పిల్లల పెంపకంలో నమ్మకం, నిజాయితీ, అన్వేషణ, ఆసక్తి పునాదులు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మత గురువులు కీలక పాత్ర పోషిస్తారు.”నువ్వు నీ పిల్లల్ని ప్రేమిస్తే వాళ్ళకు ఎట్లాంటి నమ్మకాన్ని ఇవ్వకు. వాళ్ళకు సహాయపడు. వాళ్ళు అభిమానాన్ని పెంచుకుంటారు” ఈ వాక్యం మొదట వినడానికి విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక లోతైన మానసిక సూత్రం ఉంది. ఇక్కడ ‘నమ్మకాన్ని ఇవ్వకు’ అంటే గుడ్డిగా నమ్మకాలను రుద్దవద్దు అని అర్థం. బదులుగా, వారికి సహాయం చేయడం ద్వారా, వారి సమస్యలను పరిష్కరించడంలో వారికి మార్గనిర్దేశం చేయడం ద్వారా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ-సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. ఇది వారిని స్వతంత్రంగా ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. తద్వారా వారు మీ పై అభిమానాన్ని (గౌరవం, ప్రేమ) పెంపొందించుకుంటారు. ఇది బాల్యంలో సురక్షితమైన సహాయకరమైన వాతావరణం, పిల్లలలో ప్రాథమిక నమ్మకాన్ని పెంపొందిస్తుంది.
నిజాయితీ: సంబంధాలకు జీవం
”నీకేమీ తెలీకపోతే పిల్లల్తో అబద్ధాలాడకు. లేకుంటే ఎప్పడో ఒకప్పుడు అది అబద్ధమని వాళ్ళు తెలుసుకుంటారు. తండ్రి, ఉపాధ్యాయుడు, గురువు.. వీళ్ళు అబద్ధాలాడితే పిల్లలు వాళ్ల పట్ల అభిమానాన్ని కోల్పోతారు” ఇది మానసిక ఆరోగ్య సంబంధాల స్థాపనకు చాలా ముఖ్యమైన సూచన. పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు, తమ సంరక్షకులపై పూర్తిగా ఆధారపడతారు. వారిని ఆదర్శంగా చూస్తారు. తల్లిదండ్రులు అబద్ధాలు చెప్పినప్పుడు, అది పిల్లల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇది వారిలో అయోమయం, అభద్రత, మోసపోయిన భావనలను కలిగిస్తుంది. దీర్ఘకాలంలో ఇది సంబంధాల విచ్ఛిన్నానికి దారితీస్తుంది. పిల్లలు తమ సంరక్షకుల పట్ల గౌరవం, ప్రేమను కోల్పోతారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకోడైనమిక్ సిద్ధాంతం బాల్య అనుభవాలు వ్యక్తిత్వ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తుంది. అబద్ధాలు పిల్లలలో ఒత్తిడి, ఆందోళనను కూడా కలిగిస్తాయి. ఎందుకంటే వారు వాస్తవాన్ని గ్రహించడంలో ఇబ్బంది పడతారు.
అమాయకత్వం – ఆధారపడటం
”పిల్లలు తల్లిదండ్రులను సంపూర్ణంగా ప్రేమిస్తారు. పూర్తిగా వారిమీదే ఆధారపడతారు. నువ్వా బిడ్డను మోసగించవచ్చు. ఒకప్పటికి ఆ బిడ్డకు తెలుస్తుందనే సంగతి నీకు తెలీదు.” ఈ వాక్యాలు పిల్లల సున్నితత్వాన్ని, వారి ఆధారపడటాన్ని చెబుతున్నాయి. పిల్లలు నిస్వార్థమైన ప్రేమతో, నమ్మకంతో ఉంటారు. వారి అమాయకత్వాన్ని దుర్వినియోగం చేయడం, వారిని మోసగించడం నైతికంగా తప్పు మాత్రమే కాదు, మానసికంగా కూడా వారికి హానికరం. కాలక్రమేణా, పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు. అబద్ధాలను గుర్తిస్తారు. ఇది వారిలో కఠినమైన మానసిక గాయాలను (ట్రామా) కలిగించవచ్చు. భవిష్యత్తులో సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
అన్వేషణాసక్తిని పెంపొందించడం
పిల్లలు తమకు తెలియని విషయాన్ని తల్లిదండ్రులను అడిగినప్పుడు… ఆ విషయం తమకు కూడా తెలియకపోతే నిజాయితీగా ”నాకు కూడా తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను” అని చెప్పాలి. వీలైతే వారికి కూడా ఎలా తెలుసుకోవాలో నేర్పించాలి. అప్పుడు పిల్లలకి తల్లిదండ్రులమీద గౌరవంతోపాటు, నమ్మకం పెరుగుతుంది. ఈ విషయం జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా వివరిస్తుంది. ‘తెలియదు’ అని ఒప్పుకోవడం బలహీనత కాదు, నిజాయితీ కి చిహ్నం. పిల్లలు తమకు తెలియని విషయాల గురించి అడిగినప్పుడు, తల్లిదండ్రులు అన్నింటికీ సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బదులుగా, ‘నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను’ అని చెప్పడం ద్వారా, మీరు పిల్లలలో అన్వేషణాసక్తిని, జిజ్ఞాసను, తార్కిక ఆలోచనను పెంపొందిస్తారు. ఇది వారికి నేర్చుకునే ప్రక్రియను అర్థం చేసుకోవడానికి, జ్ఞానాన్ని నిరంతరం అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధానం పిల్లల్లో పెద్దల పట్ల గౌరవభావం పెంచేలా చేస్తుంది. ఇది బ్రొన్‌ఫెన్‌బ్రెన్నర్ ఎకలాజికల్ సిస్టమ్స్ సిద్ధాంతంలో, పిల్లల అభివద్ధికి పర్యావరణ వ్యవస్థలు, అనుభవాలు ఎలా దోహదపడతాయో వివరిస్తుంది. అన్వేషణను ప్రోత్సహించడం ద్వారా, తల్లిదండ్రులు పిల్లల అభిజ్ఞా, సామాజిక అభివద్ధిని సుసంపన్నం చేయగలరు.
ఇది పిల్లలలో సురక్షితమైన ఆరోగ్యకరమైన మానసిక వికాసాన్ని పెంపొందించడానికి, అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్య బలమైన, గౌరవనీయమైన సంబంధాలను నిర్మించడానికి ఒక ప్రాథమిక మార్గదర్శిగా నిలుస్తుంది. అబద్ధాలు, మోసాలు దీర్ఘకాలికంగా హానికరంగా ఉంటాయి, అయితే నిజాయితీ, జ్ఞానాన్ని అన్వేషించే స్ఫూర్తి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని, జిజ్ఞాసను, జీవితాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.
డా|| హిప్నో పద్మా కమలాకర్, 9390044031 కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్
అన్వేషణాసక్తిని పెంచండి
- Advertisement -
- Advertisement -