Friday, December 12, 2025
E-PAPER
Homeజాతీయంభారత్‌లోనే ఆదాయ అసమానతలు అధికం

భారత్‌లోనే ఆదాయ అసమానతలు అధికం

- Advertisement -

10శాతం మంది వద్ద 58శాతం ఆదాయం
50శాతం మంది వద్ద 15శాతం ఆదాయం
గత పదేండ్లలో మహిళా కార్మిక ప్రాతినిధ్యంలో కనిపించని మార్పు
ప్రపంచ అసమానతల నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ : భారతదేశంలో ఆదాయ అసమానతలు ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధికంగా వున్నాయి. కేవలం 10శాతం మంది మాత్రమే దేశ ఆదాయంలో 58శాతాన్ని సముపార్జిస్తున్నారు. అదే సమయంలో కిందనున్న 50శాతం మంది కేవలం 15శాతం ఆదాయాన్నే సంపాదించుకో గలుగుతున్నారు. ఆర్థికవేత్తలు లూకాస్‌ చాన్సెల్‌, రికార్డొ గోమెజ్‌-కారెరా, రొవాడియా మోషరీఫ్‌, థామస్‌ పికెటిలు రూపొందించిన, తాజాగా విడుదలైన ప్రపంచ అసమానతల నివేదిక 2026 ఈ విషయాలను తేటతెల్లం చేసింది.
సంపదలో అసమానతలు భారతదేశంలో మరింత ఎక్కువగా ఉన్నాయి. సంపన్నులైన కేవలం 10శాతం మందికి దేశంలోని మొత్తం సంపదలో 58 శాతంపై పట్టు ఉంది. ఒక శాతం మంది కుబేరుల వద్ద దాదాపు 40శాతం సంపద పోగుపడి ఉంది. వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌ బుధవారం ఈ నివేదికను విడుదల చేసింది. సంపన్నుల వద్దే సంపద పోగుపడుతూ ఉంటే నిరుపేదలు మరింతగా దారిద్య్రంలో కునారిల్లుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ పరిస్థితులను మార్చాలంటే ప్రభుత్వాలు విధానపరమైన మార్పులు తీసుకురావాలని పేర్కొంది. విద్య, సార్వజనీన ఆరోగ్య సంరక్షణ, నగదు బదిలీలు, పెన్షన్లు వంటి పున:పంపిణీ కార్యక్రమాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని సూచించింది. ప్రగతిశీల పన్నుల విధానం, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని కోరింది.
2022లో విడుదలైన అప్పటి ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం టాప్‌ 10శాతం మంది వ్యక్తుల దగ్గర 57శాతం మేర జాతీయ ఆదాయం ఉంది. అదే సమయంలో కింది స్థాయిలో 50శాతం మంది వాటా 2021లో కేవలం 13శాతంగా వుంది. సగటు వార్షిక ఆదాయం దాదాపుగా 6200 యూరోలుగా ఉంటే, సగటు సంపద 28వేల యూరోలుగా ఉంది. మహిళా కార్మికుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా అంటే 15.7శాతంగా ఉంది. గత దశాబ్ద కాలంలో ఎలాంటి పురోగతి లేదు. మొత్తమ్మీద, ఆదాయాలు, సంపద, లింగ వైవిధ్యత వంటి పలు అంశాల్లో భారతదేశంలో అసమానతలు చాలా లోతుగా పాతుకు పోయాయని, వీటివల్ల ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న వ్యవస్థాగతమైన విభేదాలను ఆ నివేదిక ప్రముఖంగా పేర్కొంది. ఆర్థికవేత్తలు జయతి ఘోష్‌, జోసెఫ్‌ స్టిగ్లిట్జ్‌లు ఈ నివేదికకు ముందు మాట రాశారు.
అంతర్జాతీయంగా సంపద చారిత్రక ఎత్తులకు చేరుకుంది. కానీ అత్యంత అసమానమైన రీతిలో పంపిణీ అవుతోంది. అగ్ర స్థానంలో ఉన్న 0.001శాతం మంది అంటే 60వేల కన్నా తక్కువమంది కోటీశ్వరులు కింది స్థాయిలోని మానవాళి వద్ద మొత్తంగా గల సంపద కన్నా మూడు రెట్లు ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు. వారి వాటా నిలకడగా పెరుగుతూ 1995లో దాదాపు 4శాతం నుంచి నేడు 6శాతానికి పైగా చేరుకుంది. పైగా అంతర్జాతీయ స్థాయిలో అసమానతలు పెచ్చరిల్లడం, బహుళపక్షవాదం బలహీనపడడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ధోరణి చోటు చేసుకుందని నివేదిక పేర్కొంది.
1980ల్లో అంతర్జాతీయంగా మధ్య తరగతి ఆదాయ గ్రూపుల్లో భారత్‌ సాపేక్షంగా పెద్ద వాటా కలిగి ఉంది. కానీ 2025 వచ్చేసరికి, దాదాపు భారత్‌లోని జనాభా అంతా ఆదాయ పంపిణీలో కింది స్థాయిలోని 50 శాతంలో ఉన్నారు. అదే సమయంలో చైనా ఎగువ మధ్య తరగతి వర్గాల్లోకి చేరింది. ఇక లింగ సమానతకు వచ్చినట్లైతే, భారతదేశంలో మహిళా కార్మికుల ప్రాతినిధ్యం అత్యంత తక్కువగా 15.7శాతం దగ్గరే నిలిచిపో యింది. గత పదేండ్లలో ఎలాంటి మెరుగుదల లేదు. ఇక అంతర్జాతీయంగా చూసినట్లైతే, గంటకు పురుషుడు సంపాదించే దానిలో 61శాతాన్నే మహిళలు సంపాదిస్తున్నారు. అన్‌పెయిడ్‌ లేబర్‌ను కూడా చేర్చినట్లైతే ఇది 32శాతానికి పడిపోతుంది. అంతర్జాతీయంగా మొత్తం కార్మిక ఆదాయంలో మహిళల వాటా కేవలం 25శాతంగానే ఉంది. 1990 నుంచి దీంట్లో ఎలాంటి మార్పు లేకుండా పోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -