ఈ కాలానికి పనికిరాని సాహిత్యం ఏ కాలానికి పనికిరాదు అంటారు జర్మన్ నాటక కర్త, తత్వవేత్త బెర్టోల్ట్ బ్రెక్ట్ అంటే సాహిత్యం కాలంతో మాట్లాడాలి ఆ కాలపు తాడిత పీడిత వ్యక్తుల పక్షాన నిలబడాలి, వారి పోరాటాలను, ఆశలను ప్రతిబింబించాలి అది చేయలేని సాహిత్యం వృధా అని భావన.సమకాలిన సాహిత్యం రాయడం బాధితుల గొంతుకై నిలబడడం నమ్మిన సిద్ధాంతాన్ని నిర్భయంగా ప్రకటించడం తదనుగుణంగా రచనలు చేయడం ,సంకలనాలు వెలువర్చడంలో స్కైబాబాది అందెవేసిన చెయ్యి .ఇందులో భాగంగా వెలువడినదే మిల్ ఝులే – ముస్లిం సంఘీభావ కవిత్వం ముస్లిమేతరులు ముస్లింల పట్ల ఉన్న ప్రేమైక భావనను, సంఘీభావాన్ని కవితల ద్వారా హృద్యంగా వెలువరించిన తీరు ప్రస్తుత విద్వేషపు బజారులో ఇలాంటి రచనల ఆవశ్యకతను చాటి చెబుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
స్కైబాబా తన సంపాదకీయంలో పేర్కొన్నట్టుగా ఈ సంకలనం అనేది ముస్లింవాద సాహిత్యకారులకే కాక మొత్తం ముస్లిం సమాజానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ధైర్య కవితను అందిస్తూ తద్వారా మిగతా బాధిత సమూహాలకు ఒక దిశా నిర్దేశం చేస్తున్నది అంటారు స్కై తన సంపాదకీయంలో. ఇక దీనికి ముందుమాట రాసిన జి.లక్ష్మీనరసయ్య ,సుంకిరెడ్డి నారాయణరెడ్డిలు తమదైన శైలిలో ఈ పుస్తక ప్రాధాన్యతను ఇందులోని పలు కవితలను స్పృశిస్తూ రాసిన తీరు ఈ కవితలను చదివి తీరాలన్న కాంక్షను ప్రేరేపిస్తాయి. అలాయి – బలాయి సంస్కృతిని మరిచి రాజకీయ క్రీనీడలో బలవుతున్న బహుజనులను ఏకతాటిపై తెచ్చే బృహత్తర ప్రయత్నమిది.భావోద్వేగాలను రెచ్చగొట్టి విభజించు- పాలించు సూత్రాన్ని పకడ్బందీగా అమలు చేసి పబ్బం గడుపుకోవాలనుకునే వారిపై పాశుపతాస్త్రం ఈ మిల్ ఝులే.
నా ప్రతి పండుగకు వాళ్లు శుభాకాంక్షలు చెబుతారు /నేనెందుకో మరిచిపోతాను/ నా ఇల్లు ఎక్కడో కనుక్కొని వాళ్ళు ఖీర్ పంపుతారు/నేను నెత్తురు పంపుతాను/నేను మహా సెక్యులర్ను అంటూ సెక్యులర్ వాదుల ద్వందనీతిని బయటపెట్టారు సీతారాం . బైండ్లోల్లం కదా…/ బడికుండ ముడితే మైలపడతదని /మాకు నీళ్లు పోయలే /ఆ పక్కనే మీ ఇల్లు /చెంబులో నీళ్లిచ్చి మూతి పెట్టి తాగురా /అని దూప తీర్చిన భగీరథుడువి నువ్వు/ అంటూ జిలుకర శ్రీనివాస్ రాసిన కవితా పంక్తులు కులాలుగా చీలిపోతున్న సమాజానికి ఏకత్వ సూత్రం బోధించిన ఇస్లాం గొప్పతనాన్ని చాటి చెబుతాయి.అత్త మామ దీదీ బీబీ/అక్కా బావా భాయి బహన్/వరసలు వరసలుగా../ పూసల పేరులుగా… అంటూ హిందూ ముస్లిం అనే భావన లేకుండా వరుసలు పెట్టి పిలుచుకునే తీరు ఎంతో ఆత్మీయతను పంచుతుంది అంటారు సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన ”అలావా గుండం”ల.
ఎందుకంటే అతను ముస్లిం…/ నిజమైన ముస్లిం../ మీలా.. నాలా.. ఈ దేశ పటాన్ని కాక దేశ పౌరులను ప్రేమించేవాడు అంటూ ఇస్లామియా అంతః సూత్రాన్ని తేలిగ్గా వివరించారు నరేష్ కుమార్ సూఫీ ,వందేమాతరం, భారత్ మాతాకీ జై అనడంలో..మాత, వందనాలు తెలుపడం అనేవి దేవతారాధన కిందికి వస్తాయని ఆ మాటకొస్తే దేశాన్ని ప్రేమించడం ,దేశభక్తిని కలిగి ఉండటం అంటే ఇక్కడి పౌరులను ప్రేమించడం ,రాజ్యాంగాన్ని గౌరవించడం అని ఎంత చెప్పినా ..చెవులున్నా వినని అభినయ బధిరులకు చెంపపెట్టు ఈ కవిత .ఎన్ని మానవ సమూహాల సారాన్ని పీల్చిందో/ తెగ బలిసిపోయింది/ నిటారుగా కొమ్మలని విస్తరించి /నింగిని సవాలు జేస్తున్నది/ రాకాసి ఊడలు దించి /భూమి సారాన్ని పీల్చేస్తున్నది అంటూ అతివాద మత విషవక్షపు కొమ్మల్ని నరికి వేళ్ళని పెకిలించే కవిత వాక్యాలు ఉదయం మిత్ర కలం నుండి రాజేసిన నిప్పురవ్వలు.
శతాబ్దాల సమరాల నుంచి కూడదీసుకున్న సహనం మాది/ మా నేల కోసం తెగించి ప్రాణాల ఖుర్బానీ ప్రకటించే సాహసం మాది అంటూ దేశం కోసం త్యాగాలు చేయడానికి వెనుకాడని ముస్లింల నిజమైన దేశభక్తిని దండోరా వేసిన కవిత వఝల శివకుమార్ కుర్బానీయత్. వాడి నరాలలో రక్తమున్నా/రంగులో ఏదో తేడా ఉంది /అందుకే వాడు వేరే తమ్ముడు సాయబు!/ నువ్వు ఒంటరివేం కాదు ఏ మత్ భూల్/ చెమ్డేకు చప్పల్ బనానే వాలా /ఔర్ ఏక్ తేరే సాత్/కదమ్ మిలానే తయార్ హై అంటూ భరోసా భుజాన్నిచ్చిన కొమ్ము సుధాకర్ ఈ పుస్తక సారాన్నంతా ఒక్క కవితలో వివరించారు. ఎప్పటిదీ భూమీ.. ఎప్పటివీ పునాదులు/తవ్వడానికి తిప్పడానికి /మనకున్న రెక్కల బలం చాలదు భారు/ రా ఒక అంచు మీద నిల్చుని కావలించుకుందాం /కొత్త అక్షాంశాలు ,రేఖాంశాల మీద /నెత్తుటి మరకలేని కొత్త చరిత్ర రాద్దాం అంటూ ఆహ్వానం పంపారు అనిల్ డాని స్వీకరించే దమ్ములు ఎవడికి ఉన్నాయో చూద్దాం.
ఒక్కొక్కరిగా మరణించడం కంటే /సమూహాలమై జీవించటమే/ మానవ మతానికి ఉన్న ఏకైక లక్ష్యం.. విడగొట్టి పడగొట్టాలనుకునే వారికి మనమే దారి ఇస్తున్నామని పక్కోడ్ని, బక్కోడ్ని మతం మదమెక్కిన మదపుటేనుగు లాంటివాడు దాడి చేస్తుంటే చూస్తూ కూర్చుంటే పాదాల కింద నలిపేస్తాడు తర్వాతి లక్ష్యం నువ్వే.. గడ్డి పరకలు కూడా గజాన్ని బంధిస్తాయనే వాస్తవాన్ని గుర్తు చేశారు ఈతకోట సుబ్బారావు. నాగవర్ధన్ రాయల్ తన కవితలో మీ చెల్లెను, మా అక్కను ఆకతాయిలు అడ్డగించినప్పుడు/ తన బిడ్డనుకొని ఎదిరించిన సోడాల సాయిబు/ ఏ మతం వాడు ఐతేనేం తనలాగే నిలబడి.. కలబడుదాం వస్తావు కదూ అని ఆశాభావం వ్యక్తం చేశారు.నిలువెత్తు ఆధార్ కార్డునై/ నా దేశంలో నేను/ నిత్యం దేశభక్తి బోనెక్కి/ నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటూనే ఉన్నా అంటూ అడుగడుగునా దేశభక్తి సర్టిఫికెట్ జారీ చేసే కుహనా దేశభక్తులకు చెంపపెట్టు డివివి సత్యనారాయణ ఋషి విరచిత ఆధార్ కార్డు కవిత .
అయినా… మురికి కాలువలెంబడి..పరుగులు తీస్తున్న/ దేశాన్ని వదిలేసి/ నా పౌరసత్వం మీద పడ్డరేంది.ప్రజా సమస్యలను గాలికొదిలేసి పరిష్కారాలను ప్రజలకొదిలేసి, భావోద్వేగాల మాటున డైవర్ట్ పాలిట్రిక్స్ చేస్తున్న నాయకులకు దిశా నిర్దేశం తగుళ్ళ గోపాల్ కవిత. నీకెందుకురా తురుకోళ్లంటే పాకిస్తానే గుర్తొస్తది అంటూ సూటిగా ప్రశ్నించారు భూపతి వెంకటేశ్వర్లు. కడాఖరుకు ప్రజలు లేని/ దేశాలు మిగిలాక/ కళేబరాల లెక్కల కోసం ఏ గ్రహాంతర వాసులొస్తారో అంటూ కంటతడి పెట్టించారు ప్రసాదమూర్తి. గీ ఇచ్చిత్రాలు ఇడదీయటాలు ఎందుకు సారు!/ మా మానాన మమ్మల్ని/ మడుసుల్లెక్క బతకనీయరాదే!? అంటూ అమాయకంగా ప్రశ్నిస్తారు ఫణి మాధవి కన్నోజు. కూటి కోసం కోటి తిప్పలు పడేటోనీకి కల్లబొల్లి కబుర్లు చెప్పి మతాల మధ్య లొల్లి పెట్టేటోళ్ళకు గొంతులో వెలక్కాయ ఈ ప్రశ్న .నిర్విరామంగా పనిచేయటం/ అకారణంగా మనుషులను ప్రేమించడం/ ఉన్నదేదో నలుగురికి పంచడమే జీవితం అనుకొని వాళ్ళు వర్తమానంలోనే జీవిస్తారు అంటూ బహుజన ముస్లింల జీవితాల్ని కాచి వడపోశారు పలమనేరు బాలాజీ .
ఇఫ్తారురా .. ఇఫ్తారురా.. అంటూ నలిగంటి శరత్ రాసిన పాట, ఇప్పటికీ ప్రతి రంజాన్ మాసంలో ఎక్కడో చోట ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. మన రేపటి బతుకును భవిష్యత్తుకు/ కంచెల నిలబడే రక్షణ దుర్గం/ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం… లే!! అంటూ ఈ పుస్తకానికి సరైన ముక్తాయిచ్చారు డాక్టర్ పసునూరి రవీందర్. ఇందులోని ఒక్కో కవిత ఓ ఆత్మీయ కానుక, ప్రతీ కవితను స్పృశించడం అంటే అది సాహసోపేతమే, స్థలాభావాన్ని, వస్తు వైవిధ్యతను దృష్టిలో పెట్టుకొని అక్కడక్కడా మచ్చుకు కొన్నిటిని ప్రస్తావిస్తూ రాసిన నా అభిప్రాయాలివి.ఏది ఏమైనా మైనార్టీ సమూహాలు అభద్రతాభావంలో ఉన్నప్పుడు మీకు నేనున్నానని ఎవరన్నా భుజం తడితే అది వారికి కొండంత బలాన్నిస్తుంది .ఇంతమంది ముస్లిమేతర కవులు ధైర్యంగా, ఆత్మీయంగా తెలిపిన సంఘీభావం ఆషామాషి కాదు ఖచ్చితంగా ఇది ”విద్వేషపు బజారులో వారిచ్చిన ప్రేమైక మెహ్ రూమా”
- యాసిన్



