కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు కష్టమే
న్యూఢిల్లీ : కొత్తగా వచ్చే హెచ్-1బీ వీసా దరఖాస్తులకు ఏక మొత్తంలో లక్ష డాలర్ల ఫీజు విధించాలని అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మన యువ మహిళా దరఖాస్తుదారులకు అశనిపాతంలా మారే అవకాశం ఉంది. సాధారణంగా హెచ్-1బీ వీసాలతో ఉద్యోగాలు చేసే వారు ఎక్కువగా పురుషులే. 2023-24లో అమెరికాలో ఉద్యోగాలు కొనసాగించేందుకు అనుమతి పొందిన వారిలో 74 శాతం మంది పురుషులు కాగా మహిళలు 26 శాతం మంది మాత్రమే ఉన్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేందుకు అనుమతి లభించిన వారిలో 37 శాతం మంది మహిళలు. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమిటంటే హెచ్-1బీ వీసాలు కలిగిన వారిలో పురుషులే అధికం. అయితే తాజాగా వీసాల కోసం దరఖాస్తు చేస్తున్న వారిలో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. కానీ ఇప్పుడు దరఖాస్తు ఫీజును భారీగా పెంచేయడంతో వారు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు.
హెచ్-1బీ వీసాల ద్వారా కొత్తగా ఉపాధి పొందాలనుకుంటున్న వారికి వచ్చే వార్షిక వేతనాలు సహజంగానే తక్కువగా ఉంటాయి. అదే అప్పటికే ఉద్యోగాలలో కొనసాగుతున్న వారి జీతాలు వీరితో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు 2023-24లో కొత్తగా ఉద్యోగాలకు అనుమతి లభించిన వారి జీతాలు 77,000-1,30,000 డాలర్ల మధ్య ఉన్నాయి. అదే ఉద్యోగాలను కొనసాగిస్తున్న వారి జీతాలు 1,02,000-1,69,000 డాలర్ల మధ్య ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే కొత్తగా ఉద్యోగాలు పొందే వారి వీసా ఫీజును చెల్లించడం యాజమాన్యాలకు కష్టమవుతుంది. ఈ ప్రభావం ఎక్కువగా మహిళా దరఖాస్తుదారుల పైనే పడే అవకాశం ఉంది. ఎందుకంటే 2023-24లో అమెరికాలో కొత్తగా చేరిన మహిళా ఉద్యోగుల వార్షిక వేతనం 71,000-1,25,000 డాలర్ల మధ్య ఉంది. పురుషులతో పోలిస్తే మహిళల జీతాలు తక్కువగానే ఉంటున్నాయి. హెచ్-1బీ వీసాలు కలిగిన మహిళా ఉద్యోగులు పురుషుల కంటే తక్కువ వేతనాలు పొందుతున్న నేపథ్యంలో వారిని స్పాన్సర్ చేసేందుకు యాజమాన్యాలు ముందుకు రాకపోవచ్చు.
ఏదేమైనా కొత్తగా అమెరికా విధించిన ఫీజు భారం యువ దరఖాస్తుదారులపై…ముఖ్యంగా మహిళలపై ఎక్కువగా పడుతుంది. 35 సంవత్సరాల లోపు వయసు ఉండి, 2023-24లో కొత్తగా ఉద్యోగాలు పొందేందుకు అనుమతి పొందిన వారిలో 75 శాతం మంది మహిళలు కాగా 65 శాతం మంది పురుషులు. అంటే కెరీర్ ప్రారంభించే మహిళల పైనే ఎంట్రీ వ్యయం అధికంగా పడుతుందన్న మాట. అదే సంవత్సరంలో కొత్తగా ఉద్యోగాలు పొందేందుకు అనుమతి పొందిన మహిళల్లో 44 శాతం మంది మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకోగా పురుషుల్లో 39 శాతం మంది మాత్రమే ఆ పని చేశారు. బ్యాచ్‌లర్స్ డిగ్రీ మాత్రమే కలిగిన మహిళల వాటా కూడా తక్కువగానే ఉంది. డాక్టరేట్, ప్రొఫెషనల్ స్థాయిల్లో పురుషులు, మహిళల మధ్య వ్యత్యాసం పెద్దగా లేదు. పురుషులతో పోలిస్తే మహిళలకు ఎక్కువ విద్యార్హతలు ఉన్నప్పటికీ కొత్తగా దరఖాస్తు చేసే వారికే పెంచిన ఫీజులు వర్తిస్తాయి కాబట్టి మహిళల పైనే ప్రభావం అధికంగా పడుతుంది.