Friday, January 2, 2026
E-PAPER
Homeజాతీయంవిశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ పేరిట…భారీగా భూ పందేరం

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ పేరిట…భారీగా భూ పందేరం

- Advertisement -

ఐటి పేరిట మూడు మండలాల్లో 1,100 ఎకరాలు
కొత్తవలసలో జిఎంఆర్‌కు 600 ఎకరాలు
బొమ్మల తయారీ ఫ్యాక్టరీ పేరిట 195 ఎకరాలు

విజయనగరం : విశాఖపట్నం ఎకనమిక్‌ రీజియన్‌ పేరిట విజయనగరం జిల్లాలో కార్పొరేట్‌ సంస్థలకు మరోసారి భారీగా భూములు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐటి అభివృద్ధి పేరిట నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో 1,100 ఎకరాలు, మల్టీ ప్రొడక్ట్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్ల ఏర్పాటు పేరిట కొత్తవలస మండలంలో 547.50 ఎకరాలు, బొమ్మల తయారీ ఫ్యాక్టరీ పేరిట పూసపాటిరేగ మండలంలో 195.13 ఎకరాలు కేటాయించింది. వీటితోపాటు పతంజలి సంస్థలకు 2,017లో కేటాయించిన 172.84 ఎకరాల్లో ఫుడ్‌ పార్కు, ఎస్‌.కోట మండలంలో 20 ఏళ్ల క్రితం కేటాయించిన 1,166 ఎకరాల భూముల్లో ప్రైవేటు ఎంఎస్‌ఎంఇ పార్కు ఏర్పాటు కానున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. విజయనగరం జిల్లా పరిధిలో ఐదు చోట్ల పరిశ్రమలు రానున్నట్లు ప్రచారం చేస్తోంది.

ఇందులో రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం భూమి కేటాయించింది. మరో మూడు ప్రాజెక్టుల పేరిట కొత్తవలస, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లో భారీగా భూములు గుర్తించి, ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టే పనిలో ఉంది. మల్టీ ప్రొడక్ట్స్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ పార్కు పేరిట కొత్తవలస మండలం బలిఘట్టం, నిమ్మలపాడు, తుమ్మికాపల్లి, కంటకాపల్లి, అర్థన్నపాలెం గ్రామాల పరిధిలో 547 ఎకరాలు, అప్రోచ్‌ రోడ్డు కోసం మరో 0.50 ఎకరాలు చొప్పున కేటాయించింది. రూ.2 వేల కోట్ల పెట్టుబడితో మల్టీ ప్రొడెక్ట్స్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు జిఎంఆర్‌ గ్రూప్‌ సంస్థకు చెందిన ఇన్‌ఫ్రాకు కట్టబెట్టేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఇదే మండలం పెదరావుపల్లి రెవెన్యూ పరిధిలో పతంజలి ఫుడ్‌ పార్కు కోసం 2017లో అప్పటి ప్రభుత్వం 172.84 ఎకరాలు కేటాయించింది. ఇందులో రూ.200 కోట్లు పెట్టుబడితో బహుళ ఉత్పత్తి ఆహార ప్రాసెసింగ్‌ పార్క్‌ ఏర్పాటు కానున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. బొమ్మల తయారీ పార్కు కోసం పూసపాటిరేగ మండలం జి.చోడవరం, కనిమెట్ట రెవెన్యూ పరిధిలోని 195.13 ఎకరాలు కేటాయించింది.

ఎస్‌.కోట మండలంలో జిందాల్‌ అల్యూమినా శుద్ధి కర్మాగారం కోసం 1,166.43 ఎకరాలను సుమారు 20 ఏళ్ల క్రితం కేటాయించినా ఫ్యాక్టరీ ఏర్పాటు కాలేదు. అయినా, ఆ సంస్థకు భూమి మొత్తాన్ని కట్టబెడుతూ ఇటీవల మంత్రివర్గం నిర్ణయించింది. జిందాల్‌కు అప్పగించిన భూమిలో ఆ సంస్థ ఆధ్వర్యాన ప్రైవేట్‌ బహుళ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు కానుందని విశాఖపట్నం ఎకనమిక్‌ రీజియన్‌ ప్రాజెక్టు రిపోర్టులో ప్రభుత్వం పేర్కొంది. ఐటి అభివృద్ధి పేరిట నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లోని 21 గ్రామాల పరిధిలో 1100.84 ఎకరాల భూమిని గుర్తించింది. భోగాపురం, డెంకాడ మండలాల పరిధిలో రెండేసి క్లస్టర్లు, పూసపాటిరేగలో ఒక క్లస్టర్‌ చొప్పున మొత్తం ఐదు క్లస్టర్లుగా విభజించారు. ఇందులో ప్రభుత్వ భూమితోపాటు విలువైన పంట భూములు, మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన భూములు ఉన్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా టూరిజం అభివృద్ధి పేరిట భోగాపురంలో ఎరోసిటీకి 500 ఎకరాలను కేటాయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -