– ఏడు నెలల్లో 334 ఘటనలు
– యూపీ, ఛత్తీస్‌గఢ్‌లో అధికం
న్యూఢిల్లీ : దేశంలో క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయని ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియాస్ రెలిజియస్ లిబర్జీ కమిషన్ (ఈఎఫ్‌ఐఆర్‌ఎల్‌సీ) ఒక నివేదికలో తెలియజేసింది. ఈ సంవత్సరం జనవరి, జూలై మధ్య కాలంలో దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని 334 దాడులు జరిగాయని ఆ నివేదిక వివరించింది. వేధింపులు, హింస, మత స్వేచ్ఛ అణచివేతకు సంబంధించిన ఘటనలను ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 95 దాడులు జరగగా 86 ఘటనలతో ఛత్తీస్‌గఢ్ రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన దాడులలో ఈ రెండు రాష్ట్రాల వాటాయే 54 శాతం ఉండడం గమనార్హం. మధ్యప్రదేశ్ (22), బీహార్ (17), కర్నాటక (17), హర్యానా (17), రాజస్థాన్ (15)లో కూడా క్రైస్తవులపై గణనీయ సంఖ్యలోనే దాడులు జరిగాయి.
క్రైస్తవ సమాజమే లక్ష్యంగా…
మార్చిలో అత్యధికంగా 66 ఘటనలు నమోదు కాగా జూన్‌లో 52, ఫిబ్రవరిలో 48 జరిగాయి. ఈ ఏడు నెలల కాలంలోనూ దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయని నివేదిక ఎత్తిచూపింది. ఆదివారం జరిగే ప్రార్థనా సమావేశాలను లక్ష్యంగా చేసుకొని ఎక్కువగా దాడులు చేశారు. మతపరమైన సమావేశాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే వీటి ఉద్దేశం. సంఘటనలను నివేదిక ఏడు కేటగిరీలుగా వర్గీకరించింది. అవి బెదిరింపులు, వేధింపులు (107), తప్పుడు ఆరోపణలు, అరెస్టులు (116), భౌతిక హింస (42), అరెస్టులు (49), చర్చి కార్యకలాపాలకు ఆటంకం (29), సామాజిక బహిష్కరణలు (19), విధ్వంసం (7), చర్చిల దగ్థం (4), లింగ వివక్షకు సంబంధించిన హింస (4), విద్వేష ప్రచారం (3), బలవంతపు మతమార్పిడి (2), హత్య (1). క్రైస్తవ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని ఏ విధంగా భయపెట్టారో, హింసించారో ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
ఖననానికి సైతం నిరాకరణ
మరణించిన క్రైస్తవులను ఖననం చేయకుండా అడ్డుకున్న సందర్భాలు కూడా 13 ఉన్నాయని ఈఎఫ్‌ఐఆర్‌ఎల్‌సీ తన నివేదికలో తెలిపింది. వీటిలో 12 కేసులు ఛత్తీస్‌గఢ్‌లోనే వెలుగు చూశాయి. చనిపోయిన బంధువును సొంత స్థలంలో సైతం ఖననం చేయకుండా క్రైస్తవ కుటుంబాలను అడ్డుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఇది క్రైస్తవులకు ఉన్న మత, సాంస్కృతిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. గత నెల 20న ఛత్తీస్‌గఢ్‌లోని భిలారులో జరిగిన హింసాత్మక దాడిని నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. బజరంగ్‌దళ్‌కు చెందిన కొందరు సభ్యులు ప్రార్థనా సమావేశంపై దాడి చేశారు. చట్టవిరుద్ధంగా మత మార్పిడులు చేస్తున్నారంటూ పాస్టర్లను నిందించారు. పోలీసు రక్షణ కావాలని పాస్టర్లు కోరితే ఆరుగురిని నిర్బంధించి జైలులో చిత్రహింసలు పెట్టారు. పాస్టర్లపై దాడి చేసిన వారిపై కానీ, జైలు అధికారులపై కానీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో కూడా ఓ ఘటన జరిగింది.
పాస్టర్ చనిపోతే ప్రైవేటు భూమిలో కూడా ఆయనను ఖననం చేసేందుకు గ్రామస్తులు అంగీకరించలేదు. బీహార్‌లోని సరన్‌లో ప్రార్థనా సమావేశంపై దాడి చేశారు. గుజరాత్‌లో ఈస్టర్ ప్రార్థనలను సాయుధ దుండగులు అడ్డుకున్నారు. ఒడిషాలో పుట్టినరోజు వేడుక సందర్భంగా మత మార్పిడి చేస్తున్నారన్న తప్పుడు ఆరోపణతో పాస్టర్‌పై భౌతిక దాడి జరిగింది. వాస్తవానికి దేశంలో క్రైస్తవులపై లెక్కలేనన్ని దాడులు జరుగుతున్నాయని, నివేదికలో ప్రస్తావించినవి కొన్ని మాత్రమేనని కమిషన్ తెలిపింది. భయం, ఒంటరితనం, సరైన పత్రాలు లేకపోవడం వంటి కారణాలతో అనేక ఘటనలు వెలుగు చూడడం లేదు.
నివేదిక ఏం చెప్పింది?
క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నివేదిక సిఫార్సు చేసింది. అనేక రాష్ట్రాలలో దుర్వినియోగానికి గురవుతున్న మత మార్పిడుల నిరోధక చట్టాలను రద్దు చేయాలని సూచిం చింది. విద్వేషాలను రెచ్చగొడుతున్న ముఠాలపై విచారణ జరపాలని, ఖనన హక్కులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు పరిహారం చెల్లించాలని, మత స్వేచ్ఛకు సంబంధిం చిన కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కోరింది. క్రైస్తవ సమాజాలలో నిస్సహాయత పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ మతపరమైన మైనారిటీల రాజ్యాంగ హక్కులను పరిరక్షిం చేందుకు తక్షణమే విధానపరంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
క్రైస్తవులపై పెరుగుతున్న దాడులు
- Advertisement -
- Advertisement -