Tuesday, February 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగురుకులాల్లో ప్రవేశాలకు పెరిగిన దరఖాస్తులు

గురుకులాల్లో ప్రవేశాలకు పెరిగిన దరఖాస్తులు

- Advertisement -

అదనంగా 12,890 అప్లికేషన్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో చదివేందుకు పిల్లల్లో ఆసక్తి పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా ఆ దిశగా పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది 5వ తరగతి నుంచి 9వ తరగతుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులను స్వీకరించారు. గతేడాది కన్నా ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024-25 విద్యా సంవత్సరంలో బీసీ వెల్ఫేర్‌ గురుకులాల్లో ్ల అత్యధికంగా 1,40,646 మంది, సోషల్‌ వెల్ఫేర్‌లో 1,33,988 మంది, ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌ మెంట్‌ పరిధిలో 90,316 మంది, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సొసైటీ పరిధిలో 50,295 మంది, మైనార్టీ వెల్ఫేర్‌ సొసైటీ పరిధిలో 73,873 మంది చదువుతున్నారు. ప్రతి ఏటా సీట్లకు మించి దరఖాస్తులు వస్తుండటం గమనార్హం.

గత రెండేండ్ల నుంచి గురుకులాల్లో సీట్ల కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అంతకు ముందు మూడేండ్ల పాటు ఈ సంఖ్య వరసగా తగ్గుతూ వచ్చింది. 2022లో 1,98,338 మంది, 2023లో 1,81,224 మంది, 2024లో 1,53,328 మంది దరఖాస్తు చేయగా 2025లో 1,69,171 మంది, 2026లో 1,82,061 మంది ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బ్యాక్‌ లాగ్‌ సీట్ల కోసం ఐదేండ్లుగా దరఖాస్తులు పరిశీలిస్తే 2022లో 50,414 మంది, 2023లో 59,398 మంది, 2024లో 32,674 మంది, 2025లో 79,925 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ ఏడాది 1,02,960 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. 2024లో కేవలం 32, 674 మంది దరఖాస్తు చేసుకుంటే రెండేండ్లలో వారి సంఖ్య మూడింతలకు పైగా 1,02,960కు పెరిగింది. గతేడాదితో పోలిస్తే 6వ తరగతిలో చేరేందుకు 15,464, 7వ తరగతిలో 1,828 మంది, 8వ తరగతిలో 4,548 మంది, 9వ తరగతి లో చేరేందుకు 1,195 మంది ఎక్కువగా దరఖాస్తులు సమర్పించారు.

5వ తరగతి ప్రవేశాలకు తగ్గుతున్న దరఖాస్తులు
5వ తరగతులో ప్రవేశాల కోసం వస్తున్న దరఖాస్తులు ఐదేండ్లుగా ప్రతి ఏటా తగ్గుతున్నాయి. 2022లో 1,47,924 మంది, 2023లో 1,21,826 మంది, 2024లో 1,20,654 మంది, 2025లో 89,246 మంది, ఈ ఏడాది అతి తక్కువగా 79,101 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 కన్నా 2023లో 26,098, 2024లో 1,162, 2025లో 31,408, 2026లో 10,145 దరఖాస్తులు తగ్గాయి. అయితే ఐదో తరగతిలో 50 వేలకు పైగా సీట్లు ఉండగా, ఆ సీట్లకు మించి దరఖాస్తులు రావడం గమనార్హం. దరఖాస్తులు ప్రతి ఏటా తగ్గుతుండటంతో సాధారణ పాఠశాలల్లో బడి బాట మాదిరిగా, గురుకుల బాట వంటి కార్యక్రమాలతో గురుకులాల్లో ఉన్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరిం చేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆయా గురుకులాల సొసైటీల్లో ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -