అదే దారిలో వృత్తివిద్యా కళాశాలలు
16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల బంద్
ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
టోకెన్లు ఇచ్చిన రూ.1200 కోట్లు నెలాఖరులోగా చెల్లించాలి : ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌కు ఎఫ్‌ఏటీహెచ్‌ఐ చైర్మెన్ రమేష్‌బాబు వినతిపత్రం అందజేత
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.పది వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఏటీహెచ్‌ఐ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఫీజు బకాయిలతో కాలేజీలను నడపలేమనీ, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, అద్దెలు కట్టలేని పరిస్థితి ఉందని ప్రకటించింది. అందుకే ఈ నెల 15 నుంచి ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కాలేజీలు నిరవధిక బంద్ చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టా రెడ్డిని ఎఫ్‌ఏటీహెచ్‌ఐ చైర్మెన్ నిమ్మటూరి రమేష్‌బాబు, సెక్రెటరీ జనరల్ రవికుమార్, కోశాధికారి కొడాలి కృష్ణా రావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె సునీల్‌కుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో రమేష్ బాబు, రవికుమార్ మాట్లాడుతూ ఆర్థిక శాఖ టోకెన్లు ఇచ్చిన నిధులు రూ.1,200 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలను ఈనెలఖరులోగా చెల్లించాలని కోరారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచి ఫీజు బకాయిలున్నాయని చెప్పారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో అధ్యాపకులు ప్రయివేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఉన్న అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికీ జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు. దసరా పండుగ వస్తున్నదనీ, అప్పుడు కూడా జీతాలివ్వకపోతే ఎలా?అని ప్రశ్నించారు. జీతాలివ్వకుంటే కాలేజీలకు రాబోమంటూ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది యాజ మాన్యాలకు తెలియజేస్తున్నారని అన్నారు. ప్రయివేటు ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొన్ని కాలేజీలు అద్దె కట్టలేని పరిస్థితిలో ఉన్నాయని వివ రించారు. ఇంకోవైపు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించలేకపోతున్నామన్నారు. అందుకే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈనెల 15 నుంచి రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, ఆర్కిటెక్చర్, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ, పారామెడికల్ కాలేజీలు నిరవధిక బంద్ చేయాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యి ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో పది లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఏటీహెచ్‌ఐ ప్రతినిధులు అల్జాపూర్ శ్రీనివాస్, తుమ్మ జైపాల్‌రెడ్డి, ఎస్ పరమేశ్వర్‌రెడ్డి, రేపాక ప్రదీప్‌రెడ్డి, గుర్రం
నాగయ్య, కె రామదాస్, ముద్దసాని రమేష్‌రెడ్డి, పుల్లా రమేష్‌బాబు, గోపగాని వెంకట నారాయణ, శ్రీనివాస్ ఆచార్య తాడూరి, సరస్వతీ రమేష్, కోదాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ : సూర్యనారాయణరెడ్డి
అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేక, అద్దెలు కట్టలేక ఈనెల 16 నుంచి రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ కాలేజీలను నిరవధిక బంద్ చేయాలని నిర్ణయించామని టీపీడీఎంఏ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణరెడ్డి చెప్పారు. ఫీజు బకాయిలను ఈ ఏడాది మే 20లోపు విడుదల చేయిస్తామంటూ ఉన్నత విద్యామండలి చైర్మెన్ హామీ ఇవ్వడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో తాము డిగ్రీ విద్యార్థుల పరీక్షలను నిర్వహించామని గుర్తు చేశారు. డిగ్రీ, పీజీ కాలేజీలకు రూ.2,500 కోట్ల వరకు ఫీజు బకాయిలున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రయివేటు కాలేజీలను ప్రభుత్వం తీసుకుని నడపాలని కోరారు. తాము కాలేజీలను నడపలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. టీపీడీఎంఏ ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ మాట్లాడుతూ విద్యావైద్య రంగాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. 20 నెలలైనా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం : బాలకిష్టారెడ్డి
ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఈనెల 15 నుంచి ఇంజినీరింగ్ సహా వృత్తి కాలేజీలు, 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల నిరవధిక బంద్ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి చెప్పారు. తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ అంశాన్ని వివరిస్తామని అన్నారు. సమస్య పరిష్కారం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.