Sunday, December 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅభివృద్ధి పేరుతో అసమానతలు పెంచుతున్నారు

అభివృద్ధి పేరుతో అసమానతలు పెంచుతున్నారు

- Advertisement -

యూపీలో 3 కోట్ల ఓట్ల తొలగింపునకు కుట్ర
అది ఎస్‌ఐఆర్‌ కాదు..ఎన్‌ఆర్సీ
కేంద్రంపై యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌ ఫైర్‌
ఇండియా కూటమిలోనే కొనసాగుతామని స్పష్టీకరణ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో దేశంలో ప్రజల మధ్య ఆర్థిక, సామాజిక అసమానతలను పెంచుతున్నదని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌
విమర్శించారు. శనివారంనాడిక్కడి తాజ్‌ కృష్ణ హోటల్‌లో విజన్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలు అందరికీ సమాన లబ్ది చేకూరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్లేషించారు. కానీ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో సంపద కొందరికే పరిమితమవుతున్నదనీ, పదుల సంఖ్యలో అపర కుబేరులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు సంపదను అన్ని వర్గాలకూ సమానంగా పంచాలనీ, కేంద్రం ఆ పని చేయట్లేదన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి, సమగ్ర అభివృద్ధిని సాధించి, అన్ని వర్గాల ప్రజలు ఎదిగేలా సంపదను పంపిణీ చేయడమే సమాజ్‌వాదీ పార్టీ విధాన లక్ష్యమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పనిచేస్తామన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)పై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 25 కోట్ల జనాభా ఉందని అక్కడి బీజేపీ ప్రభుత్వం చెబుతుననదనీ, ఎస్‌ఐఆర్‌ ద్వారా సుమారు 3 కోట్ల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో గెలవడానికే బీజేపీ ఎస్‌ఐఆర్‌ చేపడుతోందని ఆరోపించారు. ఇది ఎస్‌ఐఆర్‌ కాదని, ఇది జాతీయ పౌరుల నమోదు (ఎన్‌ఆర్సీ) ప్రక్రియ అని విమర్శించారు. ఎన్‌ఆర్సీని నేరుగా చేపట్టలేక ప్రభుత్వం ఎస్‌ఐఆర్‌ను వాడుకుంటున్నదనీ, ఎన్‌ఆర్సీకి ఎన్ని పత్రాలు అడుగుతారో ఎస్‌ఐఆర్‌కి కూడా అవే పత్రాలు అడుగుతున్నారని చెప్పారు. బూత్‌ స్థాయి అధికారులకు కూడా శిక్షణ ఇవ్వలేదని, దీంతో క్షేత్ర స్థాయిలో అనేక సవాళ్లు, సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఓటుహక్కు కల్పించడం ఎన్నికల సంఘం బాధ్యత అనీ, ఓట్లను తొలగించడం వారిపని కాదని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఇండియా కూటమిలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపు ద్వారా భవిష్యత్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికే ఎస్‌ఐఆర్‌ చేపట్టారని విమర్శించారు.

ఉత్తరప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కృత్రిమ మేథ గురించి మాట్లాడుతూ రైతులు, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణీకరణ, పట్టణాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం, ఆరోగ్యం తదితర రంగాల్లో ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. యూపీలో సైబర్‌ నేరాలు అధికంగా జరుగుతున్నాయనీ, వాటిని ఏఐ టెక్నాలజీ ద్వారా కట్టడి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉందన్నారు. బీఆర్‌ఎస్‌తో తనకు పాత స్నేహం ఉన్నదనీ, అందుకే ఆపార్టీ నేతల్ని కలిశానని చెప్పారు. బీహార్‌లో ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా జరగలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అఖిలేశ్‌తో బీసీ సంఘాల భేటీ
దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలనీ బీసీ సంఘాల జేఏసీ చైర్మెన్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ను కోరారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ చేసిన చట్టాన్ని ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమోదించేలా సమాజ్‌వాదీపార్టీ తరఫున పోరాడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పర్యటనలో ఉన్న అఖిలేశ్‌యాదవ్‌ను శనివారంనాడిక్కడి తాజ్‌ కృష్ణ హోటల్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -