– వితంతు పెన్షన్లతో గీత, నేత కార్మికుల కుటుంబాలకు తీవ్ర అన్యాయం
– కొత్తవి రావు.. పాతవి పెరగవు…
నవతెలంగాణ తుంగతుర్తి:
ఆసరా పెన్షన్ల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు… కొత్తవి రావడం లేదు.. పాత పెన్షన్లు పెరగడం లేదు,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిన ఆసరా చేయూత ముందుకు పడట్లేదు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పింఛన్లు పెంచుతామని ప్రకటించి ప్రజాపాలన ద్వారా రెండు దఫాలుగా కొత్త దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు అర్హులను ఎంపిక చేయలేదు,పాత పింఛన్ల పెంపు,కొత్త పింఛన్ల మంజూరు, ఇప్పటివరకు జరగలేదు. దరఖాస్తుదారులు కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వివిధ కారణాలతో పలువురి పింఛన్లు రద్దు చేశారే, తప్ప కొత్త వాటికి మోక్షం లేదు.
అందరికీ వర్తించని బదలాయింపు
కుటుంబంలో వృద్ధాప్య పింఛన్దారులు ఒకరు చనిపోతే వారి కుటుంబంలో భార్యకు గానీ, భర్తకు గానీ పింఛన్ మంజూరు చేసే బదలాయింపు ప్రక్రియ మాత్రమే కొనసాగిస్తున్నారు. ఇది కూడా అందరికి వర్తింపచేయడం లేదు.పింఛన్ల కోసం మూడున్నర ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం 2022లో ఒకసారి మాత్రమే కొత్తవారికి పింఛన్లు మంజూరు చేసింది.ఇందులో చాలా మందికి పింఛన్లు రాలేదని ఎదురుచూశారు.
ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తరువాత దరఖాస్తుల స్వీకరణతో హడావిడి చేసినా పింఛన్లు మాత్రం అందడం లేదు. వృద్ధాప్య పింఛన్లు మాత్రం ఒకరు మరణిస్తే ఒకరికి అందిస్తున్నారు. ఇందులో కూడా కేవలం వృద్ధాప్య పింఛన్ మాత్రమే బదలాయింపు చేస్తున్నారు. దివ్వాంగులు,ఇతర చేనేత,గీత కార్మికులు చనిపోతే భార్యకు వితంతు పింఛన్ కింద ఇవ్వడం లేదు. భర్త చనిపోతే భర్త పెన్షన్ భార్యకు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై కొత్తగా వచ్చే భారం ఏం లేదని అయినా చేనేత గీత కార్మికుల కుటుంబాలకు ఈ వితంతు పెన్షన్ ఇవ్వడంలేదని, వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి పెన్షన్ వచ్చేలా చేయాలని వారు కోరుతున్నారు.
వితంతు పెన్షన్ రావడం లేదు
తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామం, భర్త రంగు నరసయ్య2023 ఏప్రిల్ లో మరణించారు. భర్తకు గీత కార్మికుల పెన్షన్ వచ్చేది, అతను చనిపోయి మూడు సంవత్సరాలు దాటిన నేటి వరకు ఆ మహిళకు వితంతు పెన్షన్ రావడం లేదు. ప్రభుత్వం, అధికారులు స్పందించి వితంతు పెన్షన్ ఇప్పించాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం శూన్యం. మా గ్రామంలో నా భర్త తర్వాత చనిపోయిన మహిళలకు వితంతు పెన్షన్ వస్తుంది, నాకే ఎందుకు రావడం లేదని వితంతు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న బాధితురాలు రంగు శ్రీలత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వితంతు పెన్షన్లలో గీత నేత కార్మికుల కుటుంబాలకు తీవ్ర నష్టం
– తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్
ఇంటి యజమాని చనిపోతే అతనికి వచ్చే పెన్షన్ భార్యకు బదలాయింపు చేయడంలో ప్రభుత్వానికి కొత్తగా వచ్చే భారం ఏం లేదని, అయినప్పటికీ గీత నేత కార్మికుల కుటుంబాలపై వివక్షత చూపుతుందని అన్నారు. 60

ఏండ్లు పైబడిన గీత నేత కార్మికులు చనిపోయినప్పటికీ వారి భార్యలకు వితంతు పెన్షన్లు ఇవ్వడం లేదని ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భర్తను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు పెన్షన్ వెంటనే అందజేయాలని, పెన్షన్ల పెంపుపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు అమలు చేయకుండా ఇలాగే కొనసాగితే పెన్షన్ల కోసం ఎదురుచూసే బాధితులతో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.



