Sunday, April 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధభీతిలో ఓ ఆశ సాకర్‌

యుద్ధభీతిలో ఓ ఆశ సాకర్‌

- Advertisement -

గాజాలో ఫుట్‌బాల్‌ పునరాగమనం
ఆటను, జీవితాన్నీ వదలం : క్రీడాకారులు

పశ్చిమాసియా యుద్ధంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఫుట్‌బాల్‌కు ప్రాణమిచ్చే గాజా క్రీడాకారులు వందల సంఖ్యలో ఇజ్రాయిల్‌ మారణహోమంలో తుదిశ్వాస విడిచారు. సాకర్‌ సంస్కృతితో ఎప్పుడూ సందడిగా కనిపించే గాజా వీధులు ఇజ్రాయిల్‌ దాడులతో శిథిల నగరంగా మారింది. కాల్పుల విరమణతో ఊపిరీపీల్చుకుంటున్న గాజా ప్రజలకు సాకర్‌ ఓ ఆశగా కనిపిస్తోంది. సుమారు రెండేండ్ల తర్వాత గాజాలో తొలి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఇప్పుడు సాకర్‌ గాజా ప్రజల జీవితాల్లో సరికొత్త ఆశ చిగురించేలా చేస్తోంది.

గాజా : గాజా నగరం. ఎటు చూసినా శిథిల భవనాలు, కూలిన గోడలు, రాతి గుట్టలు. గాజా ప్రధాన మైదానం ఇజ్రాయిల్‌ నిర్భంద కేంద్రంగా మారగా.. రూపురేఖలు మారిన గ్రౌండ్‌లో ఇప్పుడు ప్రజలు గూడారాల్లో ఆవాసం ఉంటున్నారు. కాల్పుల విరమణతో కాస్త ఉపశమనం లభించినా ప్రజల బతుకు పోరాటంలో మార్పు లేదు. దాహం తీర్చుకునేందుకు నీరు, ఆకలి తీరేందుకు ఆహారం కోసం ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఇజ్రాయిల్‌ మారణహోమం గాజా ప్రజల జీవితాలను అస్థవ్యస్థం చేయగా.. ఆ ప్రజలకు జీవితంపై ఓ ఆశ చిగురింపచేసేందుకు ‘సాకర్‌’ ముందుకొచ్చింది. సుమారు రెండేండ్ల తర్వాత గాజాలో ఓ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు.

శిథిల భవనాలు, కూలిన గోడల నడుమే ఓ మినీ సాకర్‌ గ్రౌండ్‌ను సిద్ధం చేసిన గాజా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో గోల్స్‌ మోత లేకపోయినా, గోల్‌ లేకుండా డ్రాగా ముగిసినా.. ప్రేక్షకులు ఏమీ నిరాశ చెందలేదు. సాధారణ జీవనం వైపుగా మళ్లీ అడుగులు పడేందుకు ఫుట్‌బాల్‌ నిలుస్తుందనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది. ‘ప్రజలు ఉదయం నీళ్ల కోసం వెతుకుతారు. ఆహారం కోసం అన్వేషిస్తారు. బతుకు కాస్త కష్టంగా మారింది. అయినా, సాకర్‌ మైదానంలో అడుగుపెట్టగానే మనలో మిగిలిన కాసింత ఆనందం బయటకొస్తుంది. యుద్ధభీతి నడుమ ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లోకి రావటం అయోమయం, బాధ కలిగిస్తున్నా.. సంతోషంగా ఉంది.

సహచర క్రీడాకారులు ఎంతో మంది లేకుండా గ్రౌండ్‌కు రావటం కష్టంగా ఉంది. కొందరు చంపబడ్డారు, కొందరు తీవ్ర గాయాలకు గురయ్యారు. మరికొందరు చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అందుకే, సాకర్‌ ఆడుతున్నా సంతోషం అసంపూర్తిగానే ఉంది’ అని ఓ క్రీడాకారుడు తెలిపాడు. ఇజ్రాయిల్‌ మారణహోమంతో ఎంత విధ్వంసం, వినాశం జరిగినా.. మేము ఫుట్‌బాల్‌ ఆడుతూనే ఉంటామని, జీవితం ముందుకు సాగాల్సిందేనని మరో క్రీడాకారుడు సహచరుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా గాజాలో పున నిర్మాణ పనుల జాడ లేదు. ఇజ్రాయిల్‌ సైన్యం గాజా స్ట్రిప్‌లో ప్రజలను అక్కడ్నుంచి ఖాళీ చేయించటంతో తీర ప్రాంతంలోనే 20 లక్షల మంది వరకు టెంట్లు, శిథిల భవనాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. గాజా ప్రజలు సాధారణ జీవనానికి సాకర్‌ ఓ ఓ ఆశ. సాకర్‌ టోర్నమెంట్‌ ఆ దిశగా తొలి అడుగు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -