప్రతినిధులు
పట్టించుకోని అధికారులు
అండగా సీఐటీయూ
పోరాటానికి చుక్క రాములు, ఎస్‌ వీరయ్య , పాలడుగు భాస్కర్‌ సంఘీభావం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వారంతా మహిళలు.. రెక్కాడితేగానీ డొక్కాడని శ్రమజీవులు. పార్టీలు, సంఘాలంటే తెలియని సాధారణ కార్మికులు. అయినా తమ జీతాలు పెంచని యాజమాన్యంపై ధిక్కార స్వరం వినిపించారు. వేతనాలు పెంచుతారా? లేదా? అంటూ నిరసనకు దిగారు. తమ పట్ల మొండి వైఖరిని అనుసరిస్తున్న కంపెనీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంట్లో ఉంటేనే చలికి వణికిపోతున్న ప్రస్తుత తరుణంలో మూడు రోజులుగా చలికి వణుకుతూ.. రోడ్డుపై న్నే బైటయించారు. వేతనాలు పెంచేదాకా, డిమాండ్లు నెరవే రదాకా వెనకడుగు వేసేదే లేదంటూ తెగేసి చెప్పారు. హైదరాబాద్‌ నాచారం పారిశ్రామికవాడలోని షాహి గార్మెంట్స్‌ ఎక్స్‌పోర్టు ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీలోని 1,500 మంది మహిళా కార్మికులు చూపించిన తెగువ ఇది.

ఇంత జరుగుతున్నా ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడూ అటు తొంగి చూడలేదు. అధికారులకు వీరి గోస వినబడటం లేదు. ఈ సమయంలో మీకు అండగా మేమున్నామంటూ సీఐటీ యూ ముందుకొచ్చింది. మహిళా కార్మికుల ఆందోళనకు తాము పూర్తి సంఘీభావం తెలుపుతున్నామని, వేతనాలు పెంచే వరకూ కార్మికుల వెన్నంటే ఉంటామని ఈ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడు గు భాస్కర్‌ వారికి భరోసానిచ్చారు. బుధవారం ఆందోళన జరుగుతున్న షాహి కంపెనీ వద్దకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్ష్షులు ఎస్‌ వీరయ్య, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎస్వీ రమతో కలిసి వారు వెళ్లారు. మహిళా కార్మికులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

మీ పోరాటం.. అభినందనీయం… చుక్క రాములు, ఎస్‌ వీరయ్య , పాలడుగు భాస్కర్‌
ఏ సంఘాల ప్రమేయం లేకున్నా మహిళా కార్మికులు ముందుకొచ్చి పోరాడటం అభినందనీయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎస్‌. వీరయ్య అన్నారు. అడగందే అమ్మయినా అన్నం పెట్టబోదని వారు వ్యాఖ్యానించారు. ఆందోళన చేయకుంటే ఏ యాజమాన్యం స్పందించదు, వేతనాలు పెంచదు, సౌకర్యాలు కల్పించబోదని అన్నారు. కార్మికుల కష్టాన్ని గుర్తించకుండా.. చేసిన శ్రమకు తగిన జీతం ఇవ్వకుండా యాజమానులు శ్రమదోపిడికి పాల్పడుతున్నారని విమర్శించారు. ‘లాభాలు గడిస్తున్న ఓ యాజమానీ..నీ కంపెనీలో వాటా అడుగుతున్నామా? కార్మికులకు వారి కుటుంబాలు బతికేందుకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలనటం నేరమా? పెరిగిన ధరలకు అనుగుణంగా మీరిచ్చే జీతాలు సరిపోవటం లేదని చెప్పటం అధర్మమా? ఏది ధర్మం? ఏది నీతి?’ అని ప్రశ్నించారు.

కార్మికులకు వర్తించే జీవోను రాష్ట్ర ప్రభుత్వం 2012 లోనే తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్సే అధికారంలో ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందనీ, ఆ ప్రభుత్వం కూడా జీతాలు పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు. సోయిలేని పాలకులకు కార్మికుల కష్టాలు పట్టటం లేదన్నారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా అసంఘటిత రంగంలో పని చేస్తున్నారని, కనీస వేతనాల జీవోను అమలు చేస్తే వారందరికీ ఉపయోగం జరుగుతుందని గుర్తు చేశారు. అదే జరిగితే మేనేజ్‌మెంట్‌ను నిలదీసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. యాజమానులకు ఊడిగం చేసే పాలకులు, కార్మిక శాఖ ఆ జీవోను తొక్కిపట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు, కొందరు నిపుణులు చెప్పినదాని ప్రకారం ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని చెప్పారు.

దీన్ని ఏ ప్రభుత్వమూ పట్టించుకోక పోవటం విడ్డూరంగా ఉందన్నారు. అంటే..కార్మికులన్నా..వారి సంక్షేమమన్నా పాలకులు, అధికారులకు, యజమానులకు పూచిక పుల్లతో సమానమా? అని ప్రశ్నించారు. పోరాటానికి ఎవరు సంఘీభావం ప్రకటించినా తీసుకోవాలనీ, మోసం చేసే వాళ్లను ఇక్కడే బొందపెట్టాలని వారు మహిళా కార్మికులకు పిలుపునిచ్చారు. పోరాటానికి సీఐటీయూ సంపూర్ణ మద్దతిస్తుందని, ఇక నుంచి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటుందని ప్రకటించారు. అవసమైతే కార్మికశాఖ ముట్టడికి కూడా వెనుకాడొద్దని సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చెల్‌ జిల్లా అధ్యక్షులు జె చంద్రశేఖర్‌, నాయకులు కోమటి రవి, గణేష్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్‌టీయూ నాయకురాలు అరుణ, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి అనసూయ కూడా మహిళా కార్మికుల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.

ఏండ్లుగా పని చేస్తున్నా..అరకొర వేతనాలేనా? : మహిళా కార్మికులు
‘పదకొండేండ్లుగా ఈ కంపెనీలో పని చేస్తున్నాం. అయినా ఇచ్చే వేతనం బెత్తెడే. ఈ అరకొరా జీతాలతో మేం ఎలా బతకాలి. ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ఇంటి అద్దెలు, పిల్లల పాఠశాల ఫీజులు, ఆస్పత్రుల ఖర్చులు ఎలా పెరుగుతున్నాయో కంపెనీ వాళ్లకు తెలియదా? హైదరాబాద్‌ మహానగరంలో రూ.10 వేలతో ఇల్లెలా గడుస్తుంది?’ అని ఈ సందర్భంగా మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాకు సెలవులు లేవు, బోనసుల్లేవు.. మూడు డుమ్మాలు కొడితే రూ. 2,500 కట్‌..ముప్పై రోజులు కష్టపడితే ఇచ్చే జీతం మాత్రం రూ.10వేలు. ఇదెక్కడి న్యాయం?’ అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము గత మూడు రోజులుగా నడిరోడ్డుపై రాత్రింబవళ్లు ఆందోళన కొనసాగిస్తుంటే..కార్మిక శాఖ అధికారులుగానీ, ప్రజా ప్రతినిధులుగానీ ఇటువైపు రాలేదు, తమను పట్టించుకోలేదంటూ ఆవేనద వ్యక్తం చేశారు. ఓట్లప్పుడు అమ్మా, అయ్యా అంటూ బతిమిలాడే లీడర్లు ఇప్పుడు ఎటుపోయారంటూ ప్రశ్నించారు. ‘మూడు రోజులుగా కుటుంబాలను వదిలిపెట్టి చలిలో ఆందోళన సాగిస్తున్నాం. జీతాలు పెంచే వరకు మా పోరాటాన్ని ఆపేది లేదు. ఇక్కడి నుండి కదిలేది లేదు. అరెస్టులు చేస్తారో, లాఠీఛార్జి చేస్తారో.. చేసుకోండి…’ అంటూ వారు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -