పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి : బీసీ జేఏసీ నాయకులు
ఇందిరాపార్క్ వద్ద ధర్మపోరాట దీక్ష
నవతెలంగాణ – ముషీరాబాద్
బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచడం ధర్మబద్ధమేనని బీసీ జేఏసీ నాయకులు అన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న వారికే తాము వ్యతిరేకమని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద గురువారం బీసీ జేఏసీ నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ‘ధర్మ పోరాట దీక్ష’ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించడం న్యాయమైనదేనని అన్నారు. బీసీలు వెనుకబడి ఉన్నారని కమిషన్లు తేల్చినప్పుడు.. వారికి జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటే తప్పులేదన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని మోడీతో మాట్లాడతానని చెప్పారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ.. బీసీల డిమాండ్ న్యాయమైనదని, ప్రజాస్వామ్యమైనదని, దాన్ని పరిష్కరించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాలు పట్టింపులకు పోతే తెలంగాణ ఉద్యమం తరాహాలో బీసీ ఉద్యమం కూడా ఉవ్వెత్తున లేస్తుందని హెచ్చరించారు.
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వాలు బీసీలను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనేది న్యాయమైన పోరాటమని, అది సాధించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. బీసీలను మోసం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తే ఊరుకునేది లేదన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యలు చేపట్టొద్దని, మరో రెండు నెలలు ఆగితే స్పష్టత వస్తుందని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ పోరాడితే బీఆర్‌ఎస్ మద్దతిస్తుందని చెప్పారు.
బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మెన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అధినాయకత్వంలో పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని ఒప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, పలువురు బీసీ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై మద్దతు తెలిపారు. బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మ, సంచారజాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరస్వామి, బీసీ ఏ కులాల అధ్యక్షులు ప్రొఫెసర్ భాగయ్య, బీసీ మహిళా సంఘం అధ్యక్షులు బి.మని మంజరి సాగర్, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల నేతలు ఉప్పరి శేఖర్ సగర, వేముల రామకృష్ణ పాల్గొన్నారు.



