దక్షిణాదికి తీరని నష్టం, అన్యాయం : సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలు నష్టపోతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో సీడబ్లూసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదనీ, ప్రస్తుతం ఉన్న సీట్లలో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పెంపు అత్యవసరం ఎందుకు? అని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీలో నియోజకవర్గాల పెంపుపై కీలకమైన అభిప్రాయాలను వ్యక్తపరిచినట్టు వెల్లడించారు. నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుందనీ, చిన్న రాష్ట్రాలు చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా అయిపోతాయనీ, చిన్న రాష్ట్రాలు ప్రాముఖ్యత కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నియోజకవర్గాల పెంపు ఉత్తరాదికి అడ్వాంటేజ్ గా మారనుందన్నారు. అదే జరిగితే ఉత్తరాది రాష్ట్రాలతోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారని తెలిపారు. నియోజకవర్గాల పెంపు పార్టీల సమస్య కాదు, ప్రాంతాల సమస్య అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాల పెంపు అనేది అందమైన ముసుగులో మోసం అని తెలిపారు. నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న గ్యాప్ ఉండాల్సిందేనన్నారు. ఆర్థిక ప్రాతిపదికన నియోజకవర్గాలు పెంచొచ్చని సూచించారు. దక్షిణాదిపై వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 50 శాతం పెంపుతో జరిగే నష్టాలపై సీడబ్ల్యూసీ స్పష్టంగా చెప్పినట్టు వెల్లడించారు. బీజేపీ పెడుతున్న మెలికల్లో రాజకీయ స్వార్థం ఉందనీ తాము వివక్షను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ఎలా పెంచాలనే చర్చ లేకుండా ఇప్పటికిప్పుడు ఎందుకింత అత్యవసరం పెంచడం? ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లలో 181 సీట్లను మహిళలకు ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు.
”తెలంగాణలో ఐదు నెలల్లో జనగణన, కులగణనలను పూర్తి చేశాం. కేంద్ర ప్రభుత్వం హడావిడి చేసి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చారు. రైతుల ఆందోళనతో మళ్లీ వెనక్కి తీసుకున్నారు. నియోజకవర్గాల పెంపుపై దక్షిణాదిలో వ్యతిరేకత వస్తే , చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే ఏం చేస్తారు? బిల్లు అడ్డుకోవాల్సి వస్తే పోరాటం తప్పదు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులుగా, ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయ రాజధానులుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ఒక్క రూపాయి కేంద్రానికి కడితే 42 పైసలే ఇస్తున్నారు. దక్షిణాదికి చాలా అన్యాయం జరుగుతుంది. మేం బాధతో ఉన్నాం. ఆర్థికంగా నష్టపోతున్నాం. రాజకీయంగా కూడా సెకండ్ గ్రేడ్‌గా చూస్తున్నారు.
మాపై వివక్ష కొనసాగుతుంది…. ” అని సీఎం రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లకు అవమానం జరిగిందని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆలె నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య, ఈటల రాజేందర్ తదితరులు ఎంతో మందికి బీఆర్‌ఎస్‌లో ఏం జరిగింది? ఆయన ప్రశ్నించారు. దక్షిణాది నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కింది. సీట్లు పెరిగాక చప్రాసి పదవి కూడా దొరకదని హెచ్చరించారు. తన పోరాటం తన కోసం కాదనీ, ప్రజల కోసమని స్పష్టం చేశారు. మెరిట్ డిసబిలిటీ విధానంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు 45 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాని కోసం ఎలా ముందుకెళ్లాలనే స్పష్టమైన ఆలోచన తనకుందని తెలిపారు. కలిసికట్టుగా సొసైటీ తరఫున కొన్ని ప్రతిపాదనలు ఇస్తే దానిపైన క్యాబినెట్ సబ్ కమిటీని వేస్తాను అని చెప్పారు. 45 రోజుల్లోనే సమస్యను పరిష్కరించి జూన్ రెండో తేదీ నాటికి కార్యరూపం దాల్చేలా చూస్తానని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. తాను స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలా ఇవ్వాలనేది నాకు తెలుసు.
తీసుకోవాలా? వద్దా? నష్టపోతారా అనేది మీరే ఆలోచించుకోండి అని కూడా ముఖ్యమంత్రి అన్నారు. ఈ విషయమై తను అసెంబ్లీలో చిట్‌చాట్‌లో సవివరంగా చెప్పిన తర్వాత కూడా మళ్లీ దాన్ని అర్థం చేసుకోకుండా రకరకాల ఆలోచనలు చేయటం సరైన విధానం కాదని ముఖ్యమంత్రి చెప్పారు. స్థలాల్లోకి వెళతాం, కబ్జాలు చేస్తాం ఇల్లు కట్టుకుంటామనేది ఆచరణ సాధ్యం కాని అంశాలన్నారు. అలాంటి వాటి గురించి ఆలోచించి నష్టపోకండి అని ముఖ్యమంత్రి సూచించారు. సొసైటీ తరఫున ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు కూడా జర్నలిస్టులకు ఇచ్చే స్థలాలకు సంబంధించి ఎలా ఉపయోగించాలనే విషయం కూడా తాను ఆలోచిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలకు నష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



