పరిశ్రమల రంగానికి మూల సంపద ఖనిజాలు
ఎస్కీలో మైనింగ్‌పై జాతీయ సదస్సులో వక్తలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
టెక్నాలజీతో మైనింగ్ రంగంలో ఉత్పత్తిని పెంచొచ్చని, విశాలమైన ఈ విశ్వంలో అపారమైన ఖనిజ సంపద కలిగి ఉండటం ప్రకృతి మనకిచ్చిన వర ప్రసాదమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హరి సర్వోత్తమన్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో గురువారం నుంచి ప్రారంభమైన మూడ్రోజుల మైనింగ్ జాతీయ సదస్సు ‘ఆపరేషనల్ ఎక్సెలెన్స్ ఇన్ మైన్స్ త్రూఇన్నోవేటివ్ టెక్నాలజీ’ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పరిశ్రమల రంగానికి ఖనిజాలు మూల సంపదని, గుండు పిన్ను తయారీ నుంచి రాకెట్ ప్రయోగాల వరకు ఖనిజ సంపద అవసరమని చెప్పారు.
గ్లోబల్ పోటీని ఎదుర్కోవాలంటే మైనింగ్ రంగంలో ఇంకా ప్రపంచ స్థాయి టెక్నాలజీలు, నూతన ఆవిష్కరణలు అవసరం ఉందని అన్నారు. ఆపరేషనల్ ఎక్సలెన్స్ ద్వారా వృథా తగ్గిపోయి ఉత్పాదకత, కార్మికుల భద్రత పెరుగుతుందన్నారు. ఓయూ కాలేజీ అఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ కె..శ్రీనివాస్ మాట్లాడుతూ.. మైనింగ్ రంగం ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్, డిజిటలైజేషన్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ వైపు వేగంగా పయనిస్తోందన్నారు. ఆటోమేషన్, రోబోటిక్స్, రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్స్, డేటా అనలిటిక్స్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ తదితర ఆధునిక టెక్నాలజీల ద్వారా దేశ ఆర్థిక పురోగతిలో మైనింగ్ రంగం ప్రధానపాత్రను పోషిస్తున్నదన్నారు. ఎన్‌ఐటి, సురత్కాల్‌లో సివిల్ ఇంజినీరింగ్ హెడ్‌గా పనిచేసిన డాక్టర్ డి.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి జాతీయ వేదికలు ఇంజినీరింగ్ ప్రముఖులను కలుపుతుందన్నారు. అకాడెమియా, పరిశ్రమలు, ప్రభుత్వ వర్గాలందరూ తమ ఆలోచనలను పంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
పరిశ్రమల వెన్నెముక ఖనిజాలు
ఖనిజాలు పరిశ్రమల వెన్నెముక అని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్ రావు తెలిపారు. మైనింగ్ ప్రొఫెషనల్స్, ఇంజినీర్లు, భద్రతాధికారులు, పాలసీ మేకర్లు పాల్గొంటున్న ఈ జాతీయ సదస్సు స్మార్ట్ మైనింగ్ పరిష్కారాల అమలు, ప్రమాదాల తగ్గింపు, వనరుల నిర్వహణ ఆప్టిమైజేషన్ వంటి అంశాలపై చర్చిస్తుందన్నారు ఎస్కీ మైనింగ్ హెడ్ కెజె.అమరనాథ్ మాట్లాడుతూ.. భారత మైనింగ్ రంగాన్ని గ్లోబల్ స్టాండర్డ్స్ వైపు తీసుకెళ్లే ఆలోచనలతోనే ఎస్కీ ఇలాంటి జాతీయ సదస్సుల ద్వారా ఒక రోడ్‌మ్యాప్ తయారు చేస్తున్నామన్నారు. ఈ జాతీయ సదస్సుకు సంబంధించిన అంశంపై ప్రముఖుల పరిశోధనాత్మకమైన వ్యాసాలతో సావనీర్‌ను రూపొందించామని, సదస్సులో జరిగే డిబేట్స్ ప్రతిపాదనలను కోల్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్, సింగరేణితోపాటు ప్రముఖ ప్రభుత్వ, ప్రయివేట్ ఇంజినీరింగ్ పరిశ్రమలకు పంపిస్తామన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ కె.సత్యలక్ష్మి సదస్సు నిర్వహణను పర్యవేక్షించారు. ఈ సదస్సులో కోల్ ఇండియా, సింగరేణి, ఎన్‌టిపీసి, వెన్సార్ కన్‌స్ట్రక్షన్, జిటిఎస్ మైనింగ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు, యూనివర్సిటీ కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులు, మైనింగ్ ఫ్యాకల్టీ ఎల్.కృష్ణ పాల్గొన్నారు.
టెక్నాలజీతో మైనింగ్ రంగంలో ఉత్పత్తి పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



