ప్రజలపై భారాలొద్దు : సీపీఐ (ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం. వెంకటేష్
నవతెలంగాణ – ముషీరాబాద్
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించాలని, ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ గోల్కొండ చౌరస్తా బస్టాప్ వద్ద పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది నెలల కిందటే ఆర్టీసీ బస్‌పాస్ ధరలను పెంచారని, ప్రస్తుతం బస్సు చార్జీల పెంపు నిర్ణయం అన్యాయమని అన్నారు. ప్రజానీకంపై భారాలు మోపే నిర్ణయాలు ప్రజా రవాణాను బలహీన పరుస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా ఆర్టీసీ ప్రయివేటీకరణ చర్యలు చేపడుతున్నదన్నారు. ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సులను అద్దె బస్సులుగా మారుస్తూ ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్గో సర్వీసులనూ ప్రయివేటు సంస్థలకు అప్పగించే చర్యలు కొనసాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. ఇలాంటి ప్రయివేటీకరణ చర్యలను ఉపసంహరించి ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల ఉచిత రవాణా ఫలితంగా ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది కానీ దానికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నగరంలో రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.అరుణ జ్యోతి, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, ఎం.దశరథ్, ఎం.మహేందర్, నాయకులు ఆర్.వెంకటేష్, జి.నరేష్, ఎం.అజరు బాబు, ఎన్.మారన్న, జి.కిరణ్ పాల్గొన్నారు.
పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES