మేడారంలో మొక్కులు చెల్లించిన ముఖ్యమంత్రి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెలతో పాటు ప్రాకారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఉదయం 6.57 గంటలకు మేడారం ప్రాకారానికి సీఎం మంత్రులు, తన కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. వారికి ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయ వాయిద్యాలతో పాటు గుస్సాడి నృత్యంతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క-సారలమ్మ గడి పూజారులు.. సీఎం, మంత్రులను గద్దెల వద్దకు ఆహ్వానించారు. తొలుత రూ.101 కోట్లతో నిర్మించిన మేడారం గద్దెలు, నూతన ప్రాకారం పునరుద్ధరణ పైలాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సీఎం, తన మనువడితోపాటు తన ఎత్తు (82 కిలోలు) బంగారాన్ని (బెల్లం) వీరవనితలకు మొక్కులుగా సమర్పించారు. సమ్మక్క గద్దెల వద్దకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులకు మంత్రి సీతక్క నుదుట తిలకందిద్దారు. అనంతరం సీఎం దంపతులు సమ్మక్కకు సారెను సమర్పించారు. ఈ సందర్భంగా సమ్మక్క పూజారులు సీఎం దంపతులు, కుటుంబ సభ్యులు, మంత్రులకు కంకణాలు కట్టారు.
అనంతరం సారలమ్మ గద్దె వద్దకు చేరుకొని సారెను సమర్పించి మొక్కులు సమర్పించారు. ఈ పూజా కార్యక్రమాలన్నీ ఉదయం 7.30 గంటలకు ముగిశాయి. అనంతరం 8గంటలకు హెలికాప్టర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండ్రోజుల పర్యటన ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఈ పూజా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, జి. వివేక్, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, పి. సుదర్శన్‌రెడ్డి, విప్ డాక్టర్ రామచందర్‌నాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య, శ్రీపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, నాయిని రాజేందర్‌రెడ్డి, మురళీనాయక్, తెల్లం వెంకట్రావు, కోరెం కనకయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
పూర్తికాని పూల అలంకరణలు
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం 6.30 గంటలకే గద్దెల వద్దకు చేరుకోవడంతో అధికారులు ఎంత హడావుడి చేసినా ప్రాకారం రాతి స్తంభాలకు పూల అలంకరణను సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఒకవైపు సీఎం, మంత్రులు వస్తుండగానే వెనుక వైపు రాతి స్తంభాలకు పూల దండలు కడుతున్న పరిస్థితి కనిపించింది.



