పల్లె, పొలం, కొండ, కోన, నది, జలపాతం అంటూ స్వేచ్ఛగా తిరిగిన జీవితం నగరంలో నాలుగ్గోడల మధ్య బంధించినట్టుగా ఉంది. అలా అని ఎవరో బలవంతంగా వేసిన బంధనాలు కావివి. జీవితం, లక్ష్యం, పిల్లల చదువు అంటూ తప్పని పరిస్థితి. అలాగని నిర్లిప్తమైన జీవితమా అంటే కాదు. చూసే దశ్యాలు, ఎదురయ్యే మనుషులు, దాటుకొచ్చే సంఘటనలు, లోపల రేగే సంఘర్షణలను రోజువారి జీవితానికి అల్లుకుంటూ నిన్నకంటే నేడు, నేటికంటే రేపు అన్నట్టుగా సాగిపోతోంది. కానీ ఎక్కడో మదిమూలల్లో బయటికి చెప్పలేని ఉక్కపోత.
ఆ వెలితిని గుర్తుచేసింది ఒక అరుపు. నిజంగా అరుపే. అడవి పిట్ట అరుపు. ప్రగతినగర్‌లో ఇంటి కిటికీ తెరిస్తే కాంక్రీట్ జంగిల్ మధ్యన ఇరవై ఇరవై అయిదు ఎకరాల్లో చిన్న గుట్ట. ఒకప్పుడు అడవే అయ్యుంటుంది కానీ ఇప్పుడు రూపం కోల్పోయింది.
ఎండాకాలం మొదలవ్వకముందే ఆకులు రాల్చి ఎండు పుల్లలుగా మారేయి చెట్లన్నీ. అది చూడలేక మేఘం చినుకు రాల్చింది. ఒక్క వాన చాలంటూ చిగుర్లెత్తాయి చెట్లన్నీ. ఆ సంబరాన్ని ఎలుగెత్తి చాటుతూ గొంతులు సవరించిందొక పిట్ట.
తెల్లవారుజాము మొదలు, సాయంత్రం వరకూ కిక్కూకూ.. కిక్కూకూ… అంటూ పిట్టలు అరుస్తూనే ఉంటాయి. కాకపోతే వాహనాల రొద, మనుషుల అలికిడి, ఫ్యాన్ చప్పుళ్లకు సౌండ్ ఫిల్టర్లు బిగించుకోవాలి.
ఆ పిట్ట అరుపు విన్నప్పుడల్లా ఇది కాదు కదా మన జీవితం అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. దాని స్వేచ్ఛకు చిన్న అసూయ కూడా లోలోపల. అదే ప్రయాణానికి సిద్ధం చేసింది. స్కూల్స్‌కు సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతో ఇంటికి బయల్దేరాం.
కానీ ఎక్కడికి వెళ్లాలనేది సమస్య. లంకమలకు పోదామంటే ఎండాకాలం ఒంట్లో ఉన్న చుక్క నీటిని నిర్ధాక్షిణ్యంగా పీల్చేస్తుంది అడవి. జాలి దయ ఉండవు దానికి. తొలకర్లు పలకరించేంత వరకూ ఓపిక పట్టాలి.
పులికాట్ సరస్సుగా పిలవబడే ప్రళయ కావేరి చూడాలని ఎన్నాళ్లనుంచో ఉంది. దేశంలో రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. తమిళనాడులోని పళవేర్కాడ్ దగ్గర బంగాళాఖాతం నుంచి వెనక్కి తన్నుకుని తడ వరకూ వస్తాయి నీళ్లు. లాగూన్స్ అంటారు వీటిని. ఇరకం దీవి ఉండేది అక్కడే.
పులికాట్ అనగానే అందరికీ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, ఫ్లెమింగో పక్షులు, సైబీరియా కొంగలు గుర్తుకొస్తాయి. నిజానికి అంతకుమించిన జీవన సంస్కతి ఉందక్కడ అనిపిస్తుంది.
యానాదుల జీవితం ఇక్కడి బురద నేలల నుంచే మొదలైంది అంటారు ఆంథ్రోపాలజిస్ట్, రచయిత స.వెం. రమేష్. ఇప్పటికి కూడా యానాదులు చేపలు పట్టడంలో మంచి ఒడుపు చూపుతారు.
పులికాట్ సరస్సులో ఉండే మరో ప్రధాన సమస్య అంతర్రాష్ట్ర సరిహద్దు జలాలు. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో వాటి కోసం మత్స్యకారుల మధ్యన పడవల మీద యుద్ధాలు జరుగుతుంటాయి. భౌగోళికంగా చూస్తే పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్‌లో 84% ఉంటుంది. తమిళనాడు భూభాగంలో 16% ఉంటుంది. అయితే సరస్సులోకి బంగాళాఖాతం నీళ్లొచ్చే వెంట్ తమిళనాడు భూభాగంలో ఉండటం వల్ల వాళ్లకు అడ్వాంటేజ్.
అవన్నీ ప్రత్యక్షంగా చూడాలని చాన్నాళ్లనుంచి ఉంది. మొన్న సంక్రాంతికి తూపిలిపాళెం వెళ్లాం గానీ సమయం కుదరలేదు.
పిల్లలకు సమ్మర్ హాలిడేస్ రావడంతో హైదరాబాద్ నుంచి శనివారం తెల్లవారుజామున్నే బయల్దేరాం. పదకొండుకల్లా ఇంటికి పోతే లంచ్ తిని, పులికాట్ వెళ్లేదారిలో రాపూరు – గూడూరు మధ్యన సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న ‘పుట్టంరాజు కండ్రిగ’ ఊరు చూడాలని అనుకున్నాను. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీ4 అంటూ సంపన్నుల చేత గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సహిస్తాం అని ప్రకటించింది. వాస్తవంలో అది ఎలా ఉంటుందో, పుష్కర కాలంలో అది ఎంత అభివద్ధి చెందిందో ప్రత్యక్షంగా చూద్దామని ఆలోచన.
కానీ కార్ ఇంజిన్ ట్రబుల్ రావడంతో మెల్లిగా ఇంటికి చేరేసరికి రెండు అయింది. నాలుగ్గంటలకల్లా కడప నుంచి ఇన్‌టు ది నేచర్ టీం వచ్చారు. రాత్రి వంటకు కావలసిన సరంజామా అంతా సర్ది బయల్దేరేసరికి అయిదు అయింది.
నేను బుల్లెట్‌లో వెళ్దామనుకున్నాను గానీ నాలుగున్నరగంటల ప్రయాణం ఎండకు అల్లాడిపోతావని మా వాళ్లు చెప్పడంతో కారులోనే బయర్దేరాం. సాయంత్రం అయిదు గంటలవుతున్నా కూడా ఎండ సెగ ఇంకా చల్లారలేదు.
కారు నెల్లూరు రోడ్డునుంచి సోమశిల, పెంచలకోన హైవే వైపు తిరిగింది. అప్పటికే పొద్దు మల్లెంకొండలోకి దిగిపోవడానికి సిద్ధంగా ఉంది. సాయంత్రమైతే ఆ రోడ్డు ప్రమాదకరం. ట్రాఫిక్ తక్కువే గానీ రైతులు వరి, చెనిక్కాయ, మొక్కజొన్నలు రోడ్ల మీదనే ఆరబోసి ఉంటారు. ఆవులు కూడా రోడ్డుమింద ఇష్టారాజ్యంగా పడుకుని ఉంటాయి.
రాపూరు చేరేసరికి పరిసరాలు మొత్తం చీకట్ల ఆధీనంలోకి వెళ్లాయి. పుట్టంరాజు కండ్రిగ ఇంగొక రోజు చూద్దామని గూడూరు వైపు కదిలాం. కందుకూరు నుంచి సాయి మోహన్, వాళ్ల ఫ్రెండ్ యశ్వంత్ కలిశారు. వాళ్ల బైక్ నేను తీసుకుని, వాళ్లను కార్‌లో ఎక్కించా.
ఇరకం దీవికి ఎలా వెళ్లాలని మునికాంతపల్లె కథల రాతగాడు, మొగిలేరు బిడ్డ సోలోమాన్ విజయకుమార్ అన్నను అడిగితే ‘అరంబాక్కం వరకూ కార్లు వెళ్తాయి బ్రో. అక్కన్నుంచి ఇరకం దీవికి పడవలో పోవాలి. ఇరకం దీవిలో పిరుదులు ఉంటాయి. వాటితో కొంచెం జాగ్రత్త’ అని చెప్పాడు.
నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ దాటిన తర్వాతొచ్చింది అరంబాక్కం. అప్పటికే పదిన్నర అయింది. అది తమిళనాడు. సాధారణంగా బార్డర్‌లో ఉన్న వాళ్లకు తెలుగు తమళం రెండూ వస్తాయి గానీ వీళ్లెవరూ తెలుగు మాట్లాడట్లేదు. ఒకబ్బాయి మాత్రం దారి చెప్పాడు.
రైల్వే లైన్‌లో ఒకటి ఆంధ్ర, ఒకటి తమిళనాడు. భలేగా ఉంది వాళ్ల జీవితం. ఊర్లో లోపలికి వెళ్లాక ఒక షాప్ మూసేసి ఇంటికి వెళ్తున్న అతన్ని ఇరకం దీవికి ఎలా వెళ్లాలి అని అడిగాను. వివరాలన్నీ చెప్పి, తెల్లవారుజామున చెయ్యండి నేను అన్నీ అరేంజ్ చేస్తా అని తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. తన పేరు మణికంఠన్. వయసు నలభై అయిదు ఉంటాయి. స్థానిక జెడ్పీటీసి మెంబర్ అంట. వైసీపీ పార్టీ.
”ఈ మధ్య అభివద్ధి కోసం అందరూ అధికార పార్టీలోకి పోతున్నారు కదా. నువ్వు పోలేదా?” అంటే, ”వాళ్లేమో రమ్మంటున్నారు కానీ నేనే పోలేదు” అన్నాడు తమిళం కలిసిన తెలుగు మాటల్లో. సరే అన్నా ఉదయాన్నే చేస్తామని బయల్దేరాం.
ప్రయాణం నీ జిజ్ఞాస అయితే పరిస్థితులు నీకు ఎంత అనుకూలంగా ఉంటాయనేదానికి మరో ప్రత్యక్ష అనుభవం.
పులికాట్ బ్యాక్ వాటర్స్ దగ్గరకు వెళ్లి, రాత్రి ఇక్కడే ఉండాలి కదా అని టెంట్ వెయ్యడానికి అనువైన ప్రదేశం కోసం చూస్తుంటే యాభైకి అటు ఇటు ఉండే ఒక వ్యక్తి వచ్చాడు. పేరు కుప్పన్. ఎక్కడికి వెళ్లాలి అని అడిగాడు. ఇరకం దీవికి అంటే ”మూడు వేలు ఇవ్వండి. తీసుకెళ్తా” అన్నాడు. డబ్బు కొంచెం ఎక్కువే అనిపించింది గానీ రాత్రంతా మీతోనే ఉంటాను. మాకు కూడా బోట్ డీజిల్ ఖర్చలుంటాయి కదా అనడంతో సరేన్నాను.
అయితే కేవలం ఇరకం దీవికి మాత్రమే కాకుండా చేపల వేట కోసం ఆంధ్ర – తమిళనాడు బార్డర్ దగ్గరికి తీసుకెళ్లాలి అని అడిగాను. వెయ్యి ఎక్స్‌ట్రా అన్నాడు. సరే పా ఏం లెక్కలేన్నా కొడుకులమా అన్నాను. మీరు ఇక్కడే ఉండండి డీజిల్ తీసుకుని వస్తా అని వెళ్లాడు.
”ఎందుకైనా మంచిది ఇంగో అయిదారు లీటర్లు ఎక్కువ తీసుకురా అన్నాను” కుప్పన్‌తో. బంగాళాఖాతం దగ్గర నీళ్లొచ్చే వెంట్ దగ్గరికి వెళ్లి రావాలనేది నా ఆలోచన. ముందే చెప్తే ఊహూ అంటాడని చెప్పలేదు.
కుప్పన్ తిరిగొచ్చేలోపు మా డిన్నర్ ముగించి సామన్లు బోట్ దగ్గరికి చేర్చాం. తాడు ఇంజిన్‌కు చుట్టి బలంగా లాగేడు కుప్పన్. డ డ్డ డ్డ డ్డా అంటూ స్టార్ట్ అయింది బోట్.
నీళ్లు వెనక్కి తోసుకుంటూ ముందుకు కదిలింది. అప్పటికి టైం పన్నెండున్నర అయింది.
చంద్రుడు పౌర్ణమికి మెల్లగా దగ్గరవుతున్నాడు. దూరంగా లైట్లు మిణుకుమిణుకుమంటున్నాయి.
పొద్దున్నుంచి డ్రైవింగ్ చేసి అలసిపోవడంతో బోట్‌లో చల్లగానికి వెంటనే నిద్ర పట్టింది. అరంబాక్కం నుంచి ఇరకం దీవికి చేరేడానికి నలభై అయిదు నిమిషాలు పట్టింది. సామాన్లు కిందికి దించి, ఇసుక దిబ్బ మంద పడక ఏర్పాట్లు చేశాం.
వెన్నెల్లో ఇసుక తీరం భలే అందంగా ఉంటుంది.
ఇంతకుముందు పౌర్ణమి రోజున బంగాళాఖాతంలో పెన్నా సంగమాన్ని చూద్దామని ఊటుకూరు దగ్గర పల్లెపాళెం బీచ్‌కు పోతే రాత్రి వాన పడి, దోమలు వయొలిన్ వాయించిన అనుభవం ఒకపక్క భయపెడుతూనే ఉంది.
ఆ భయాన్ని తరుముతూ రాత్రంతా చల్లగాలి జోలపాటలు పాడింది. ఆగి ఆగి కొట్టుకుంటున్న అలలు సంగీతమాలపించాయి.
తెల్లవారుజామున అయిదున్నరకల్లా మెలకువ వచ్చింది. తూర్పు ఆకాశంలో ఎరుపెక్కడానికి సిద్ధంగా ఉంది. ఇరకం దీవిలో కాకులెక్కువ. ఒకటేమాయిన మొత్తుకుంటున్నాయి.
కనుచూపుమేర నీళ్లు, అక్కడక్కడా మడ అడవులతో అద్భుతమైన సూర్యోదయం అది.
కుప్పన్‌ను నిద్రలేపి బంగాళాఖాతం ప్లాన్ చెప్పాను. చాలా దూరం అది అని నసిగాడు. డబ్బులెక్కువ ఇస్తాంరా అంటూ బలవంతపెడితే ఒప్పుకున్నాడు.
ఏప్రిల్, మే, జూన్ నెలలు చేపలు గుడ్లు పెట్టే సీజన్ కావడంతో మత్స్యకారుల పడవలన్నీ తీరంలో లంగరేసి ఉన్నాయి. అయినా ఆశ చావని కొన్ని పడవలు బతుకు వేటలో తలో దిక్కుకు సాగిపోతున్నాయి.
6.35 కు మా ప్రయాణం మొదలైంది. ఎడమవైపు ఆంధ్ర, కుడివైపు తమిళనాడు.
సూర్యోదయం అయిన అర్థగంట తర్వాత ఏటవాలు కిరణాలు పడటం వల్ల అలలపై బంగారు తీగ ఒకటి తేలియాడుతున్నట్టుగా ఉంది.
తుంపర్లు ఎగిరి పడుతున్నాయి. ఆలోచనలు ప్రవాహంలా సాగిపోతున్నాయి. పులికాట్ సరస్సు మరీ లోతైనది కాదు. అక్కడక్కడా ఆరేడు అడుగులు ఉంది అంతే.
ఫ్లెమింగోలు, బారు కొంగలు, బుడకోళ్లు, సీగుల్స్ లాంటి పక్షులు చేపల వేట ప్రారంభించాయి.
ఒక కిలోమీటర్ మేర ఫ్లెమింగో పక్షులు గుంపులు, గుంపులుగా బారుగా నిలబడి ఉండే దశ్యం ప్రత్యక్షంగా చూడాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేం. డ్రోన్ ఉండుంటే ఎగరేసినా బాగుండు అనిపించింది.
ఆంధ్ర, తమిళనాడు బార్డర్‌కు గుర్తుగా తాడిచెట్లు ఉన్నాయి. తమిళనాడు జలాల్లోకి పడవలు ఎక్కువగా తిరుగుతున్నాయి. కొందరు వలలు వేస్తున్నారు. కొందరు తీస్తున్నారు. మరికొందరు వేటకు సన్నద్ధమవుతున్నారు.
గంట తర్వాత చూసిన దశ్యాలే చూస్తుండటం వల్లనేమో ప్రయాణంలో ఎగ్జైట్మెంట్ పొయి మా వాళ్లు స్తబ్ధుగా కూర్చున్నారు.
‘ఇంక చాలులే అంటే బోట్ వెనక్కి తిప్పుదాం అని’ కుప్పన్ అప్పుడప్పుడూ నా వైపు ఆశగా చూస్తున్నాడు. నేనేమీ పట్టించుకోనట్టు నటిస్తూ ఎంతదూరం వచ్చింది, ఇంకెంతుంది అని మ్యాప్ లో చూస్తున్నాను.
అలా మ్యాప్‌లో వెతుకుతుంటే కరిణమల్ అనే ప్రదేశం కనిపించింది. అది చూడగానే నెల్లూరు సుపర్ణ అక్క ఇచ్చిన ‘మేరల కావల’ పుస్తకంలోని ‘కరిమణల్ లో అడవి పందుల వేట’ గుర్తుకొచ్చింది. స.వెం. రమేష్ గారి ‘ప్రళయ కావేరి’ చదవకుండా పోయినందుకు బాధగా అనిపించింది. అది కూడా చదివి ఉంటే ఎన్ని సంఘటనలకు, కథలకు దశ్యరూపం దొరికిండేది కదా అనిపించింది.
పలవేర్కాడ్ దగ్గరవుతుండగా పడవలతో పాటు ఆర్నిథాలజిస్ట్‌లు, వైల్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు.
ముందురోజు సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నిరాశగా వస్తున్నారు.
లాగూన్ జలాలు, మడ అడవుల మధ్యన నాలుగు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత పలవేర్కాడ్ బీచ్ పాయింట్ గా చెప్పుకునే పులికాట్ వెంట్ దగ్గరికి చేరాం. నలుగురైదుమంది ఎర్రలు తెచ్చి గేలాలతో చేపలు పడుతున్నారు.
అప్పటికి పదిన్నర అయింది. సుబ్బారెడ్డి అన్నం వండాడు. చేపలు దొరికితే వాటిని వండుకుని తిందామని అడిగితే కేజీ ఎనిమిదొందలు చెప్పారు. చాలా ఎక్కువనిపించి కొనలేదు.
ఎర్రగడ్డలు, టమోటా, పచ్చిమిరక్కాయ నలిచి పచ్చికారెం చేశాడు సుబ్బారెడ్డి. ఉసిరికాయ ఊరగాయ. ఆకలి రుచెరగదు అని అద్భుతంగా అనిపించింది ఆ పచ్చికారెం అన్నం కూడా.
పదకొండుకు తిరుగు ప్రయాణం స్టార్ట్ అయింది.
పైన ఎండ, కింద ఉప్పు నీటి ఆవిరి. ఎక్కడోళ్లక్కడ పడిపొయ్యారు. నా శరీరమూ నిద్ర కోరుకుంటోంది గానీ పడుకోకూడదని మొండిగా అలాగే కూర్చున్నా.
ఈరోజు ఇంత టెక్నాలజీ, ఇన్ని వనరుల మధ్యన రెండు మూడు గంటల ప్రయాణానికే మనం ఇంతలా డస్సయిపోతుంటే వందలేళ్ల కిందట దిక్సూచి పట్టుకుని ప్రాణాలతో ఉంటామో, ఏ గమ్యం చేరతామో తెలియని వాస్కోడిగామా, మార్కోపోలో నేతత్వంలోని నావికులు కొన్ని వేల నాటికల్ మైళ్ల ప్రయాణం ఎలా చేసి ఉంటారు? వాళ్ల మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది అనిపించింది.
నిజానికి నాకు ముందే తెలుసు మా వాళ్లు అలసిపోతారని. అయినా మెండిగా ఉండటానికి కారణం చరిత్రలోని కొన్ని సంఘటనలకు దశ్యరూపం ఇవ్వడమే.
వాస్కోడిగామా కాలికట్ చేరిన తర్వాత పోర్చుగీస్ వారు అరేబియా తీరాన్ని కేంద్రంగా చేసుకుంటే డచ్చి వాళ్లు తూర్పు తీరం అంటే ఎన్నోర్‌ని కేంద్రంగా చేసుకున్నారు. అక్కడ డచ్చివారి కోట కూడా ఉండాలి. డచ్చి వారికి, బ్రిటీష్ వారికి పదకొండు రోజుల పాటు యుద్ధం కూడా జరిగింది. యుద్ధంలో ఓటమి తర్వాత డచ్చివారు భారతదేశాన్ని వదిలి వెళ్లారు.
పలవేర్కాడ్ లో డచ్చి వారి చర్చి ఒకటి దూరంగా కనిపిస్తూ ఉంది. వెళ్లడానికి సమయం లేదు.
సరస్సు మధ్యలోకి వచ్చిన తర్వాత బట్టలు వదిలేసి నీళ్లల్లోకి దూకాను. నన్ను చూసి సుబ్బారెడ్డి, శ్రీనాథ్, సాయి కూడా దాకారు. నీళ్లు మెడ వరకే ఉన్నాయి గానీ ఈతాడాలంటే బరువు.
ఇరకం దీవికి చేరేసరికి రెండున్నర అయింది. ఊరు చూడటానికి వెళాం. ఇరకం దీవిలో రెండు పంచాయితీలు ఉన్నాయి. ఒకటి ఇరకం. మేజర్ విలేజ్. రెండు కుప్పం.
కుప్పం మొత్తం మత్స్యకారులు, ఇరకం పూర్తిగా వ్యవసాయం. వరి బాగా పండిస్తారంట.
ఇరకం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటికీ సాంస్కతికంగా తమిళం. తెలుగు ఎవ్వరికీ రాదు. చదువు కూడా తమిళమే. పాతోళ్లకు ఒకరిద్దరికి మాత్రమే తెలుగు అర్థమవుతుంది.
యూత్ కబడ్డీ ఆటలో ఎక్స్పర్ట్స్. మంచి శిక్షణ, గైడెన్స్ ఉంటే ఆ ఊరి నుంచి ఖచ్చితంగా నేషనల్స్‌లో సత్తా చాటుతారు.
ఊర్లో నెల్లూరమ్మ ప్రధాన అమ్మవారు. పక్కనే పెరమాల్ గుడి ఉంది. ఇరకం వెళ్లాలంటే అర్థగంట పడుతుంది అన్నారు. వెళ్లే ఓపిక లేదు. ఆకలి లోపల ఒకటేమాయిన దరువేస్తుంటే ఇంగొకరోజు వద్దామని పడవలో అరంబాక్కం చేరుకున్నాం. ఇంటికి చేరేసరికి ఏడున్నర అయింది.
ఇన్నాళ్లు పులికాట్ సరస్సులో జాలర్లది తెలుగు, తమిళ ఆధిపత్య సమస్య అనుకున్నాను గానీ కాదు. అది నిత్య జీవన పోరాటం. తెలుగు నేలపై చేపలు దొరక్క తమిళ నీళ్లల్లోకి వల విసిరితే మా నీళ్లల్లో ఎందుకు వల విసురుతున్నావని వాళ్లు ప్రతిఘటించగడం వల్ల వచ్చే గొడవలు అవి.
ఎన్ని పుస్తకాలు చదివినా, వీడీయోలు, ఫొటోలు చూసినా ఒక్క ప్రత్యక్ష వీక్షణకు సరికావు అని తెలిసేలా మరో ప్రత్యక్ష అనుభవం.
వివేక్ లంకమల
9581939039
ప్రళయ కావేరి ఒడిలో
- Advertisement -
- Advertisement -