రామాయంపేట బైపాస్ భూసేకరణలో ‘బహిరంగ దోపిడీ’
రైతులను కూర్చో బెట్టి మెదక్ ఎంపీ ఇచ్చిన హామీ ఏమైంది?
మౌనం వెనుక ఉన్న మర్మమేమిటని నిర్వాసితుల ప్రశ్న
నోరు మెదపని అధికారులు
మోసపోయామంటున్న బాధితులు
కోట్ల విలువైన భూములకు లక్షల్లోనే పరిహారం
నవతెలంగాణ-రామాయంపేట
మెదక్ జిల్లా రామాయంపేటలో జాతీయ రహదారి బైపాస్ 765డి రోడ్డు నిర్మాణం రైతుల పాలిట శాపంగా మారింది. అన్నదాతల కన్నీళ్లు పారుతున్నాయి. అభివృద్ధి పేరిట జరుగుతున్న ఈ భూసేకరణ ప్రక్రియ పక్కాగా ఒక ‘బహిరంగ దోపిడీ’ని తలపిస్తోంది. గజం భూమి వేలల్లో, ఎకరం కోట్లలో పలుకుతున్న తరుణంలో.. ప్రభుత్వ అధికారులు మాత్రం పాతకాలపు లెక్కలతో రైతుల నోట్లో మట్టి కొడుతుంటే, వారికి అండగా ఉంటానన్న నాయకులు ఇప్పుడు ‘కనుమరుగు’ కావడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. రామాయంపేట మీదుగా 765డి హైవే రోడ్డు కోసం సర్వే జరుగుతున్న సమయంలో రైతులు నిరసన తెలిపారు.
ఆ సమయంలో ఎంపీ రఘునందన్‌రావు గత సంవత్సరం జనవరి 3న కలెక్టర్ కార్యాలయంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ‘మీ భూమికి సరైన ధర ఇప్పిస్తా.. మీ వెంటే ఉంటా’ అని భరోసా కల్పించారు. అదేవిధంగా స్థానిక మెహర్ సాయి ఫంక్షన్ హాల్ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి, బహిరంగ మార్కెట్ ధర రైతులకు ఇప్పిస్తానని, వ్యవసాయ భూములకు సైతం గజం చొప్పున ధర చెల్లించే విధంగా చూస్తానని మరోసారి హామీ ఇచ్చారు. ఇప్పుడు భూసేకరణ ప్రక్రియ ముగుస్తున్నా, ఆయన నోరు మెదపకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ పూర్తయ్యే వరకు రైతులతో మమేకమైనట్టు నటించి, అసలు పరిహారం చెల్లింపుల దగ్గర మౌనం వహించడం వెనుక ఉన్న మర్మమేమిటని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
అధికారుల ‘చిల్లర’ లెక్కలతో రైతులకు చిక్కులు
2019 నాటి రిజిస్ట్రేషన్ విలువల గజం స్థలం రూ. 5000 ఉండగా, అధికారుల కేవలం గజం రూ.5 వందల రూపాయలు మాత్రమే ధర నిర్ణయించి చేతులు దులుపుకొంటున్న తీరుపై, రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. 2019 సంవత్సరంలో బహిరంగ మార్కెట్లో వ్యవసాయ భూమి విలువ కోటి రూపాయలకు పైగా ఉండగా, కేవలం ఎకరాకు 8 లక్షల ధర మాత్రమే నిర్ణయించి రైతులను నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేశారు. ఇచ్చిన హామీలు ఏమైందని అధికారులను అడిగినా స్పందన లేదు. రైతులు ఇచ్చింది తీసుకోవాల్సిందే అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఆ హామీలు మాకే తెలియదంటున్నారు.
పాలకుల నిర్లక్ష్యం.. బాధితుల ఆవేదన!
కోట్ల విలువ చేసే పట్టా భూములను కేవలం రూ. 10 లక్షల లోపే పరిహారం కట్టి లాక్కోవడం దారుణమని, ఇది రైతుల హక్కులను కాలరాయడమేనని స్థానికులు వాపోతున్నారు. పేర్లు రాస్తే ఏమవుతోందనని మీడియాకు తమ పేర్లు చెప్పడానికి భయపడుతున్నారు. అటు అధికార పక్షం, స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రావు, ఎంపీ రఘునందన్‌రావు ఇద్దరూ రైతుల పక్షాన సరైన సమయంలో స్పందించకుండా, సామాన్యులను బలి చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ‘మా కన్నీటిపై రోడ్లు నిర్మిస్తారని కన్నీరు మున్నీరవుతున్నారు.’ తక్షణమే ప్రభుత్వం, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నారు.



